జమ్మలమడుగు: తెదేపా ప్రభుత్వం చౌకదుకాణాల డీలర్లపై తప్పుడు కేసులు బనాయించిందని, ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా తొలగించిదంటూ జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం వైకాపా శాసనసభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముద్దనూరు రోడ్డుపై రెండు గంటల పాటు భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
ప్రజలకు, వైకాపా కార్యకర్తలకు అన్యాయం జరిగితే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని శాసనసభ్య్లులు ఆదినారాయణరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జయరాముడు, అంజద్‌బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, డీసీసీబి ఛైర్మన్ తిరుపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యేలంతా కలిసి అధికారులు సక్రమంగా వ్యవహరించాలని కోరుతూ ఆర్డీవో రఘునాథరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు, సాక్షరభారత్ గ్రామ, మండల సమన్వయకర్తలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, నగర పంచాయతీ కార్యాలయాల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను నియమించడం దారుణమన్నారు.
ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి పనిచేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అన్యాయం జరిగితే చూస్తూ వూరుకునేది లేదన్నారు. లోకాయుక్తకు వెళతాం. అసెంబ్లీలో చర్చిస్తాం. హైకోర్టుకు వెళతాం. ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు అన్నివిధాలా పోరాడతామని చెప్పారు. జిల్లాలో సి.ఎం.రమేష్ ఆగడాలు సాగనివ్వమన్నారు.
శాసనమండలి సభ్యుడు దేవగుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకు అధికారం వస్తుంది, పోతుంది. కానీ అధికారులు శాశ్వతంగా ఉంటారు. ఇది గుర్తుంచుకుని ఉద్యోగాలు చేయాలన్నారు. సురేష్‌బాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి పది రోజులైనా కాకుండానే తెదేపా వారు విచ్చలవిడిగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు లాక్కోవాలని చూడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, ముక్తియార్, శివనాథరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.