గురువారం , 21 నవంబర్ 2024

కన్నాంబ జీవితం కళకే అంకితం

నాటక, సినిమా రంగాలలో మేటి నటిగా, వితరణశీలిగా పేరుగాంచిన పసుపులేటి కన్నాంబ జన్మదినం గురించి విభిన్న అభిప్రాయాలుండేవి. కొందరు 1910 అని, కొందరు 1912, 1913 అని రాశారు. 1949 అక్టోబర్‌లో, పెనుపాదం, ఆమెతో జరిపిన ఇంటర్వ్యూలో కన్నాంబ 1911- అక్టోబర్‌ 5వ తేదీ అని తేల్చారు. ఆమె కోడలు కళావతి, కన్నాంబ జీవిత విశేషాలను విశదపరచారు.

కన్నాంబ, కడపలో లోకాంబ, వెంకట్రామయ్య గార్లకు జన్మించారు. వెంకట్రామయ్య ప్రభుత్వ గుత్తేదారు. ఆ దంపతుల ఏకైక సంతానమైన కన్నాంబ, ఆమె తల్లిగారి మేనత్త హేమగారింట ఏలూరులో పెరిగారు. ఆమె తాత నాదముని నాయుడు గ్రామీణ వైద్యుడు, అమ్మమ్మ నర్సుగా పనిచేస్తుండేది. ఆమె తాత సాహిత్యాభిమాని. మనమరాలి చదువు పట్ల ఎంతో ఆసక్తి కలవాడు.

కన్నాంబ బాల్యం నుండి శ్రావ్యంగా పాడేది.తన 16వ ఏట అంటే 1927లో, ఏలూరులోని నరాల నాటక సమాజం వారి హరిశ్చంద్ర నాటకం చూసింది. ఆ నాటకంలో చంద్రమతి పాత్ర ధరించిన నటి పెద్దగా ఏడ్వడంతో ప్రేక్షకులు నవ్వసాగారు. ప్రేక్షకుల మధ్యనున్న కన్నాంబ లేచి తాను ఆ పాత్రను ఆమె కంటే బాగా నటిస్తానని ప్రకటించారు. చంద్రమతి పాత్రధారిణి వెంటనే నటన అంటే ఆషామాషీ కాదని స్టేజీపైకి వచ్చి నటించమని సవాలు విసిరింది. కన్నాంబ స్టేజిపైకెక్కి గొప్పగా నటించి ప్రేక్షకులకు కన్నీరు తెప్పించింది. మరుసటి రోజు నుండే ఆమె ఏలూరు నాటక సమాజంలో సభ్యురాలై, అనసూయ, సావిత్రి, యశోద పాత్ర ధారిణిగా ప్రేక్షకుల ప్రశంసలందుకొన్నారు.

చదవండి :  డాక్టర్‌ ఆవుల చక్రవర్తి
కన్నాంబ
పసుపులేటి కన్నాంబ

ఆ నాటక సమాజంలోని సభ్యుడు కె.పి.నాగభూషణం, కన్నాంబ పరస్పరం ప్రేమికులై 1934 ఏప్రిల్‌లో దంపతులుగా మారారు. నాగభూషణంకు ఈమె రెండవ భార్య. 1934లోనే ఆ దంపతులు స్వయంగా శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలిని స్థాపించి మద్రాసు రాష్ట్రమంతటా ప్రదర్శనలిచ్చారు. నైజాం ప్రాంతంలో కూడా ప్రదర్శనలిచ్చారు.

సినీ నిర్మాత, ఎ. రామయ్య తాను ప్రారంభించిన స్టార్‌ కంబైన్‌ సంస్థలో చంద్రమతిగా నటించమని ఆహ్వానించారు. హరిశ్చంద్ర సినిమా, కొల్హాపూర్‌లో షాలిని సినిటోన్‌లో సినిమా నిర్మాణం జరిగింది. విజయవాడలోని సరస్వతీ టాకీస్‌ తాము నిర్మించనున్న, ద్రౌపదీ వస్త్రాపహరణంలో (1936), వారే కోల్హాపూర్‌లో నిర్మించనున్న, కనకతార చిత్రంలోనూ నటించునట్లు ఒప్పందం కుదుర్చుకొన్నారు. కరుణ రసాత్మక పాత్రధారిణిగా త్వరలోనే గొప్ప పేరు సంపాదించారు. ఎస్‌.ఎం.రెడ్డి, బి.ఎన్‌.రెడ్డిగారి సంస్థలో భాగస్వామిగా 1938లో ‘గృహలక్ష్మీ’ చిత్రంలో అద్భుతంగా నటించింది. జయ ఫిల్మ్స్‌వారి ‘కాళిదాసు’ చిత్రంలో నటించింది. శోభనాచల, వీనస్‌ స్టూడియోగా ఆ సంస్థ మారడంతో, సరస్వతి స్టూడియో భాగస్వామిగా ‘చండ్రిక’ చిత్రంలో కథానాయికగా నవరసాలను అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలందుకొన్నారు.

