జీవో 233 రద్దుకు డిమాండ్
నంద్యాల : కర్నూలు – కడప సాగునీటి కెనాల్ (కేసీ) దుస్థితిపై ఆయకట్టు రైతులు గళమెత్తారు. గురువారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య, కర్నూలు జిల్లా వరి ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కేసీ కెనాల్ సాగునీటి భవితవ్యంపై రైతు సదస్సు నిర్వహించారు. రైతుసంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కర్నూలు, కడప జిల్లాలకు చెందిన వివిధ రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేసీ కెనాల్ ఆయకట్టు భవితవ్యంపై ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టేందుకు వీలుగా కేసీ కెనాల్ ఆయకట్టు పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన రైతుసంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే కేసీ ఆయకట్టు రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. లేకుంటే తీవ్ర అన్యాయం జరుగుతుందని, కనీస నీటిమట్టం విధానాన్ని దెబ్బతీసే 233జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర జలాలు కేసీ కెనాల్‌కు శాశ్వతంగా అందేలా సుంకేసుల బ్యారేజీ ఎగువ భాగాన గండ్రేవుల వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.
అలాగే శాశ్వత ప్రయోజనాల కోసం సిద్దేశ్వరం బ్యారేజీ, రాజోలి, జోలదరాశి రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టి తుంగభద్ర డ్యాం దిగువ భాగాన కర్ణాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన చిలకల పర్రు – బెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణాన్ని నిలుపుదల చేసి కేసీ ఆయకట్టును కాపాడాలని డిమాండ్ చేశారు. కేసీ కెనాల్ ఆయకట్టు పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశామని, భవిష్యత్‌లో కేసీ కెనాల్‌కు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాలను నిలదీస్తామని హెచ్చరించారు.