
అన్నమయ్య దర్శించిన మేడిదిన్నె హనుమంతాలయం
అన్నమయ్య, కడప జిల్లాలో చాలా దేవాలయాలని దర్శించి, అక్కడి దేవుళ్ళ మీద కీర్తనలు రచించారు. వీటిలో కొన్ని ప్రదేశాలని కొంతమంది పరిశోధకులు, టిటిడి వాళ్ళు, వారి పరిశోధనలో గుర్తించడం జరిగింది. కాని ఇంకా కొన్ని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు. అలాంటి ప్రదేశాలలో, మేడిదిన్నె హనుమంతాలయం ఒకటి. ఈ ఊరి గురించి మాకు అన్నమయ్య కీర్తనల మీద పరిశోధన చేస్తున్న, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా తెలిసింది.
మేడిదిన్నె కడప జిల్లాలో పెద్దముడియం మండలానికి చెందిన గ్రామము. జమ్మలమడుగు నుండి 15కిమిల దూరంలో ఉంటుంది. గుండ్లకుంట కంటే ముందు, కుడి వైపు దారిలో 3కిమీలు వెల్తే చేరుకోవచ్చు. ఈ గ్రామంలో ఉండే ఆంజనేయస్వామిని అన్నమయ్య దర్శించి, ఇక్కడి ఆంజనేయస్వామిని వర్ణిస్తూ ఒక కీర్తన రచించారు.
“చెల్లె నీ చేతలు నీకే చేరి మేడేగుడిదిన్న
నల్లదె కంటిమి నిన్ను హనుమంతరాయ”
అనే పల్లవితో ఈ పాట ఉంటుంది. ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం చాలా పెద్దది. పెరిగిన తోకతో, పెద్దదైన పిరుదుతో, స్వామి కార్యం కోసం సముద్రంపైకి లంఘించడానికి సిద్దంగా ఉన్న ఆంజనేయస్వామి అని అన్నమయ్య హనుమంతున్ని వర్ణించాడు.

మేడిగుడిదిన్న ప్రస్తుతం మేడిదిన్నె గ్రామ పూర్వనామము. దీనికి ఆధారాలు మనకి శాసనాల రూపంలో ఈ ఆంజనేయస్వామి దేవాలయం ఎదుటే లభించాయి. కడప జిల్లా శాసనాలలో రికార్డ్ అవ్వబడిన 137వ శాసనం ప్రకారము, విజయనగర రాజు తుళువ నరసనాయకుని పరిపాలనలో క్రీశ 1501 సంవత్సరంలో అంజనేయస్వామి గుడిని పునరుద్ధరించి, విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేసారని, కత్తి యర్రమనాయుని కుమారుడు బస్పవినాయకుడు, నరసనాయకులు గారికి, ఊరికి ఉత్తరం దిశలో ఒక “పండుము” భూమిని దానం చేశారని తెలుస్తోంది.
మేడిదిన్నె కైఫియత్ ప్రకారము, కృస్ణదేవరాయల కాలంలో, తాడిపత్రి మాధవ పంతులు అనే బ్రాహ్మణుడు నివసించేవారు. ఆయనకి నలుగురు కుమారులు. వారి పేర్లు నాగం భట్లు, మల్లిభట్లు, సిట్టుభట్లు, రామాభట్లు. వీరిలో నాగంభట్లు బాగా చదువుకున్న వాడై, చాలా కాలం కృష్ణదేవరాయలచే ఆదరించబడ్డాడు. కృష్ణదేవరాయలు, ఈ నాగంభట్లు కి మేడిదిన్నె గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారం గా ఇచ్చి, కృష్ణరాయపురం అని ఇంకో పేరు పెట్టారు.
పూర్వం గర్భగుడి మాత్రమే ఉండేది. గర్భగుడి ముందు పెద్ద అరుగు ఉండేది, గుడి ఎత్తులో ఉండటం వలన, పునరుద్దరణ సమయంలో ఈ అరుగు, ప్రస్తుతం ఉన్న మండపం కింద ఉంది. గుడి ముందు ఉన్న అరుగుని, ఊరి పెద్దలు పంచాయితీ సమయలో వాడుకుంటున్నారు.
టిటిడి వాళ్ళు కాని, ప్రభుత్వం కాని ఈ ఆలయాన్ని గుర్తించి, అభివృద్ది చేసి, పర్యటకాన్ని అభివృద్ది చేస్తే బాగుంటుంది. ఊర్లో ఇంకా శివాలయం, చౌడమ్మ గుడి, రాముల వారి కోవెల ఉన్నాయి.