కడప : ప్రముఖ రంగస్థల నటుడు కోరుమంచి సుబ్బరాయుడు(71) బుధవారం కడప నగరంలోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. సిద్దవటం మండలం బంగలవాండ్లపల్లెకు చెందిన ఆయన జిల్లాలో ఆధునిక నాటక రంగంలో కీలక పాత్ర పోషించారు. నాయుడుగా సుపరిచితులైన ఆయన యంగ్ మెన్స్ డ్రమటిక్ అసోసియేషన్(వైఎండీఏ) వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈ సంస్థ ద్వారా ఎన్నో ప్రయోగాత్మక సాంఘిక నాటకాలను పొరుగు రాష్ట్రాల్లో సైతం ప్రదర్శించి ఉత్తమ నటుడిగా పేరు గడించారు. పలు నాటక పరిషత్ పోటీలలో బహుమతులు సాధించారు.
కాలజ్ఞానం, ఇంద్ర సింహాసనం, సర్పయాగం, బొమ్మ బొరుసు నాటకాలలో హాస్యనటుడుగా, క్యారెక్టర్ నటుడుగా విశేష కీర్తిని సాధించారు. బ్రహ్మంగారి జీవిత చరిత్రను గురుబ్రహ్మ పేరిట తానే రచించి నటించారు. నాయుడు మృతి నాటకరంగానికి తీరని లోటని సవే రా ఆర్ట్స్ వెంకటయ్య, సౌజన్య కళా మండలి సాదిక్‌వలీ, వైఎండీఏ రవీంద్రనాధ్, నవ్యకళానికేతన్ సిలార్, రాజీవ్ కల్చరల్ క్లబ్ సభ్యుడు, పలు నాటక సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.
ట్యాగ్లుkorumanchi subbarayudu stage artists in kadapa