
జిల్లాపై ప్రభుత్వ తీరుకు నిరసనగా 22 నుంచి 24 వరకు ధర్నాలు
కమలాపురం: కడప జిల్లా పై ప్రభత్వ వివక్షకు నిరసనగా మరియు జిల్లా సమగ్రాభివృద్ధిని కోరుతూ.. ఈ నెల 22, 23, 24 తేదీల్లో అన్ని మండల కార్యాలయాల ఎదుట సీపీఐ, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని, ప్రజలు కూడా పాల్గొని ఆయా కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. వనరుల ఆధారంగా సమగ్రంగా అభివృద్ధి చేయకపోతే.. జిల్లా శాశ్వత ఏడారిగా మారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించకుండానే జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని అధికార పక్షం చెప్పడం విడ్డూరమన్నారు.
సోమవారం స్థానిక ముస్లిం షాదీఖానాలో సీపీఐ ఆధ్వర్యంలో ‘నవ్యాంధ్రప్రదేశ్‌లో జిల్లా సమగ్రాభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ.. రాయలసీమ అత్యంత దుర్భిక్ష ప్రాంతమని శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీలు తేల్చిచెప్పాయని, అలాంటి సీమకు న్యాయం చేయకపోతే .. మరోసారి విభజన పోరాటానికి ఆజ్యం పోసినట్లవుతుందన్నారు.
జిల్లా అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని, ప్రభుత్వం ప్రకటించిన 16 కేంద్రీయ సంస్థల్లో ఒక్కటీ జిల్లాకు కేటాయించకపోవడమే దీనికి నిదర్శనమన్నారు.
జిల్లాలో వర్షపాతం తక్కువైనా.. బెరైటీస్, నాపరాయి, మాంగనీసు, డోలమైట్, ఇనుము, సున్నపురాయి, ఇసుక వంటి ఖనిజాలు, ఎర్రచందనం వంటి అటవీ సంపద విస్తారంగా ఉందన్నారు. ఈ వనరుల్ని జిల్లా సమగ్రాభివృద్ధికి వినియోగించాలన్నారు.
అంతా వ్యతిరేకించినా.. విజయవాడను రాజధానిగా ప్రకటించారన్నారు. రుణమాఫీని వెంటనే అమల్లోకి తేవాలన్నారు. సీపీఐ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సర్వరాయసాగర్, వామికొండ ప్రాజెక్టుల పనులను నిలిపేసి రైతుల ఆశలను అడియాసలు చేశారన్నారు. కమలాపురం రైల్వే పైవంతెన, కొప్పర్తి వద్ద ఉక్కు పరిశ్రమ, మైలవరం దక్షిణ కాలువ నుంచి కమలాపురం చెరువుకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.