
సర్వజ్ఞత్వము వెదకగనొల్లను సందేహింపగనొల్లను – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సర్వజ్ఞత్వము వెదకగనొల్లను సందేహింపగనొల్లను సర్వజ్ఞుండును నాచార్యుండే సర్వశేషమే నాజీవనము ॥చ1॥ యెఱఁగఁగనొల్లము విజ్ఞానపుగతి యెఱుకలు నే మిటుసోదించి యెఱిఁగి యితరులను బోధించెదమను యీపెద్దరికము నొల్లము యెఱిఁగేటివాడును యాచార్యుండే యెఱుకయుసర్వేశ్వరుఁడే యెఱుకయు మఱపును మానివుండుటే యిదియేపో మావిజ్ఞానము ॥చ2॥ చదువఁగనొల్లము సకలశాస్త్రములు సారెకుసారెకు సోదించి చదివి పరులతో యుక్తివాదములు జగడము గెలువగనొల్లము చదివేటివాఁడును నాచార్యుండే చదువును నాయంతర్యామే చదువుకుఁ జదువమికియు దొలఁగుటే నానాసాత్వికభావమే నాతెలివి ॥చ3॥ అన్నిటికిని నే నధికారిననెడియహంకారము నొల్లను కన్నులజూచుచు నందరితో నేఁ గాదని తొలఁగానొల్లను మన్నన శ్రీవేంకటేశ్వరుకరుణను మాయాచార్యుఁడే అధికారి వున్నరీతినే అస్తినాస్తులకు నూరకుండుటే నాతలఁపు |
రాగము: దేవగాంధారి రేకు: 0093-05 సంపుటము: 1-463 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారి