మైలవరం: కోరిన వారికి కొంగు బంగారంగా మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీ దేవి జ్యోతి మహోత్సవాలు ఈ నెల 16 వ తేదీ ఆదివారం నుండి 18 వ తేదీ మంగళవారం వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 16 వ తేదీ బిందుసేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, రాత్రి జ్యోతులను ఊరేగిస్తారని, 17 న విడిదినం, 18 న గొడుగుల కార్యక్రమం ఉంటుందని అలాగే ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు వివరించారు. చౌడేశ్వరీ దేవిని ఇలవేల్పుగా కొలిచే తొగట వీర క్షతియులతో పాటు కుల మతాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ జ్యోతి ఉత్సవాల్లో పాలుపంచుకుంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా గ్రామ పెద్దల కథనం మేరకు జ్యోతి ఉత్సవాల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
సుమారు 300 సంవత్సరాల క్రితం పెద్దముడియం మండల పరిధిలోని గుండ్లకుంట గ్రామంలోని ఓ బావిలో చౌడేశ్వరీ విగ్రహం బయటపడింది. మైలవరం మండలంలోని వేపరాల గ్రామస్తులు అమ్మ వారి విగ్రహాన్ని ఎద్దుల బండిపై తమ గ్రామానికి దొమ్మరనంద్యాల గ్రామ పొలిమేరల మీదుగా తీసుకొని పోతుండగా అమ్మ వారు తాను ఇక్కడే కొలువై ఉంటానని పలికారని నాటి నుండి చౌడేశ్వరీ దేవి దొమ్మరనంద్యాల గ్రామ ప్రజల పూజా పునస్కారాలు అందుకోవడం జరుగుతోందని పెద్దలు చెబుతారు.
ఆలయ ఆవరణంలోని చింత చెట్టు వనంలో ఉన్న గిలక బావి వద్ద తెల్లవారుఝామున తెల్లటి చీరెతో స్నానం చేసి అమ్మ వారు దేవాలయంలోకి వెళుతుండగా పూజారి చూశారని ప్రతీతి. కాగా జ్యోతి ఉత్సవాల సందర్భంగా సమీప గ్రామాలైన మైలవరం, వేపరాల, మోరగుడి, జమ్మలమడుగు గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మ వారికి పూజలు నిర్వహిస్తుంటారు. కాగా జ్యోతుల సందర్భంగా బియ్యం పిండి, గొధుమ పిండి, బెల్లం పాకంతో ముద్దగా చేసి దానిపై టక్కేలు చెక్కి జ్యోతిని అమర్చి నెయ్యి పోస్తూ జ్యోతి ఆరిపోకుండా అమ్మ వారి భక్తి గీతాలతో లయబద్దంగా నాట్యం చేస్తూ గ్రామ వీధుల్లోకి వెళ్లి జ్యోతిని తిరిగి ఆలయానికి చేర్చడం ఆచారం.
మంగళవారం గొడుగుల మహోత్సవం నిర్వహిస్తున్నామని ఎప్పటిలాగే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని చౌడేశ్వరీ దేవికి పూజలు నిర్వహించాలని నిర్వాహకులు పత్రికాముఖంగా కోరారు.