పదిమంది నాయకులకంటె పది అడుగుల ఎత్తున …

పదిమంది నాయకులకంటె పది అడుగుల ఎత్తున …

నా అరవయ్యో యేట రాజకీయాలనుంచి వైదొలగుతాను- అన్నారు రాజశేఖరరెడ్డి ఆ మధ్య. ఈ మధ్య ఎవరో ఆ ప్రస్థావన తెస్తే “ఒకటి రెండు పనులు చక్కబెట్టి ఆ పని చేస్తాను” అన్నారు.

కాని మృత్యువుకి ముందువెనుకలు నిర్దుష్టంగా తెలుసు. మృత్యువు కొన్ని జీవితాలకు అమోఘమైన డిగ్నిటీని యిస్తుంది. అనూహ్యమైన గ్లామర్ ని యిస్తుంది. ప్రజాస్పందననీ, ఆవేదననీ జత చేస్తుంది. ఒక్క మృత్యువుకే ఆ శక్తి వుంది. తప్పనిసరిగా విషాదం, ఆవేదన- ఆ వ్యక్తి మంచి చెడ్డలమీద మన్నికయిన తెరని కప్పి- కేవలం అమరుడి వ్యక్తిత్వాన్నే ఆకాశానికి ఎత్తుతుంది. గత నాలుగు రోజుల్లో రాజశేఖరరెడ్డిగారి వ్యక్తిత్వాన్ని ఎవరూ విశ్లేషించలేదు. విశ్లేషించలేరు. ఈ దశలో ఆయన నిష్క్రమణ ఆయన జీవితానికి అర్ధాంతరంగా, హడావుడిగా అప్తవాక్యాన్ని రాయవలసిన అగత్యాన్ని కలిగించింది.

దివంగత నేతపట్ల పై విశ్లేషణ కాస్త ఎబ్బెట్టుగా, క్రూరంగా కనిపించవచ్చు. కాని ఆ వాటా చరిత్రది అని మనం మరిచిపోకూడదు. రాజకీయ రంగంలో ఇంకా ప్రారంభంలోనే ఉన్న రాజీవ్ గాంధీని, ఊహించలేని వ్యతిరేకతకి గురయిన ఇందిరాగాంధీని మృత్యువు అమర వీరుల్ని చేసింది.

ఆయితే రాజశేఖరరెడ్డి ఘనతని కేవలం మృత్యువుకే కట్టబెట్టి చేతులు దులుపుకోవడం అన్యాయం. 31 సంవత్సరాల క్రితం కేవలం రాజకీయమైన ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఓ వైద్యుడు మూడు దశాబ్దాలలో ప్రజల గుండె చప్పుడుని చదవగల స్టెతోస్కోపుని సంపాదించుకున్నాడు. వంశపారంపర్యంగా వచ్చిన నిష్కర్షమైన వ్యక్తిత్వాన్ని తను నమ్మిన నిజాలకు అంతే నిర్దుష్టంగా అన్వయించడం అలవాటు చేసుకున్నాడు.

చదవండి :  ఎందుకింత చిన్నచూపు?

అలనాడు తెలుగుదేశం రెండు కోణాలనూ తాకుతూ 1400 మైళ్ళ ప్రస్థానం- ఆయనకి కనువిప్పునీ, ప్రజలకు ఆయన పట్ల మెప్పునీ సంపాదించిపెట్టింది. దక్షిణాఫ్రికాలో దమన నీతిని పాటించే ప్రభుత్వాన్ని ఎదిరించి గాంధీ ఇండియాకి వచ్చినప్పుడు గోఖలేవంటి నాయకులు స్వాతంత్ర్య పోరాటాన్ని సాగిస్తున్నారు. గాంధీకి గోఖలే చెప్పిన మొదటి సలహా- నువ్వు సేవ చెయ్యాలనుకుంటున్న దేశం ఏమిటో, ఆ ప్రజలు ఎవరో, వారి మనోభావాలు ఏమిటో ముందు తెలుసుకో- అన్నారు. గాంధీ ఆ పని చేశారు. తత్పలితమే మహాత్ముని అవతరణ.

ఆంధ్ర దేశంలో రాజశేఖరరెడ్డిగారి పాదయాత్ర అలాంటి మలుపు. తదాదిగా ఆయనకి ప్రజల పట్లా, ప్రజలకి ఆయన పట్లా కొత్త బంధుత్వం ఏర్పడింది. ఆ బంధుత్వాన్ని ఆయన సార్ధకం చేసుకున్నారు. చరితార్ధం చేశారు.

