ఆదివారం , 22 డిసెంబర్ 2024
Barytes

మంగంపేట ముగ్గురాయి కథ

అనగనగా మంగాపురం అని ఒక ఊరు. ఆ ఊర్లో జనాలంతా కూలీ నాలీ చేసుకుని రెక్కల కష్టం మీద బతికేవోల్లు. ఉన్నట్టుండి ఒక రోజు ఆ ఊరికి వచ్చిన కొంతమంది స్థానిక యాపారులకి అక్కడ ఉన్న భూముల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. వెంటనే వాళ్ళు ఆ దేశపు రాజు దగ్గరికి పోయి ఇలా అడిగినారు.. ‘రాజా… మేము మంగాపురంలో ఉన్న బంగారు నిక్షేపాలను కనుగొన్నాం. మీరు అనుమతిస్తే ఆ నిక్షేపాలను వెలికితీసి అమ్ముతాం. తద్వారా వచ్చిన సొమ్ములో కొంత మీ ఖజానాకు జమ చేస్తాం’ అన్నారు. ఈ ఆలోచన విన్న రాజు సరే అన్నాడు. దీంతో యాపారులంతా మంగాపురం పోయి బంగారు తవ్వబట్టినారు. ఆ బంగారం తవ్వుకోని అమ్ముకోగా  వచ్చిన సొమ్ములో కొంత ప్రభుత్వ ఖజానాకి జమ చేసేవాళ్ళు.

కొంత కాలానికి రాజ్యాన్ని పొరుగు దేశపు రాజు యుద్ధంలో జయించినాడు. మంగాపురం గనుల విషయం తెలుసుకున్న రాజు ఆ గనుల యాపారులు పాత రాజుకు విదేయులని తెలుసుకొని ఆ గనులను తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించేశాడు. గనుల ద్వారా సంపాదించిన డబ్బును ఓడిపోయిన రాజుకిస్తే మళ్ళీ ఆయన సైన్యాన్ని కూడగట్టి తనపైకి దండెత్తి వస్తాడనేది రాజు గారి భయం. అప్పటి నుండి రాజు గారి ప్రభుత్వమే మంగాపురం గనుల నుంచి బంగారు తవ్వి తీసి విదేశాలకు ఎగుమతి చేసి డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది. అలా వచ్చిన సొమ్ము ఖజానాకు దండిగా చేరింది. ఇంతలో ఉన్నట్టుండి ఒకసారి ఓడిపోయిన రాజు సైన్యాన్ని కూడగట్టుకుని తిరిగి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని పాలన సాగించడం మొదలు పెట్టినాడు.

చదవండి :  ఫేస్‌బుక్ వేదికగా తెదేపా, వైకాపా శ్రేణుల పోరు

ఈ విషయం తెలుసుకున్న యాపారులు రాజు దగ్గరికి పోయి ఇంతకు ముందు మాదిరిగా గనులు తమకే అప్పగించాలని వేడుకున్నారు. అందుకు రాజు కుదరదన్నాడు. ప్రభుత్వమే ఆ పని కొనసాగిస్తుందన్నాడు. ఇంతలో కొన్నాళ్ళకు గనులలో ఉన్న నిక్షేపాలు అయిపోవడంతో పక్కనే ఉన్న మంగాపురాన్ని వేరే చోటికి తరలించి అక్కడ ఉన్న నిక్షేపాలు తీసే దానికి  గనులు తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో స్థానిక యాపారులు ఎక్కడ అడ్డుతగులుతారో అని భయపడ్డ ప్రభుత్వం వారిని ఒప్పించేందుకు ఒక ఎత్తుగడ వేసింది. స్థానిక యాపారులు లేదా ఆ ప్రాంతం వాళ్ళు ఎవరైనా బంగారు శుద్ది చేసుకునేదానికి మిల్లులు ఏర్పాటు చేస్తే వాళ్లకు ప్రభుత్వం ముడి బంగారులో 40 శాతం కోటా కేటాయించి మార్కెట్ రేటు కన్నా కొద్దిగా తక్కువకు అమ్ముతుందని దాన్ని వాళ్ళు శుద్ది చేసుకుని బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చును అని. ఈ ఆలోచన రాజు గారికి కూడా నచ్చింది. వెంటనే దీనిని అమలు చేయమని ఆదేశిస్తూ ఒక శాసనం (జీవో నెంబరు 296) వేయించాడు.

చదవండి :  హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? - మొదటి భాగం

అనుకున్నట్లే స్థానిక యాపారులు ఇబ్బందులు కలిగించకపోవడంతో మంగాపురాన్ని అక్కడి నుంచి వేరే చోటికి తరలించి అక్కడ గనులు తవ్వడం మొదలు పెట్టింది ప్రభుత్వం. రాజాజ్ఞ ప్రకారం మిల్లులు పెట్టుకున్న వాళ్ళకు ప్రభత్వం ముడి బంగారు సరఫరా చేయడం మొదలు పెట్టింది. కొంతమంది యాపారులు మిల్లుల కోసమని తీసుకున్న ముడి బంగారును శుద్ది చేయకుండా అట్టనే అమ్ముకోబట్టిరి.

కొంతకాలానికి రాజును ఓడించి రాజ్యాన్ని మళ్ళా స్వాధీనం చేసుకున్న పొరుగుదేశపు రాజు మంగాపురం గనుల గురించి వాకబు చేసినాడు. వెంటనే పాత రాజు స్థానిక యాపారులకు కేటాయించిన ముడి బంగారు కోటాను రద్దు చేసినాడు. అదేమంటే వాళ్ళు రాజాజ్ఞను ఉల్లఘించారన్నాడు. అంతేకాకుండా దండవారు వేసి ఏ దేశమోల్లు వచ్చి ఎక్కువ ఇస్తామంటే వాళ్ళకే బంగారు గనులు అప్ప(నంగా)గిస్తామని…! అంతవరకూ ఆ గనులనే నమ్ముకొని బతికిన యాపారులూ, ప్రభుత్వ ఉద్యోగులూ, స్థానికులూ కలవరపడినారు… ఒకరికొకకరు తోడైనారు… పిడికిలి పైకెత్తినారు!!

చదవండి :  అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -1

పై కథ కడప – తిరుపతి రాష్ట్ర రహదారి పైన రైల్వేకోడూరుకు సమీపంలో ఉన్న మంగంపేటలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సరిగ్గా సరిపోలుతుంది. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయంతో మంగంపేట ముగ్గురాయిని ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకోకుండా, స్థానికులకూ దక్కకుండా బడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్న వార్తలు స్థానికంగా కార్చిచ్చు రేపుతున్నాయి. కోటా (జీవో 296) రద్దు చేసి తమ పొట్ట కట్టిందని ఆందోళన చెందుతున్న మిల్లర్లు, వాటిని ఆదరువుగా చేసుకుని బతుకుతున్న కార్మికులూ, రవాణా వ్యాపారులూ కార్చిచ్చును దావానంలా మార్చటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.

ఇదీ చదవండి!

telugudesham

జిల్లా పేరు మార్చాలని తెదేపా తీర్మానం

కడప: వైఎస్‌ఆర్ జిల్లాకు కడప జిల్లాగానే పేరు మార్చాలని ఆదివారం కడపలో జరిగిన తెదేపా మినీ మహానాడులో ఆ పార్టీ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: