
సగిలేటి నీళ్లు ఉరికినట్టు ఉరికినాయి!
శానా రోజులు అయింది ఊరికి పొయ్యి ..అమ్మా నాయనలుఈ మద్దెన బో మతికి వచ్చాండారు కండ్లు మూసినా తెర్సినా పక్కనే ఉన్నట్టు నిద్దరపోతే నా పక్కన్నే ఉన్నెట్టు అనిపిచ్చాంటే ఊరికి పోదాము అని మనసులో పీకు తాంది రక రకాల కారణాల చేత పోదాము అనుకోడం పోలేక పోడం అట్ట జరుగుతాంది పోయిన వారం పోదామని అనుకున్నాను ..కానీ ఏదో పని పడి పోలేదు.
శుక్రవారం ఉదయాన్నే ఆరు గంటలకు నాకు బామ్మర్ది వరసయ్యే రాజు అనే పిల్లనాబట్ట వీడియోకాల్ చేశాడు .. ఏందోయ్ అంటే సూడు మామా ఆడ పండుకోని నిద్రపోతాండావు ..ఈడ నీ సగిలేరుకు వాగు వచ్చింది .. దెంకోని రా అన్నాడు .. కాసేపుటికి నా కొడుకు వరస అయ్యే ప్రకాష్ బాబాయ్ మన సగిలేటికి నీళ్లు వచ్చాండాయి రా బాబాయ్ అన్నాడు .. నాకు కాళ్ళు శేతులు ఆడ్డంలేదు .. నా మేనల్లుల్లు ఫ్యామిలి గ్రూప్ లో ఫోటోలు పెట్టారు .. అంతే నాకు ఇస్టమైన పప్పు .. వంకాయ వట్టొట్టి వండుకున్నాను గాని నాలుగు ముద్దలు తింటానే ఎగుటనిపించింది.
గబాగబా కుసిని లోకి పోయి బోకులు బొచ్చలు సర్దుకోని బస్సెక్కి చార్మినార్ దగ్గర చుడీబజార్ కు పోయి రెండు గాలపు సువ్వలు . మరి కొన్ని గాలాలు బెండ్లు .. సీసం కొనుక్కున్నాను..ఆడ కుండపోతగా వాన వాన ఒక్కరవ్వ తగ్గుతానే బస్టాండుకు పోయి కర్నూలు బస్ ఎక్కాను .. కర్నూలు లో దిగుతానే ..కాసేపటికి గిద్దలూరు బస్ వచ్చింది. గిద్దలూరులో దిగుతానే మా ఊరిమీంద పోయే తిరుపతి బస్ వచ్చింది. అట్ట ఐదు గంటలకే ఇళ్ళు చేరుకున్నాను.
ఒక గంట పడుకుందామని దొల్లాను రాలేదు .. యాప్పుళ్ళతో పండ్లు తోము కుంటాంటే మా యన్న కొడుకు సన్నిగాడు లేసినాడు .. మా మేనళ్ళులకు ఫోన్ చేసినాడు ..తీటు గాడు కూడా వచ్చినాడు ..అందరం కలిసిపచ్చి కారెం ఉడుకుడుకు బువ్వ తిని గుడి కాడికి పోతిమి నేను మా యమ్మ నాయన సమాధులకు మొక్కినాను గుండెల్లో బాధ సుడులు తిరుగుతాంది .. పిల్లోని మాదిరి ఏడుజ్జామని ఉంది .. గాని బిగ పట్టుకున్నాను.. ఏటికి పోయి కాసేపు అట్ట తిరిగి ఇట్ట తిరిగి ఏరును గుండలకు హత్తుకున్నాను . ఎందుకంటే ఇట్ట వాన పారకం చూసి శానాళ్లయింది. ఊర్లో నీళ్ళు లేకుండా నీటి కరువు వచ్చినాది అది తీరినాది ..ఏరు నిమ్మళంగా పారతాంది కన్నులనిండా చూసుకున్నాను .. మనసు నిండా హత్తు కున్నాను .. యా పక్కకు పోయినా అమ్మ నాయన జ్ఞాపకాలు కాళ్ళకు సుట్టు కుంటుండాయి రాత్రికి మా నాయన పండుకునే సోటులో పండుకున్నాను .. పొద్దన్నే లేసి సాంగ్యం ప్రకారం పార్థనకు పోయి ఇంటికి తిరిగి వచ్చి సంగటి తిని కాసేపు అట్ట పడుకున్నాను .. పక్క పల్లెకు పోయివజ్జామనుకుంటే వాన ఇదల కుండా కుర్సడం తిరుక్కున్నెది.. వాన కురుచ్చాంటే నేల తడైనట్టు నా మనసు తడైతాంది మళ్ళా సాయంకాలం పోవాల కదాని .. అట్టనే మనసు బిగ బట్టుకోని బస్సు ఎక్కాను .. బస్సు కదిలినాక లైట్లు ఆరి పేసినాక నా కండ్లలో అప్పటిదాకా బిగపట్టుకోని ఉన్న కండ్లనీళ్ళు తలుపులు ఎత్తితే సగిలేటి నీళ్లు ఉరికినట్టు ఉరికినాయి.
– ప్రసాదరావు బత్తుల
(facebook: bathulaprasada.rao)
[author image=”https://kadapa.info/gallery/albums/userpics/10001/thumb_battula1.jpg”]
వృత్తి రీత్యా పాత్రికేయుడైన బత్తుల ప్రసాద్ మంచి రచయిత కూడా. కడప జిల్లాలోని కలసపాడు వీరి స్వస్థలం. వీరు రాసిన కథలను ‘సగిలేటి కథలు’ పేర సంకలనంగా వెలువరించారు.ఈ సగిలేరు వీరు పుట్టిన కలసపాడు దగ్గరున్న ఒక ఏరు. ఇటీవలే “గంజిబువ్వ” పేర వీరు మరో కథా సంకలనాన్ని కూడా వెలువరించినారు.
[/author]