సురభి నాటక కళ పుట్టింది కడప జిల్లాలోనే!
ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం 1885 లో కడప జిల్లాలోని ‘సురభి’ గ్రామంలో కీచకవధ నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థా పకుడు వనారస గోవిందరావు. వనారస సోదరులు వనారస గోవిందరావు మరియు వనారస చిన్నరామయ్య కలిసి కడప జిల్లా చక్రాయపేట మండలములోని సురభిరెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారం భించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణా సురభి నాటక సంఘంగా ప్రసిద్ధి చెందినది.
రంగస్థలముపై స్ర్తీ పాత్రలను స్ర్తీలచే ధరింపచేసిన తొలి నాటక బృందం ఏదంటే అది కేవలం సురభి నాటక సమాజమే. నాటకంలోని పాత్రధారులందరూ ఒకే కుటుంబములోని సభ్యులవడం చేత స్ర్తీలకు చెడ్డపేరు వస్తుందనే భయము ఉండేది కాదు. బృందములోని సభ్యులకు రంగస్థలమే జీవితముగా సాగేది. ఊరూరూ తిరుగుతూ…పల్లె పల్లెనా నాటకాలతో జనాలను రంజింపజేసేవారు.
సురభి కుటంబంలో అందరూ కళాకారులే…అప్పుడే పుట్టిన బిడ్డతో కూడా నాటకంలో నటింపజేయడం కేవలం ‘సురభి’ సమాజానికే దక్కింది. ఒకానొక సందర్భంలో సురభివారి నాటకం రసపట్టులో ఉండగా అందులో నటించే ఓ స్ర్తీ పాత్రధారిణికి నొప్పులు రావడంతో అక్కడే స్టేజిమీదనే ప్రసవించిందట…ఆ స్టేజి మీద పుట్టిన ఆ బిడ్డే తర్వాత సురభి కమలాభాయిగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుని తెలుగు చిత్రసీమకు సంబంధించిన తొలితరం హీరోయిన్‌గా ఖ్యాతిగడించింది.
స్థాపించిన కొద్దిరోజులలోనే సురభి-సమాజం త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందములుగా వృద్ధిచెందింది. ప్రతి బృందము దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయము సమృద్ధిగా ఉండేవి. వారి బృందానికి సంబంధించిన ఆదాయవనరులను అవే సమకూర్చుకునేవి. అందరూ కుటుంబ సభ్యులే కావడం వలన జీతభత్యాల విషయంలో ఏ మనస్పర్థలూ ఉండేవి కావు. వనారస గోవిందరావుకు ముగ్గురు కుమారులు పదిమంది కుమార్తెలు. వీరి కుటుంబము వృద్ధిచెందిన కొద్దీ బృందములు కూడా అదే స్థాయిలో వ్యాపించినాయి. సినిమా, టీవీల ఆగమనంతో 1974 కల్లా బృందముల సంఖ్య 16కు క్షీణించాయి.
1982 నాటికి కేవలము నాలుగు నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ప్రస్తుతము ఆంధ్రదేశములో సురభి నాటక కళాసంఘం ఆధ్వర్యములో ఐదు నాటక బృందములు పనిచేస్తున్నాయి.
వీటిలో అన్నింటికంటే పెద్దదైన శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి 1937 లో గోవిందరావు ఐదవ కూతురు సుభద్రమ్మ మరియు ఆమె భర్త ఆర్.వెంకట్రావుచే స్థాపించబడినది. ప్రస్తుతము ఆ బృందములో వీరి కుమారులు భోజరాజు, బాబ్జి మరియు గణపతిరావులు మరియు వారి కుటుంబములు అంతా కలిపి 62 మంది సభ్యులు ఉన్నారు.
‘సురభి’ నాటకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం మాయాబజార్. ఆభిమన్యుడు, శశిరేఖ వివాహానికి ఘటోత్కచుడు అనే రాక్షసుడు (భీమ, హిడింబ కుమారుడు) తన మాయాజాలంతో జరిగేటట్లు చేయడం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుంది. కళాకారులు పెద్దగా చదువుకోకపోయినా… సినిమాలో లాగా, సెట్టింగులతో యుధ్ధం జరిగినపుడు, మంటలు సృష్టించటం… ఆ తరువాత వాన కురిపించడం, అలాగే ఒకే సమయంలో రంగస్థలంపై, అభిమన్యుడు, శశిరేఖలు వేర్వేరు సెట్టింగులలో విరహగీతం పాడటం లాంటివి చాలా ఆకర్షణీయంగా వుంటాయి.
దేశవిదేశాలలో పేరుప్రఖ్యాతులు గడించిన ఇలాంటి నాటక సమాజం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అంటే అతిశయోక్తి కాదు. తొలితెలుగు సినీనటీమణి కమలాబాయి సురభి కళాకారుల కుటుంబములో పుట్టి పెరిగినదే.
సుచిరిండియా
‘సామాజిక సేవ చేయాలంటే స్పందించే హృదయం ఉండాలి. కష్టంలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించేందుకు ఉదారత కావాలి. నేటి యాంత్రికమైన జీవనంలో ఎవరి జీవితం వారిది. పక్కవారి కడుపు నిండిందో లేదో తెలుసుకునే సమయం కూడా ఉండడం లేదు. పట్టెడన్నం కోసం ఎదురుచూసే వారి బాగోగులను పట్టించుకునే వారు ఎంతమంది ఉన్నారంటే వేళ్లమీద లెక్కించ వచ్చు. కానీ అలాంటి వారిని ఆదుకునేందుకు కార్పోరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. మీకు మేము అండగా ఉన్నా మంటూ చేయూత నిస్తున్నాయి. నాటకరం గంలో 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సురభిని (కళాకారులను) సుచిరిండియా ఫౌండేషన్ దత్తత తీసుకుని సరికొత్త సాంప్రదాయానికి తెరతీసింది…’
నాటక రంగంలో సురభి కళాకారులంటే పెట్టింది పేరు. అనాదిగా నాటక కళనే నమ్ముకుని ఇప్పటికీ తెరపై నాటకప్రియులకు వినోదాన్ని అందిస్తున్నారు. నాటక కళకు ఆదరణ ఉన్నా వారి జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారుతోంది. అందరి పిల్లల్లానే తమ పిల్లలు కూడా చదువుకోవాలని ఆశ ఉన్నా వారికి చదివించే స్థోమత లేదు. అలాంటి చిన్నారులను చేరదీసి వారిని తమ పిల్లల్లా చదివించేందుకు సుచిరిండియా ఫౌండేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
50మంది కళాకారుల పిల్లలకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర సాంస్కృతిక మండలి ఛైర్మన్ ఆర్.వి రమణమూర్తి, రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కె.వి రమణాచారి, ఎమ్మెల్సీలు బి. నారాయణరావు, పి. చెంగల్రాయుడు, పద్మశ్రీ పన్నారు శ్రీపతి, ఆచార్య మొదలి నాగభూషణశర్మ వంటి ప్రముఖుల సమక్షంలో సుచిరిండియా ఫౌండేషన్ సిఈఓ లయన్ వై. కిరణ్ తొలివిడతగా రూ 2,01,500 చెక్‌ను సురభి కళాకారులకు అందించారు. ఈ సందర్భంగా బాబ్జీ నాయకత్వంలో ప్రదర్శించిన మాయాబజార్ పౌరాణిక నాటక ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది.
నాటక రంగంలో సురభికి ప్రత్యేక స్థానం-సాంస్కృతిక మండలి ఛైర్మన్ రమణమూర్తి
నాటకరంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ సురభి-నాటకం ప్రత్యేక స్థానంలో ఉంది. ఈ సంస్థ ఆరంభమై 125 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా త్వరలో రాష్టవ్య్రాప్తంగా ప్రత్యేక నాటకోత్సవాలను నిర్వహించనున్నాం. సంచార ప్రదర్శనలు ఇవ్వడం సురభి వారి బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుని ప్రతి పల్లెల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధం కావాలి. సుచిరిండియా ఫౌండేషన్ అందిస్తున్న సేవలు మహత్తరమైనవని. ప్రతి కార్పోరేట్ సంస్థ వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి.