ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య
రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లులో కృష్ణానది నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసిన విషయం విదితమే.
కృష్ణానది నీటిపై ఆధారపడిన ఒక ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం, అదే సందర్భంలో కృష్ణా నది నీటిపై ఆధారపడిన రెండు ప్రాంతాలకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
రెండు ప్రాంతాలకు అంటే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు కృష్ణానది నీటి యాజమాన్య బోర్డుకు ప్రాతినిద్యం వహిస్తున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, రాయలసీమ అవసరాలను ఏమాత్రం లెక్క పెట్టని విషయం గత సంవత్సరంలో రాయలసీమకు అనుభవమైంది.
రాయలసీమకు త్రాగు నీటిని తీసికోవడానికి వీలు లేకుండా చేసి శ్రీశైలం ప్రాజక్టు నుండి 790 అడుగుల వరకు కూడా నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీసికొనిపోవడానికి ఆం.ప్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపింది.
రెండు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో 2015 వ సంవత్సరం జూన్ నెల 18, 19 న జరిగిన కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసికొని రాయలసీమకు తీవ్రమైన ద్రోహం చేసిందీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
ఈ విషయంపై రాయలసీమ బాసటన నిలబడకుండా రాయలసీమకు చేసే ద్రోహం చేయడంలో పాలక, ప్రతిపక్ష పార్టీలు పోటి పడ్డాయి. రాయలసీమ ప్రజలు గత సంవత్సరంలో సాగు నీటికి పడిన ఇబ్బందిని ప్రక్కన పెట్టినా, త్రాగు నీటికి ఇక్కడి ప్రజలు పడిన ఇబ్బందులను చూసైనా చలించి రాబోయే కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు సమావేశంలోనైనా రాయలసీమకు న్యాయం చేసేలాగా ప్రభుత్వం నుండి ప్రతి పాదనలు ఉంటాయని ఆశించారు రాయలసీమ వాసులు.
గత నెల 21, 22 న జరిగిన కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు సమావేశంలో త్రాగు నీటి పేరుతో గుంటూరు కాలువకు తీసికొని పోతున్న సాగునీటి విడదల మూడు, నాలుగు రోజుల ఆలస్యమైందని నానా యాగి చేసిందే గాని రాయలసీమ ఊసే ఎత్తలేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాయలసీమ ఇబ్బందులపై ఏమాత్రం స్పందించక పోగ గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడ 790 అడుగులకే శ్రీశైలం ప్రాజక్ట్ నుండి క్రిందకు నీటిని తీసికొని పోవడానికి సంసిద్దత తెలిపింది.
ఈ విషయంలో అన్యాయానికి గురౌతున్న రాయలసీమ పక్షాన నిలువవలసిన రాజకీయ పార్టీల స్పందన అంతంత మాత్రేమే ఉండటం రాయలసీమ వాసులను కలచి వేస్తున్నది. ప్రతి పక్ష పార్టీ మొక్కుబడిగ రాయలసీమ శాసనసభ్యలతో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. మిగిలిన రాజకీయ పార్టీలు తమకేమి పట్టనట్లు మిన్నకున్నాయి. అన్ని ప్రాంతాల సమానాభివృద్దికి కృషి చేయవలసిన ప్రభుత్వం నీటి విషయంలో రాయలసీమకు శాశ్వత ద్రోహం చేస్తుంటే, ప్రజా స్వామ్య దేశంలో నిర్మాణాత్మకమైన పాత్ర వహించ వలసిన రాజకీయ పార్టీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి.
తీవ్రమైన, శాశ్వత అన్యాయానికి గురౌతున్న రాయలసీమపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అన్ని రాజకీయపార్టీల అధినాయకులు తక్షణమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమను ఆదుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.
ముఖ్యమంత్రి గారు శ్రీశైలం ప్రాజక్టులో వంద శతకోటి ఘణపుటడుగుల నీరు నిల్వ చేస్తానని పదే పదే ప్రకటిస్తున్నారు. పట్టిసీమ నిర్మాణం పూర్తి అయ్యింది, రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. కె సి కెనాల్ స్థిరీకరణకు గుండ్రేవుల చేపడతామని చెప్పి 23 నెలలు కావస్తున్న ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇవన్నీ ప్రక్కన పెట్టి రాయలసీమ వారిని అయోమయానికి గురి చేసేలాగ కృష్ణా , పెన్నా నదులను అనుసంధానం చేసి సోమశిల, కండలేరులో 160 శతకోటి ఘణపుటడుగులు నీరు లిప్ట్ ద్వారా నిల్వ చేస్తామని కొత్తపల్లవిని ముఖ్యమంత్రి గారు ఎత్తుకున్నారు.