చదవండి :  వైసివి రెడ్డి (ఎమ్మనూరు చినవెంకటరెడ్డి)

జెమిని స్టూడియో డైరక్టర్‌ రఘుపతి ప్రకాశ్‌, తమ తమిళ చిత్రంలో నటించమని ఆహ్వానించాడు. కాని ఆమె తమిళ భాషోచ్ఛారణలో అనుభవం లేనందున విరమించుకొన్నారు. ఎం.కె.త్యాగరాజు భాగవతార్‌ నటించిన ‘అశోక్‌కుమార్‌’ చిత్రంలో నటించుటకు సమ్మతించి, స్క్రీన్‌ ప్లే రచయిత ఎళంగోవన్‌ సారధ్యంలో తమిళ భాషలో దిట్టకావటంతో, 1941లో తీసిన ‘కన్నగి’ చిత్రంలో కథానాయికగా నటించారు.

త్వరలోనే భార్యాభర్తలు స్వంతంగా రాజరాజేశ్వరి ఫిల్మ్స్‌ సంస్థను ప్రారంభించారు. ఎం.కె. త్యాగరాజు భాగవతార్‌ నటించనున్న ‘ఇవల్‌పాదా- అవర్‌పాదా’ (అనువదించు – విశ్లేషించు) చిత్రంలో నటన కోసం భరతనాట్యం అభ్యసించి, నటించి గొప్ప పేరు సంపాదించారు.

జూపిటర్‌ ఫిల్మ్స్‌వారు, ఆర్‌.ఎస్‌.మణి దర్శకత్వంలో, ఇళంగోవన్‌ రచించిన, తమిళ చిత్రంలో నాయికగా తమిళ భాషా పటిమను ప్రదర్శించి, సాక్షాత్తు ‘కన్నగి’యే అన్న ప్రశంసలందుకొన్నారు.

ఆ చిత్రంలో ప్రశ్నోత్తర పూర్వకమైన పాటను, కన్నాంబ, యు.ఆర్‌.జీవానందం అద్భుతంగా నటించి, రాబోవు చిత్రాలకు ఆదర్శంగా వెలిగారు. ఆ చిత్ర సంగీత దర్శకుడు, ఎస్‌.వి. వెంకటరామన్‌ (అతని శత జయంతివత్సరం కూడా ఇదే). ఆయన కన్నాంబ నిర్మించిన ‘తల్లి ప్రేమ’ మరియు సంగీతాత్మకమైన ‘మీరా’ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం వహించారు.

కన్నాంబ దైవభక్తురాలు. ప్రతిరోజూ చిత్ర నిర్మాణానికి వెళ్ళే ముందు పూజ చేసి వెళ్ళేవారు. ఆ దంపతులకు సంతానం కలుగలేదు. ఒక కూతురు, కొడుకును దత్తత చేసుకొన్నారు. కూతరు పేరు రాజరాజేశ్వరి, ఆమె సినీ దర్శకుడు. సి.పుల్లయ్య కుమారుడు సి.ఎస్‌.రావును పెళ్ళాడింది. రావు కూడా చిత్ర దర్శకుడే. అతడు మంచి తబలా వాద్యకారుడు. ఆమె మహారాణిగా నటించిన ‘మనోహర’ అత్యద్భుత చిత్రం. ఆమె 150పైగా చిత్రాలలో నటించడమే కాక, 25 చిత్రాలను నిర్మించారు. ఆమె నటనను కొనియాడుతూ ‘కన్నాంబ యువ నటీనటులను ఎంతో ఆదరంగా నటనలో కిటుకులను తెలియజేసేవారన్నారు ప్రముఖ నటి అంజలీదేవి. ‘ఆమె మాకు డైలాగ్‌ డెలివరీలో శిక్షణనివ్వటమే కాక పెద్దలను ఏ రీతిగా నమస్కరించాలో కూడా నేర్పారు. తెలుగు నటీ నటులు తమిళ చిత్రాలలో నటించే తీరును కన్నాంబ, భానుమతిగార్లు మాకు నేర్పారన్నారు’ అంజలీ దేవి. ఆమె ఉదార హృదయురాలు.

చదవండి :  సాహితీలోకానికి ఘన కీర్తి పద్మశ్రీ పుట్టపర్తి

ఆమె నటించిన చిత్రాలన్నీ విజయభేరి మ్రోగించాయి. భక్తిరస ప్రధానమైన పాత్రలనెంత గొప్పగా నిర్వహించారో అంతే సామర్థ్యంతో రౌద్ర, కరుణ రసాలు చిందించే పాత్రలు పోషించారు. ‘చండ్రిక’ చిత్రంలో, ‘నేనే రాణీనైతే’ అన్న పాట విన్న ప్రేక్షకుల హర్షధ్వానాలతో సినిమా హాలు దద్దరిల్లిపోయేది. దానశీల ఆమె. 51ఏళ్ళు అత్యంత తేజోవంతంగా జీవించిన కన్నాంబగారు 1964 మే నెల 7వ తేదీన కన్నుమూశారు.

అనువాదం : జానమద్ది హనుమచ్చాస్త్రి

ఇదీ చదవండి!

డాక్టర్‌ ఆవుల చక్రవర్తి

జిల్లాలో చరిత్ర సృష్టించిన మహానుభావులెంతోమంది వున్నా ఫ్యాక్షన్‌ సినిమాల పుణ్యమా అని కడప పేరు వింటేనే గుండెలు పేలిపోతాయి… కడప …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: