కడప : జీర్ణాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగికి అరుదైన శస్త్రచికిత్సను (ఆపరేషను) రిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలను రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ శుక్రవారం మీడియాకు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప నగరానికి చెందిన బాబు అనే వ్యక్తి సంవత్సరం నుంచి కడుపులో గడ్డతో బాధపడుతూ పది రోజుల క్రితం రిమ్స్ జనరల్ మెడిసిన్ వార్డులో చేరినాడన్నారు.
రోగిని పరిశీలించిన మొదటి యూనిట్ వైద్యులు రోగి కడుపులో పెద్ద పేగు బయటి గోడలకు చిన్న పేగుకు అతుక్కుని పెద్ద సైజులో ఉన్న జీర్ణాశయ క్యాన్సర్ కణతిని గుర్తించారన్నారు. దీనిని వైద్య పరిభాషలో గ్యాస్ట్రో ఇంటిస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్ అంటారని తెలిపారు.
రోగి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని దాదాపు నాలుగు గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేసి కిలో బరువు గల కణతిని తొలగించామన్నారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని ఆహారం తీసుకుంటున్నాడని అన్నారు.
చాలా ప్రమాదకరమైన ఈ వ్యాధికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందక చాలా మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఎంతో శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేయడం జరిగిందని అన్నారు. ఈ శస్త్రచికిత్సకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు అవుతుందని అలాంటిది రిమ్స్‌లో ఉచితంగా చేశామన్నారు.
జిల్లాలోని పేద ప్రజలు అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోకుండా రిమ్స్‌లో ఉన్న సేవలను వినియోగించుకోవాలని కోరారు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్ రమణయ్య, డాక్టర్ సుకుమార్, డాక్టర్ రాజేష్, ఇతర వైద్యులను అభినందించినట్లు తెలిపారు.