శ్రీశైలం నీటిని ‘సీమ’కు తరలించాలి
శ్రీశైలం జలాశయం నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇదివరకు కర్నూలు ముంపునకు గురయ్యేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులే కారణమని, దీంతో ప్రజలు భారీగా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనుంటే ఆ నీటిని సద్వినియోగం చేసుకునేవారమన్నారు. వెలుగోడు రిజర్వాయర్‌కు చెందిన 15 టీఎంసీల నీటిని ఎస్‌ఆర్‌బీసీకి, ఎస్‌ఆర్‌బీసీ నుంచి బ్రహ్మంసాగర్‌కు విడుదల చేస్తే అక్కడ 20 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చన్నారు. అలాగే అలగోడు రిజర్వాయరులో 3, గోరకల్లులో 5, అవుకులో 3 టీఎంసీల నీటిని అవుకు నుంచి జీఎన్‌ఎస్ వరదకాల్వల ద్వారా మైలవరం జలాశయంలో 9 టీఎంసీల నీటిని, నెల్లూరు జిల్లా కండలేరులో 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే చెన్నైకి తాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. అలాగే పూండీ రిజర్వాయరులో 5 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని పేర్కొన్నారు.
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను నిప్పులవాగు ద్వారా కుందూకు తరలిస్తే కేసీ కెనాల్, పెన్నా నదులకు నీరు అందించవచ్చన్నారు. తద్వారా కర్నూలు జిల్లాలోని 2.50 లక్షల ఎకరాలకు, కడప జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వివరించారు.
26వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులకు వస్తోందని, ఆ నీటిని వదలితే ఈ జిల్లాల్లోని పరీవాహక ప్రాంతాల్లో తాగునీటి అవసరాలు, చెరువులకు నీరు అందించవచ్చన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రిపై వత్తిడి తీసుకువచ్చి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీరందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.