
తితిదే కిందకు సౌమ్యనాథస్వామి ఆలయం
కడప : నందలూరు సౌమ్యనాథస్వామి దేవాలయాన్ని తితిదేలోకి విలీనం చేసినట్లు రాజంపేట ఎమ్మెల్యే, తితిదే పాలక మండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. శుక్రవారం సౌమ్యనాథున్ని దర్శించుకున్న మేడా విలేకరులతో మాట్లాడుతూ….
అన్నమయ్య ఆరాధించిన సౌమ్యనాథస్వామి ఆలయం తితిదేలోకి విలీనం చేయడం ముదావహమన్నారు. ఇటీవల తిరుమలలో నిర్వహించిన తితిదే పాలకమండలి సమావేశంలో ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు. దీనితో పాటు రాష్ట్రంలోని ఆరు ఆలయాల విలీనానికి పాలకమండలి ఆమోదం లభించిందన్నారు.
32 వేల కీర్తనలను రచించిన తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలను ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తితిదే బోర్డు ప్రతిపాదన చేసిందన్నారు. ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు వెల్లడించారు.
తితిదే ఆధ్వర్యంలో సౌమ్యనాథుని ఆలయాన్ని మరింత చక్కగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.