ఐటి అభివృద్ధులతో, స్టేడియం నిర్మాణాలతో, అమెరికా అద్యక్షుల సత్కారాలతో పరపతిని కుదించుకున్న నాయకత్వంనుంచి పేద ప్రజానీకపు ప్రతినిధిగా కుర్చీలో కూర్చున్నారు.తరతమ బేధాలు లేకుండా ఆరోగ్యానికి వసతుల్నీ, వృద్ధులకు పెన్షన్లనీ, ఆహారాన్నీ, నిత్యావసరాల్నీ యుద్ధప్రాతిపదిక మీద సమకూర్చారు. కొత్త ఆలోచనను కాగితం రాసుకున్నారు. రాసిన ఆలోచనకు ఆచరణ రూపం యిచ్చారు.

చదవండి :  వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

ఇక, మొన్నటి ఎన్నికలలో రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వం కొత్త మెరుగులు దిద్దుకుంది. సినీగ్లామరుతో మైదానాలు నిండినా, పూల వర్షాలు కురిసినా నిండిన కడుపులూ, జరిపిన మేళ్ళే నిజమయిన వోట్లుగా తర్జుమా కాగలవని నమ్మి విశ్వాసంతో, నిలకడతో వోటర్లను పలకరింఛారు.వోటర్ నిష్కర్షగా, నిర్దుష్టంగా, నిర్ద్వంధంగా, నిర్మొహమాటంగా కుండ బద్దలు కొట్టేశాడు. కలుపుమొక్కల్నీ, అవకాశవాదుల్నీ వేళ్ళతో పెకలించాడు.

తర్వాతి చర్య- రాజశేఖరరెడ్డిని రాజకీయ నాయకుడి స్థాయినుంచి రాజకీయ వేత్త స్థాయికి లేవదీసింది. భారతదేశంలో ఏ రాష్ట్రమూ యివ్వనంత బలాన్ని కేంద్రంలో కాంగ్రెసుకి- 33 సీట్లను- ఆంధ్రదేశం యిచ్చింది. కేంద్రాన్ని సమర్ధిస్తున్న కారణానికే మంత్రి పదవుల్ని బేరం పెట్టి, అలిగి, కొడుకులకీ, మేనల్లుళ్ళకీ, కూతుళ్ళకీ, యిష్టులకీ పదవులు సంపాదించిపెట్టిన పొరుగు రాష్ట్ర బ్లాక్ మెయిల్ నేపధ్యంలో- రాజశేఖరరెడ్డి ఒక్క పదవిని కూడా కోరలేదు. తన పార్టీని కేంద్రంలో బలపరిచి- రాష్ట్రం వేపు తిరిగి “మీకేం సంక్షేమం కావాలో చెప్పండి. ఏ పధకాలు కావాలో చెప్పండి. డబ్బుని నేను కేంద్రంనుంచి తెస్తాను” అని ధైర్యంగా, గర్వంగా చెప్పారు. ఇది రాజకీయ వేత్త పరిణతికీ, విశ్వాసానికీ నిదర్శనం.

తనవారి పదవుల్ని కొనుక్కోవడం కంటె తన ప్రజల vote bank ని బలం చేసుకోగలిగిన నాయకుడు- కేవలం రేపుని కాదు, భవిష్యత్తు వేపు దృష్టిని సారిస్తున్నట్టు లెక్క. వ్యక్తిగత ప్రాతినిధ్యానికి కాక, సమాజ ప్రయోజనానికి పెద్ద పీట వేసి పదిమంది నాయకులకంటె పది అడుగుల ఎత్తున నిలిచారు రాజశేఖరరెడ్డి. A politician thinks of the next election while a statesman thinks of the next generation.

చదవండి :  మా రాయలసీమ ముద్దు బిడ్డడు

ఈలోగా మృత్యువు తొందర పడింది. కాని మృత్యువుకి కొన్ని లక్షణాలున్నాయి. It leant dignity and grace to his life!

[author image=”https://kadapa.info/wp-content/uploads/2014/02/gollapudi.jpg” ]

గొల్లపూడి మారుతీరావు గారు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. వీరు తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై వీరు వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

[/author]

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *