రాజంపేట పట్టణం

రాజంపేట పట్టణం

రాజంపేట (ఆంగ్లం: Rajampet or Rajampeta ఉర్దూ: راجپپیٹ తమిళం: ராஜம்பேட்டை), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక పెద్ద పట్టణము, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము మరియు మండల కేంద్రము. రాజంపేట పాలన ‘రాజంపేట పురపాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది.

అప్పటి వరకు గ్రామ పంచాయతీ గా ఉన్న రాజంపేట 2005లో నగర పంచాయతీగా మారింది. 2017లో మునిసిపాలిటీగా మారింది.

రాజంపేట పేరు వెనుక కథ:

తమ రాజవంశానికి చెందిన ‘రాజమ్మ’ పేర మట్లి రాజులు కట్టిన ‘రాజమ్మపేట’ క్రమంగా రాజమపేట లేదా రాజంపేటగా మారింది. (ఆధారం: కడప మండల చరిత్రము, పేజీ 71, జనమంచి శేషాద్రి శర్మ)

ఇంకో కథ :

గాలా చిన్న తిమ్మారెడ్డి రాజయ్య గారి పేరు మీద కట్టించినందు వలన దీనికి రాజంపేట అనే పేరు వచ్చింది (ఆధారం : మెకంజీ కైఫీయత్తులు 1134 – 147)

పై రెండు అంశాలను ‘కడప ఊర్లు పేర్లు’ పరిశోధనా పుస్తకంలో డా.కేతు విశ్వనాథరెడ్డి రికార్డు చేశారు.

భౌగోళికం:

రాజంపేట
రాజంపేట

రాజంపేట పట్టణం భౌగోళికంగా 14.195°N 79.158°E వద్ద ఉన్నది. ఇది సముద్రమట్టానికి 139 మీ (456 అడుగుల) ఎత్తులో, పుల్లంగి (బహుదా నది లేదా చెయ్యేరుకి ఉపనది) నదీ ఎడమ తీరంలో, కడప – రేణిగుంట రహదారిలో (జాతీయ రహదారి 716) ఉంటుంది. మద్రాసు – బొంబాయి రైల్వే లైను రాజంపేట మీదుగా వెళుతుంది.

చదవండి :  శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట

జనాభా:

2011 జనాభా లెక్కల ప్రకారం రాజంపేట జనాభా 54050 – ఇందులో పురుషులు 27052 మంది కాగా స్త్రీలు 26998 మంది. రాజంపేట పట్టణంలో అక్షరాస్యతా శాతం 77.99. పురుషులలో అక్షరాస్యతా శాతం 85.7గా ఉండగా స్త్రీలలో అది 70.35గా ఉంది. పట్టణంలో మొత్తం 12263 ఇళ్లున్నాయి.

రాజంపేట జనాభాలో హిందువులు 78.09శాతంగా, మహమ్మదీయులు 20.75శాతంగా,  క్రైస్తవులు 0.58శాతంగా, ఇతరులు 0.57 శాతంగా ఉన్నారు.

ప్రత్యేకత:

వివిధ  మతాలు, కులాలకు చెందిన ప్రజల ఐక్యత. వారం వారం జరిగే సంత.

పట్టణంలోని ప్రాంతాలు:

మన్నూరు, పాత బస్టాన్డు, కొత్త బస్టాన్డు, బోయినపల్లి, సరస్వతీపురం, సాయినగర్, రాంనగర్, రైల్వే కాలనీ, కూచివారిపల్లి,  పోలి

దర్శనీయ స్థలాలు:

ఆధ్యాత్మికం: అమ్మవారిశాల, సాయిబాబా గుడి, బలిజపల్లి గంగమ్మ దేవాలయం, రామాలయాలు, వినాయక సుబ్రమణ్య గుడి, ఉదయగిరి ఎల్లమ్మ గుడి, పోలి చెరువుకట్ట మీదుండే శనీశ్వరుని గుడి,  శివాలయం,  సుబ్బదాసు స్వామి ఆలయం, నూర్ మసీదు, రహమతీయ మసీదు, భువనగిరి గుట్ట మీదుండే నరసింహాలయం, అంకాలమ్మ గుడి, బ్రహ్మంగారి గుడి, మారెమ్మ గుడి, శంకర మఠం,

చదవండి :  “రండి, వచ్చి చూడండి... తర్వాత మాట్లాడదాం” : కడప పర్యటన - 2

ఇతరం:  పోలి చెరువు, 108 అడుగుల అన్నమాచార్యుని విగ్రహం, మునిసిపల్ పార్కు, రైల్వే కాలనీ పార్కు

రాజంపేట
రాజంపేట మునిసిపల్ పార్కు

రాజంపేటకు సమీపాన ఉన్న దర్శనీయ స్థలాలు :

  • అత్తిరాల పరశురామాలయం
  • తాళ్ళపాక (అన్నమాచారుల జన్మస్థలం)
  • నందలూరు సౌమ్యనాథాలయం
  • ఆడపూరు బౌధ్దారామం
  • మంగంపేట ముగ్గురాళ్ళ గనులు
  • అన్నమయ్య జలాశయం
  • ఒంటిమిట్ట కోదండరామాలయం
  • అనంతరాజుపేటలోని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం
  • సిధ్దవటం కోట
  • భక్తకన్నప్ప పుట్టినూరు ‘ఊటుకూరు’
  • పంచముఖేశ్వర ఆలయం, ఇసుకపల్లి
  • చిన్మయారణ్యం, ఎల్లంపల్లి

విద్యాసౌకర్యాలు:

ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన అన్ని విద్యాసంస్థలు రాజంపేట పట్టణంలో ఉన్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలలో – రాష్ట్ర పాఠ్య ప్రణాళికలను భోదించే విద్యాసంస్థలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వృత్తి విద్యను అందించే పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులోఉన్నాయి.

రాజంపేట
రాజంపేట ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల

ప్రజారవాణా సౌకర్యాలు:

రాజంపేటలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సర్వీసు ఆటోలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోలలో ఒకచోటు నుండి మరోచోటికి వెళ్ళటానికి కనీస చార్జి పది రూపాయలు.

బయటి వారిని చేరవేసేందుకు బస్సు స్టాండు, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది.

దగ్గరి విమానాశ్రయం : కడప (63 కి.మీ), తిరుపతి (85కి.మీ), బెంగుళూరు (252 కి.మీ), చెన్నయ్ (219 కి.మీ)

దగ్గరి రైల్వేస్టేషన్ :  రాజంపేట (1 KM), కడప (54 KM)

చదవండి :  నంద్యాలంపేట
రాజంపేట రైల్వేస్టేషన్
రాజంపేట రైల్వేస్టేషన్

వైద్య సౌకర్యాలు:

పట్టణంలో మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అనేక ప్రయివేటు జనరల్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి.

మొబైల్, ఇంటర్నెట్ సేవలు:

రాజంపేట పట్టణ పరిధిలో అన్ని టెలికం కంపెనీలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయి. నగర వ్యాప్తంగా 4జి సేవలు, 3జి సేవలు, బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పట్టణంలో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు అందించే కేంద్రాలున్నాయి.

వినోద కేంద్రాలు:

వినోదాన్ని అందించేందుకు నగరంలో సుమారు 5 వరకు సినిమా హాళ్ళున్నాయి. వీటిలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ సినిమాలు ప్రదర్శితమవుతుంటాయి.

మద్యపాన ప్రియుల కోసం శీతల గదులతో కూడిన బార్‌లు (మద్యపానశాలలు) కూడా అందుబాటులో ఉన్నాయి.

హోటళ్ళు/భోజనశాలలు:

రాజంపేటలో దక్షిణాది, ఉత్తరాది, తెలుగు శాఖాహార, మాంసాహార వంటకాలను వడ్డించే సాధారణ/శీతల గదులతో కూడిన హోటల్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే పలుచోట్ల భోజన సదుపాయం అందించే మెస్ లు కూడా ఉన్నాయి.

పిన్ కోడ్ : 516115

STD కోడ్ : 08565

వాతావరణం : ఉష్ణోగ్రత: 30°సె. – 44°సె (ఎండాకాలం), 21°సె. – 30°సె (చలికాలం), సగటు వర్షపాతము: 738.9 మి.మీ

సందర్శించేదానికి అనువైన సమయం: ఆగష్ట్  – ఫిబ్రవరి మధ్య కాలం

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *