శుక్రవారం , 27 డిసెంబర్ 2024

ఎంజె సుబ్బరామిరెడ్డి – మహా మొండిమనిషి

ఆ మిణుగురు దారి పొడవునా వెలుతురు పువ్వుల్ని రాల్చుకుంటూ వెళ్ళిపోయింది. పదండి, ఏరుకుంటూ ముందుకెళదాం..”

కామ్రేడ్‌ ఎం.జె కోసం ఒక కవి మిత్రుడి కలం నుండి మెరిసిన అక్షర నివాళి. ఇవి ఆయన జీవితానికి అద్దం పట్టే పదాలు.

ఎంజెగా రాయలసీమలో సుపరిచితులైన ములపాకు జంగంరెడ్డి సుబ్బరామిరెడ్డి తన జీవితమంతా వ్యవస్థతో గొడవ పడుతూ ఈ ఆగస్టు 2న (తన 62వ ఏట) శాశ్వత విశ్రాంతికిలోకి వెళ్ళిపోయాడు.

చేతిలో సంచి, మాసిన గడ్డం, అడ్డపంచె, భుజంపై ఎర్ర తువాలు.. పాత తరం మధ్యతరగతి రైతు ఆహార్యంతో దాదాపు జీవితమంతా సంచారంలోనే గడిపిన ఎం.జె.ది అంతుపట్టని ఒక విలక్షణమైన వ్యక్తిత్వం.

రాయలసీమలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా విప్లవ ప్రజాసంఘాలతో పరిచయమున్న వారందరూ ఆయనను మహామొండి మనిషిగా గుర్తిస్తారు. ఆయన ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఏ పిలుపులేకపోయినా ఎక్కడినుండో వచ్చి ప్రత్యక్షమవుతాడు. (విరసం సభల్లో దాదాపు తప్పనిసరిగా కనపడేవాడు.) ఉపన్యాసాలు, చర్చలు సాంతం శ్రద్ధగా వింటాడు.

చిత్తుకాగితాల వంటి వాటిపై రాసుకుంటూ కూర్చుంటాడు. ఆయనకు అవసరమనిపించినప్పుడు, అది ఏ మీటింగౖైెనా చనువుగా చొరబడి మాట్లాడతాడు. వాదిస్తాడు. ఒక్కోసారి ఆయన నమ్మే భావజాలానికి ఏ మాత్రం సంబంధం లేని సమావేశాల్లో చొరబడి గొడవ పడతాడు. అధికార్లను, సోకాల్డ్‌ ప్రజాప్రతినిధులను చడామడా కడిగేస్తాడు. చాలాసార్లు గెంటేయబడతాడు. ఒక్కోసారి దెబ్బలు కూడా తింటాడు. ఆయనంతే, మొండోడు.. పిచ్చోడు.. అనే కామెంట్స్‌ తరచుగా వినపడుతుంటాయి. కాని ఆయన్ని కదిలిస్తే అనల్గళంగా సిద్ధాంతం, రాజకీయాలు చర్చిస్తాడు. పురాణాలు, మతగ్రంధాలను రెఫర్‌ చేస్తాడు. ఎక్కడెక్కడి చరిత్రనో కళ్ళమందు నిలుపుతాడు.

రాయలసీమ నీటి కేటాయింపులు, వివాదాలు, టియంసిల లెక్కలు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా విడమర్చి చెప్తాడు. మొండిగా, మొరటుగా ఉంటాడు కానీ, ఆయన జ్ఞానం అనితరసాధ్యం… ఇవి ఆయనతో ఏ కొద్ది పరిచయమున్న వ్యక్తులైనా ఆయన గురించి చెప్పే విషయాలు. ఎవరెన్ని పరిశీలనలు చేసినా సులభంగా అంతుచిక్కని సంక్లిష్టత ఆయన వ్యక్తిత్వానిది.

ఎం.జెకు వ్యక్తిగత జీవితం దాదాపు లేదు. ఆయన వివాహం చేసుకోలేదు. కడపజిల్లా మైదుకూరులో ఆయన అక్క, మేనళ్ళుడి ఇళ్ళు కేరాఫ్‌ అడ్రస్‌. మైదుకూరులో బస్సుదిగి ఎవ్వరినడిగినా ఆయన ఎక్కడుంటారో చెప్తారు. అయినా ఆయనది ఎక్కువగా సంచార జీవితమే. ఏ ఊరిలో ఏ సమస్యపై ఆందోళనకు దిగుతాడో అది తేలే వరకు ఆయన మకాం అక్కడే. కడుపునిండా తిండి తప్ప ఏమీ ఆశించని వాడు.

చదవండి :  సీమ బొగ్గులు (ముందు మాట) - వరలక్ష్మి

సుదీర్ఘకాలంపాటు కె.సి. కెనాల్‌ ఆయకట్టుదారుల సమస్యలపై, కె.పి. ఉల్లి గిట్టుబాటు ధర కోసం, పసుపు రైతుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన వాడు. మద్యంపై రాజీలేని పోరాటం చేసినవాడు. ఎక్కడికక్కడ ప్రజాసమస్యలపై ఉద్యమించే ఆయన తెగింపు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తుంది. అది ఒక సమూహానికి సంబంధించిన సమస్య అయినా, ఒక వ్యక్తి సమస్య అయినా బాధితులను వెంటబెట్టుకొని అధికార్లతో, నాయకులతో గొడవకు తెగబడతాడు. చాలాసార్లు ఒక్కడిగానే!

జనం మన వెంట లేకుంటేనేం, తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఎండగట్టాలి. అన్యాయాన్ని అన్యాయం అనాలి. మీరెవ్వరూ లేకపోయినా నేనొక్కడినైనా నిలబడతానంటాడు. దానివల్ల ప్రయోజనమేంటి అంటే తప్పును తప్పు అనడం, అన్యాయాన్ని అన్యాయం అని అరవడమే ప్రయోజనం అని వాదిస్తాడు. ఇంకొంచెం వాదనలోకి దిగితే కోపంతో విరుచుకుపడతాడు.

లెక్కలేనన్నిసార్లు పోలీసు దెబ్బలు తిని ఉంటాడు. రక్తం కార్చుకుంటూనే నిరసనల్లో పాల్గొన్న సందర్భాలున్నాయి. ఎన్నో సార్లు అరెస్టయ్యాడు. కేసుల గురించి లాయర్లకే సలహాలిస్తాడు. ఆయన కేసులు ఆయనే వాదించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అంతుబట్టదు. ఇటీవలి ఉపఎన్నికల్లో పోటీచేయడానికి ఆయన పులివెందుల బయలుదేరి వెళ్లాడు. వై.యస్‌.విజయమ్మకు పోటీగా నామినేషన్‌ వేయబోతే అక్కడ ఆయనను అడ్డుకొని అరెస్టు చేశారు. మరుసటిరోజు ‘పులివెందులలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఇదే దాఖలా’ అంటూ అయన ఇచ్చిన పత్రికా ప్రకటన చూసి మేమంతా అవాక్కయ్యాం. ఆయన ఏ సంఘంలోనూ ఉండడు. ఒక్కోసారి సంఘాలే ఆయన దగ్గరికి పోయి ఆందోళనలకు మద్దతుగా నిలబడతాయి. ఆయన మొండితనం నిర్మాణాలకు సమస్యలు తెచ్చిపెట్టేది. (వివిధ కమిటీల్లో ఆయనతోపాటు పనిచేసిన వారు దీనికి సంబంధించిన ఎన్నో అనుభవాలు చెప్తారు.) అసలు ఆయనే నిర్మాణాల్లో పొసగేవాడు కాదు.

విద్యార్థి దశనుండి వివిధ సంఘాల్లో పనిచేసి చివరికి ఆయనే రాయలసీమ పౌరహక్కుల సంఘం పెట్టుకున్నాడు. అందులో ఆయన తప్ప మరో కార్యకర్త కనపడరు.

నిజానికి ఆయన వ్యక్తిత్వం నిర్మాణాల్లో పనిచేస్తున్న వారికి పెద్ద ప్రశ్న. అతడే ఒక సైన్యంలా కదిలే బలం ఆయనకు ఎక్కడి నుండి వచ్చింది? ఏ నిర్మాణాల్లో లేకున్నా ఆయన జనంతో, జనం ఆయనతో ఎలా ఉన్నారు? బహుషా అది వ్యక్తిగత జీవితాన్ని త్యజించడం వల్ల వచ్చిన బలమేమో. విప్లవ రాజకీయాలు సరే. కాని వ్యవస్థతో రాజీపడనితత్వం ఆయన వ్యక్తితత్వంలోనే ఉన్నది కావచ్చు.

