మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ
సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని
ప్రొద్దుటూరు : సమాజంలో జరుగుతున్న మార్పుకు ప్రతిబింబంగా దాదాహయాత్ కథలు నిలుస్తాయని, గత సమాజపు పరిస్థితులు , నేటి సమాజపు పరిస్థితులను పోల్చి చేసుకునేందుకు ఒక కొలమానంగా నిలుస్తాయన్నారు ప్రముఖ కథా రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ. ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని తల్లంసాయి రెసిడెన్సీలో ‘మురళి వూదే పాపడు’ కథల సంపుటిని (దాదా హయాత్ రాసిన కథలు) మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సాహితీవేత్త, చరిత్రకారులు డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి ఆవిష్కరించారు.
ప్రోగ్రెసివ్ ఫోరం, అరసం సంయుక్తంగా నిర్వహించిన ఈ పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిధిగా హాజరైన సింగమనేని నారాయణ మాట్లాడుతూ… దాదాహయాత్ కథలు వర్తమాన కథలు కాకపోయినా, 20 ఏళ్ళ కిందటి ఆయన రచనా కాలంలోని సామాజిక పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయన్నారు. అందుకే రచయిత తన ముందుమాటలో కథల రచనా కాలం నాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు, నేటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు ఎంతో తేడా ఉందని, ఆనాటి పరిస్థితులు ఈనాడు లేవని అయితే ఆనాటి పరిస్థితులను ఈ నాటి పరిస్థితులతో పోల్చడానికైనా ఉపయోగపడతాయేమోనని రాసుకోవడం చూస్తే ఇది వాస్తవ పరిస్థితి అన్నారు. తరం అంటే ఒకప్పుడు పాతికేళ్ళు. కానీ నేడు తరం అంటే ఏడేళ్ళు. ఈ ఇరవైఏళ్ళ కాలంలో మూడు తరాలు వచ్చాయన్నారు. తరానికి తరానికి మధ్య సామాజిక జీవనంలో వేగవంతమైన మార్పు కనిపిస్తోందనన్నారు. రెండు దశాబ్దాల కిందటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు ఎలాంటి సామీప్యం లేదన్నారు. ఈ కారణంగానే ఆనాటి కథలను అచ్చువేసి, జనసామాన్యంలోకి తీసుకురాలేకపోయానని సింగమనేని వ్యాఖ్యానించారు. అయితే సామ్రాజ్యవాదం సమాజంలోని అన్ని పరిస్థితులను సమూలంగా మార్చివేసిందని, ముఖ్యంగా సాంస్కృతిక సామ్రాజ్యవాదం వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. మన్మోహన్ సింగ్, పివీ నరసింహారావు కాలంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు, మార్కెట్ వ్యవస్థ ఈ సమాజాన్ని, మానవ సంబంధాలు ఎలా మర్చిందనే విషయాలు గ్రహించుకోవాలంటే దాదాహయాత్ కథను సునిశతంగా పరిశీలిస్తే అర్థమవుతాయన్నారు.
1983-2000 మధ్య రాసిన దాదాహయాత్ కథల్లోని అనేక వస్తువులు, సమాజం నేడు లేకపోయినా ఆనాటి సమాజం ఇలా ఉండేదా అని అంచనా వేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. మార్కెట్ శక్తులు సమాజంలో ఎంతటి మార్పును తీసుకువచ్చాయో తెలుసుకోవాలంటే దాదాహయాత్ రాసిన కథలను చదివి నేటి సమాజంతో పోల్చుకుని చూడాలన్నారు.
అంతకు మునుపు సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో కథా రచన ఎప్పుడు మొదలైందన్న దానిపై పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయన్నారు. తొలితెలుగు కథ దిద్దుబాటని ఉన్న అభిప్రాయాన్ని తరువాత పరిశోధనలో తొలగిపోయిందన్నారు. కథా సాహిత్యంలో 1826 నాటికే కథలు వచ్చాయని, పద్య సాహిత్యాన్ని వచనంలో మార్చుకునే క్రమంలోనే అనేక కథలు వెలువడ్డాయని పరిశోధకలు నిరూపిస్తున్నారన్నారు. దిద్దుబాటుకన్నా మొదటి కథ రాయలసీమ ప్రాంతంనుంచే వచ్చిందన్నారు. ఋతువు కథ పేరుతో రాయలసీమ ప్రాంత జీవితాలను, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే కథలు వచ్చాయని అయితే ఆనాడు కథకుని పేరు అచ్చువేయకపోవడం వలన ఎవరు రాశారో అర్థం కావడంలేదన్నారు.
పరిశోధకలు తవ్వా వెంకటయ్య, అప్పిరెడ్డి హరినాధరెడ్డి లాంటి వాళ్లు కథా తీరుతెన్నులతో పాటు, కథ పుట్టకుకు సంబంధించి విశేష కృషి చేస్తున్నారని రాచపాలెం చంద్రశేఖరరెడ్డి చెప్పారు. తెలుగు కథ పుట్టి దాదాపు 150 ఏళ్లు కావస్తోందని, ఇప్పటిదాకా దాదాపు రెండున్నర లక్షలకు పైగా కథలు వచ్చాయని అందులో కేవలం 10 శాతం కథలు మాత్రమే సామాజిక దృక్ఫధంతో,విలువతో కూడిన కథలు వచ్చాయన్నారు. ఆ జాబితాలో ఉండాల్సిన కథలు దాదా హయాత్ కథలని రాచపాలెం వ్యాఖ్యానించారు. దాదాహయాత్ కథలు ఉద్వేగాన్ని కలిగించకపోయినా సామాజిక మార్పుకు అద్దం పడతాయన్నారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన రమణారెడ్డి మాట్లాడుతూ, దాదాహయాత్ కథలు (మురళి వూదే పాపడు కథల సంపుటి) ఆలస్యంగా పాఠకుల ముందుకు వచ్చాయన్నారు. అందుకే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అదృష్టం కలిగిందన్నారు. దాదాహయాత్ కథలపై విశ్లేషణ చేయాల్సి వున్నా తనకున్న ఆనారోగ్య కారణాల వల్ల ఎక్కువ సమయం మాట్లాడలేకపోతున్నానని ఎం.వి.ఆర్ అన్నారు. ప్రముఖ కథా రచయిత మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ, దాదాహయాత్ కథలు ఆలస్యం కావడానికి ఆయనే కారణమన్నారు. ఎంతో మంది పబ్లిషర్లు, అభిమానుల ఆయన కథల్ని అచ్చు వేసేందుకు ముందుకు వచ్చినా ఆయన ముందుకు రాలేదన్నారు. కానీ ఆస్యంగానైనా వల్లూరి శివప్రసాద్ చొరవతో బయటకు రావడం సంతోషకరమన్నారు. పంచతంత్రం కథల్లా దాదాహయాత్ కథలు చాలా స్పష్టంగా ఉంటాయన్నారు.
ఈ పుస్తకావిష్కరణ సభలో ప్రముఖ సాహితీవేత్త పెనుగొండ లక్ష్మినారాయణ, పుస్తక ప్రచురణ కర్త వల్లూరి శివప్రసాద్, రచయిత దాదాహయాత్, ప్రొగ్రెసివ్ ఫోరం గౌరవాధ్యక్షుడు బత్త రామయ్య, అసరం జిల్లా కార్యదర్శి పాగిరి విశ్వప్రసాద్, సాహితీ వేత్త నరాల రామారెడ్డి, డాక్టర్ ఎన్.రామచంద్ర, షేక్ ముస్తఫా, కథకులు తవ్వా ఓబుళరెడ్డి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, జింకా సుబ్రమణ్యం, చదువుల బాబు తదితరులు పాల్గొన్నారు.