ముఖ్యమంత్రి గారు శుష్క వాగ్దానాలతో కాలం వెళ్ళబుచ్చుతూ, కృష్ణా జిల్లా సేవలో పట్టిసీమ, పోలవరం నిర్మాణాలలో మునిగి తేలుతున్నారు. కృష్ణా డెల్టాకు జులైలో నీరందిస్తే చాలు రాష్ట్రం అంతా సుభిక్షం అనే భావనలో ఉన్నట్టున్నారు.
కల్లబొల్లి మాటలతో మభ్యపరిచే కార్యక్రమాలు ప్రభుత్వం మానుకొని, రాయలసీమ సాగునీటి అభివృద్ది కొరకు చిత్తశుద్దితో పని చేయాలని రాయలసీమ వాసులు ఆకాంక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి గారు ప్రకటించనట్లుగా శ్రీశైలం ప్రాజక్టులో 100 టిఎంసిల నీరు నిల్వ చేయడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం తక్షణమే చేపట్టి పూర్తి చెయ్యాలి.
ముఖ్యమంత్రి గారు ప్రకటించనట్లుగా రాయలసీమను సశ్యస్యామలం చేయడానికి జులై 5 న జరిగే కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డులో శ్రీశైలం ప్రాజక్టు నుండి నీటి విడుదల విధివిధానాలలో సమూలమైన మార్పులు తీసికొని రావాలి మరియు పట్టిసీమ నిర్మాణం ద్వారా కృష్ణా డెల్టాకు శ్రీశైలం ప్రాజక్టుతో అనుబంధం తెగిపోయినందన, ఈ నిర్మాణం ద్వారా ఆదా అయిన 45 టి యంసి ల నీటిని గాలేరు – నగరికి మరియు హంద్రీ – నీవాకు నికర జలాలుగా కేటాయించాలి. నికర జలాలను కేటాయించడం ద్వారా ఈ ప్రాజక్టులకు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాబట్టి త్వరగా పూర్తి చెయ్యాలి.
శ్రీశైలం ప్రాజక్టు ప్రస్తుత నీటి విడుదల విధానాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాయలసీమ అవసరాలకంటే ప్రధమ ప్రాదాన్యత విద్యుత్ ఉత్పత్తికి ఉన్నది. మానవ హక్కుల ప్రకారం తాగు నీటికున్న ప్రాదాన్యతే కాకుండ, జాతీయ నీటి విధానం ప్రకారం కూడా ప్రాధాన్యత క్రమంలో ప్రధమంగా తాగు నీటికి ద్వితీయంగా సాగు నీటికి చివరిగానే విద్యత్తుకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈ మౌలికమైన అంశం నేపద్యంలో రాయలసీమకు తాగు నీరు అందించడానికిి, రాయలసీమకు వాటా ఉన్న నికర జలాలను వాడుకొనడానికి శ్రీశైలం ప్రాజక్టు నీటి మట్టాన్ని తక్షణమే 854 అడుగులకు పునరుద్దరించాలి. శ్రీశైలం ప్రాజక్టు నీటి విడుదల ప్రాదాన్యతలో రాయలసీమ తాగు నీటికి ప్రధమ ప్రాధాన్యతను ఇవ్వాలి.
- విద్యుత్ ఉద్పాదన శ్రీశైలం ప్రాజక్టులో 874 ఆడుగులున్నపుడే చేపట్టాలి.
- కృష్ణానది నీటి నిర్వహణకు కేంధ్ర స్థానంలో ఉన్న కర్నూలులో కృష్ణా నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చెయ్యాలి.
- జులై 5 న జరిగే కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పై నిర్దిష్ట ప్రతిపాదనలకు అనుమతులు పొంది రాయలసీమను నివాసయోగ్యంగా చెయ్యాలి. దీనికి అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలు పక్కన పెట్టి నిర్మాణాత్మకమైన పాత్ర వహించాలి.
ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య, ఇది శాంతిభద్రతల సమస్యగా మారకుండ చేయవలసిన భాధ్యత ప్రభుత్వానిది మరియు అన్ని రాజకీయ పార్టీలది.
రాయలసీమ రైతులు, ప్రజలు జాగృతులై ఉన్నారు, వారి ఆశలు, ఆకాంక్షలును తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తే రాజకీయ పార్టీలు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది జాగ్రత్త.