చదవండి :  ఆరవేటి శ్రీనివాసులు - కళాకారుడు

వ్యవస్థ దుర్మార్గాల పట్ల విపరీతమైన అసహనం, ప్రజలపై అవ్యాజమైన ప్రేమ, మాటలో, చేతలో ఎక్కడా తొణకనితనం ఆయన చిన్నతనం నుండి ఉండేదని చెప్తారు. చిన్నతనంలో ఆయన గాంధేయవాది. ఆయన పుట్టిన ఊరు తిప్పాయపల్లెలో మరుగుదొడ్లు ఊడ్చడం చూసి ఆయనను పిచ్చోడనుకునేవారట. విద్యార్థిగా ఆయన అత్యంత చురుకైన పిల్లవాడని ఆయన మిత్రులు చెప్తారు. ఫిఫ్త్‌ ఫారంలోనే ఆయన కంద పద్యం రాసి గురువుల్ని ఆశ్చర్యపరిచాడట.

ఎస్సెస్‌ఎల్సీలో ఉన్నప్పుడు భగవద్గీత శ్లోకాలు అనల్గళంగా వల్లెవేయడం చూసి ఏదో హిందూమతపీఠం వాళ్ళు ఆయనను సన్యాసాశ్రమంలోకి ఆహ్వానించిన సందర్భమొకటి వాళ్ళ బంధువులు చెప్తారు. అయితే అటుతర్వాత ఆయన హేతువాద, వామపక్ష సాహిత్యం, మిత్రుల సాహచర్యంలో కమ్యూనిస్టయ్యాడు. నక్సల్బరీ రాజకీయాల వెలుగులో తొలిదశలో ఆయన విరసం సభ్యుడయ్యాడు. ఆ తర్వాత రైతుకూలీ సంఘంలో, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘంలోనూ పనిచేశాడు. అదే సమయంలో 1972 జైఆంధ్రా ఉద్యమం, 80ల్లో జరిగిన రాయలసీమ ఉద్యమంలో ఆయనది క్రియాశీలక పాత్ర.

రాయలసీమ విషయంలో ఆయనది కచ్చితమైన వైఖరి. ఇటీవలి ‘సమైక్యాంధ్ర’ శబ్దకాలష్యంలో ఆయన కడప నుండి ప్రత్యేక రాయలసీమ వాదన వినిపించడమే కాదు, తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గట్టిగా బలపరిచాడు. రెండు ప్రాంతాల్లో పెద్దమనుషుల ఒప్పందాలు ఎట్లా వంచనకు గురయ్యాయో ఆయన అత్యంత వివరంగా, అంతే సరళంగా వివరించేవాడు.

మొరటుగా, మొండిగా కనపడే ఎంజె ఒక్కోసారి ఏదో జనం సమస్యను వివిరిస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. ఆయన మొండి తనం వెనక ఉన్న సున్నిత మనసు చూడగలిగితే బహుషా ఆయన సంక్లిష్టమైన వ్యక్తిత్వం అర్థమవుతుంది.

ఒకసారి చెన్నూరు(కడప పక్కన చిన్న ఊరు)లో బాగా తాగి ఉన్న ఒక పోలీసాయన దారిలో అడ్డంగా మొరుగుతున్న ఒక కుక్కను విపరీతంగా కొడితే అది చచ్చిపోయింది. ఎంజె దాన్ని తీసుకుని సరాసరి పోలీసుస్టేషనుకు పోయి కేసు రిజిస్టరు చేయమని పోలీసులతో గొడవపడ్డాడట. ఆయనకు ప్రాణం విలువను గుర్తించడంలో, హింస పట్ల వ్యతిరేకతలో ఎంత సున్నితత్వం, గాఢత ఉన్నాయో అంచనావేయగలిగితేగాని వ్యవస్థ పట్ల, దాని దుర్మార్గం పట్ల ఆయనకున్న ఆగ్రహంలోని తీవ్రత అర్థం కాదు. ఈ సంఘంలోని అపసవ్యతను, అన్యాయాలను ప్రశ్నించిన వేమన వంటి వ్యక్తిత్వం రూపుదిద్దుకున్న రాయలసీమలో ఎంజె వంటి మరో విలక్షణమైన వ్యక్తిత్వం రూపొందింది.

