
సభలో మాట్లాడుతున్న విజయభాస్కరరెడ్డి
విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలి : ఐఏఎస్ విజయభాస్కర్
ప్రొద్దుటూరు: విద్యార్థులు పాఠశాల దశ నుండే సామాజిక స్పృహ కలిగి ఉండాలని ఇటీవలే ఐఏఎస్‌కు ఎంపికైన జిల్లా వాసి విజయభాస్కర్‌రెడ్డి పాతకోట పేర్కొన్నారు. స్థానిక రామేశ్వరంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సత్తిబాబు అధ్యక్షతన ఈ రోజు (శుక్రవారం) విజయభాస్కర్‌కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…
తెలుగుతో పాటు ఆంగ్ల భాష పైన కూడా విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. సివిల్ సర్వీసు లాంటి పోటీ పరీక్షలను ఎదుర్కోవాలంటే విద్యార్థులు వార్తా కథనాలు చదవడంతో పాటుగా, జనరల్‌నాలెడ్జ్, వ్యాస రచన, బృంద చర్చలు వంటి అంశాలలో పాఠశాల దశ నుండే నైపుణ్యం సాధించాలన్నారు.

విద్యార్థులు చిన్నప్పటి నుండే ఉన్నతమైన భావాలు అలవరుచుకుని, దృఢసంకల్పంతో శ్రమిస్తే జీవితంలో ఉన్నత స్థాయిని అందుకోవచ్చన్నారు. శ్రమించే వారికి ఓటమి ఉండదన్నారు. అనంతరం విజయభాస్కర్ ను నిర్వాహకులు సన్మానించారు.
జవివే, ఎం.ఎస్.ఎన్.ఆర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో రచయిత జింకా సుబ్రహ్మణ్యం, జవివే ప్రొద్దుటూరు పట్టణ గౌరవాధ్యక్షులు డా.డి.నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గోపీనాథరెడ్డి, ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సురేష్ రెడ్డి తవ్వా, సభ్యులు మురళీగుప్తా, గోపీనాయుడు, ఎం.ఎస్.ఎన్.ఆర్ సేవా ట్రస్ట్ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, సమతా విభాగం సభ్యులు డా.కళావతి, హేమలత, నాగరాజు, నాగేశ్వరరావు, పురపాలక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.