
వాళ్ళ తాగుడు ఖరీదు అయిదు వేల కోట్లు!
ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఎవరు ఇంతగా తాగుతున్నారు? అని – ఎవరో అయితే మేమెందుకు రాస్తాం. ఇది మనోల్ల బాగోతమే!
2012-13 ఆర్థిక సంవత్సరంలో అంటే 2012వ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి 2013వ సంవత్సరం మే నెల వరకు 14 నెలల వ్యవధిలో మనోళ్ళు రూ.650.53 కోట్ల మందు తాగేశారు. అంటే సగటున నెలకు 47 కోట్ల రూపాయల మందు తాగుతున్నారు. ఇది నిజం ! కావాలంటే అబ్కారీ శాఖ లెక్కలు చూడొచ్చు. ఈ కాలంలో 18 లక్షల 57 వేల 960 కేసుల లిక్కర్, 12 లక్షల 25 వేల 268 కేసుల బీరు అమ్మకం జరిగింది.
2011-12 పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇదే 14 నెలల్లో 17 లక్షల 87 వేల 990 కేసుల మద్యం, 9 లక్షల 78 వేల 837 బీరు కేసులు అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాల ద్వారా రూ.542.57 కోట్లు అమ్మకాలు జరిగాయి.
అంటే గత ఏడాదికంటే ఈ సంవత్సరం రూ.107 కోట్ల 96 లక్షల మేర అధికంగా అమ్మకాలు జరిగినట్లయ్యింది. అంతేకాక దుకాణాల లైసెన్సు, చలానాల ద్వారా రూ.500 కోట్ల మేర ఆదాయం ఇది వరకే ప్రభుత్వ ఖజానా చేరుకుంది.
ఈ లెక్కన రాబోయే అయిదేళ్ళ కాలానికి మనోళ్ళు తాగుడు కోసం కనీసమంటే మూడు వేల కోట్ల రూపాయలు పై చిలుకు ఖర్చు చేయబోతున్నారన్న మాట! దీనికి దుకాణాల లైసెన్సు, చలానాల విలువలను కలిపితే మొత్తం అయిదు వేల కోట్లు పైనే. ఈ లెక్కన మనోల్ల తాగుడు ఖరీదు అయిదు వేల కోట్లు!!