చదవండి :  'గడ్డం పొడవునుబట్టా, తెల్లబడిన వెంట్రుకను బట్టా' - సభాపతీయం 1

సమాజంలో వ్యక్తిగత ఆస్తి పునాదిపై నిర్మాణమైన కుహనా విలువల్ని కాలదన్నివేసి, తనసొంతమైనదంటూ ఏమీ ఉంచుకోని ధిక్కార సంస్కృతికి చిహ్నమైన వేమన అంటే ఎంజెకు చాలా ఇష్టం. విగ్రహాల సంస్కృతికి వ్యతిరేకమైనా మైదుకూరులో వేమన విగ్రహాన్ని నెలకొల్పడానికి ఆయన పోరాటం చేశాడు. ఈ ఆధునిక యుగంలోనూ ఫ్యూడల్‌ పట్టు విపరీతంగా ఉన్న రాయలసీమలో, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాల ప్రభావాలు పెద్దగా లేని రాయలసీమలో వ్యక్తిగానే వ్యవస్థతో జీవితమంతా గొడవపడుతూనే వెళ్ళిపోయిన ఆయన విప్లవ రాజకీయాలతో ఉంటూ కూడా ఏ నిర్మాణాలు చేయలేకపోవడానికి, ఏ నిర్మాణాల్లో భాగం కాలేకపోడానికి ఆ నేల నుండి రూపుదిద్దుకున్న ఆయన సంక్లిష్టమైన వ్యక్తిత్వమే కారణమా. ఆలోచించాలి.

’91 నుండి ఎంజె రాయలసీమ పౌరహక్కుల సంఘం పేరుతో అన్నీ తానే అయి పనిచేస్తున్నాడు. ఈ క్రమమంతా ఆయన విస్తృతంగా రాయలసీమ గ్రామాలు తిరిగాడు. కడపజిల్లాలో కొన్ని పల్లెల్లోనయితే ఆయనకు ప్రతి గడపతో పరిచయం. పిల్లలు, పెద్దలతో సహా అందరి పేర్లూ ఆయనకు గుర్తుంటాయి. ఆయన దళితుల్లో ఎంత మమేకమయ్యాడంటే ఇక్కడి దళిత సంఘాల ప్రతినిధుల మాటల్లో చెప్పాలంటే మాలల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎంజె మాల. మాదిగల్లో పనిచేసేటప్పుడు ఆయన ఎంజె మాదిగ. ఒక ఎంఆర్‌పిఎస్‌ జిల్లాస్థాయి నాయకుడు మైదుకూరులో జరిగిన ఆయన సంస్మరణ సభలో ఎంజె అంటే మాదిగ జాంబవంతుడు అన్నాడు.

ఆయన అంత్యక్రియల్లో విప్లవాభిమానులు ఎర్రజెండా పట్టుకొని, రైతు సంఘాల వాళ్ళు పచ్చజెండా పట్టుకొని వచ్చారు. ఇంకొకరెవరో జాతీయ జెండా తీసుకొచ్చారు. మద్యంపై పోరాడిన పెద్దపసుపుల మహిళలు వచ్చి ఆయన మావాడన్నారు. ఆ ఊర్లో ఆయన ఇళ్ళిళ్ళూ తిరిగి మద్యం మానమని ప్రమాణాలు చేయించాడు మరి. ఆయన మనముందు పరిచిపెట్టిపోయిన ఆయన జీవితాన్ని చూస్తే ఒకేసారి ఆయన ఎన్నెన్ని సమూహాల వెంట నడిచాడోనని ఆశ్చర్యమనిపిస్తుంది. అయితే ఆయనే కోరుకున్నట్టు విరసం, అమరుల బంధుమిత్రుల సంఘం వాళ్ళం కలిసి ఆయన దేహంపై ఎర్రజెండా కప్పాము.

కనపడగానే పిడికిలి బిగించి అభివాదం చేసే కొండంత మనిషిని ఇక చూడం కదా అని దు:ఖిస్తూ ఆయనకు లాల్‌సలాములు చెప్పాము.

– పి.వరలక్ష్మి

విరసం

ఇదీ చదవండి!

నేర గణాంకాలు 1992

మైదుకూరు దాడి కేసులో 35మంది విచారణకు అనుమతి

ప్రొద్దుటూరు: మైదుకూరు పట్టణంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసి గాయపరచిన కేసు(క్రైం నెంబరు 97/2013)లో నిందితులుగా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: