
‘శ్రీభాగ్ ప్రకారమే నడుచుకోవాలి’ – జస్టిస్ లక్ష్మణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాయలసీమ రాజధాని సాధన సమితి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐజీ హనుమంతరెడ్డి సహా ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయన్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, ఇదే విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ సైతం స్పష్టం చేసినదని గుర్తు చేశారు. సాగునీరు, విద్య, అభివృద్ధిలో రాయలసీమ ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఉందన్నారు. అప్పటి ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటం సమయంలో రాయలసీమ ప్రజలు పాల్గొనకపోవడంతో పెద్దమనుషుల ఒప్పందం (శ్రీభాగ్) కుదిరిందన్నారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అంటూ ఒకటి ఏర్పడితే రాజధాని రాయలసీమ జిల్లాల్లోనే ఉండాలని ఆ ఒప్పందం సూచిస్తోందన్నారు. హైకోర్టును కోస్తా జిల్లాల్లో పెట్టాలని కూడా అప్పుడే ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆ ఒప్పందం కుదిరిన తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నారని,అప్పటి ఒప్పందం ప్రకారమే కర్నూలును రాజధానిగా పెట్టుకున్నామన్నారు. ఇప్పుడు కూడా ఆ ఒప్పందం ప్రకారమే నడుచుకోవాలన్నారు. రాయలసీమకు చెందిన పాలకులే ఈ ఒప్పందాన్ని విస్మరిస్తుండడం విస్మయం కలిస్తోందన్నారు .
శ్రీబాగ్ ఒప్పందాన్ని విస్మరిస్తే తొందరలోనే మరో ఉద్యమానికి ఊపిరిలూదినట్లవుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పచ్చని పంటపోలాలున్న కోస్తా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడం కన్నా మెట్ట ప్రాంతమైన రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.