వీర ప్రేక్షకులు (కవిత)
వాడి కాగితాల చూపుల్నిండా
టన్నుల కొద్దీ వ్యూహాలు.
తన తల్లో వండిన కలలుగానే
కొత్త రంగులు పూస్తుంటాడు
కొలతలేసి చూపుతుంటాడు.
మాటల గాలిపటాల్ని గీసి
మిరుమిట్ల మిణుగుర్లతికించి
హద్దుల్లేని ఆకాశంలో
మేకే అందని అతి ఎత్తుల్లో
ప్రదర్శనలు సాగిస్తుంటాడు.
కలలెందుకు కనాలో
కన్న కలలకు దార్లెలా వేయాలో
ప్రయత్నించే మీరు మీ మేధస్సే మరచి
వాడి మాటల గాలాల ఆటలకు
మంచి ప్రేక్షకుల్లా తయారౌతారు!!
వాడు మార్చే మాటవెనుక మాట
ఆడే ఆటవెనుక ఆటల
రసవత్తర ఘట్టాల్లో మునిగి
మిమ్మల్ని మీరే పోగొట్టుకొని
మరబొమ్మలుగానో
మరో మైమింగ్ ఆకారాలుగానో
రూపాంతర గుంపు లౌతారు!!
ఇక వాడికి మీతో పనేవుండదు
మీరు మాత్రం –వాడి
కదలికల్లో అంగాంగమై
మాటలమంత్రాల పీడితులై
నేలవీడి నింగిలో సాముచేసే వాన్ని
అలా వీక్షిస్తూనే వుంటారు!
వీర ప్రేక్షక పాత్రలు పోషిస్తూనే వుంటారు!!
– సడ్లపల్లె చిదంబరరెడ్డి
(sadlapallechidambarareddy@gmail.com)
[author title=”రచయిత గురించి” image=”https://kadapa.info/wp-content/uploads/2014/09/sadlapalli.jpg”]
సడ్లపల్లె చిదంబరరెడ్డి గారు రాయలసీమకు చెందిన ఒక ప్రముఖ కవీ, కథా రచయితానూ. వీరు రాసిన కథలు ‘ఇసక’, ‘కొల్లబోయిన పల్లె’ పేర సంకలనంగా మరియు కవితలు ‘ద్రుశ్యప్రవాహం’, ‘భావనాపల్లవం’ పేర సంకలనాలుగా వెలువడ్డాయి. ‘దృశ్య ప్రవాహం’ సంకలనానికి గాను వీరు సిపి బ్రౌన్ (బెంగుళూరు), సిలప్రశెట్టి (అనకపల్లె) మరియు “అనంత ఆణిముత్యం” పురస్కారాలను అందుకున్నారు. ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన వీరు అనంతపురం జిల్లాలోని హిందూపురంలో స్థిరపడ్డారు. ఫోన్ నంబర్: +91-9440073636
[/author]