
బ్రాహ్మణి సూపర్ అంటున్న ‘ఈనాడు’
ఒకప్పుడు ‘బ్రాహ్మణి’ ఉక్కు కర్మాగారానికి వ్యతిరేఖంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించిన ‘ఈనాడు’ దినపత్రిక ఇప్పుడు అదే కర్మాగారాన్ని ఆహా…ఓహో అని కీర్తిస్తోంది. ఇవాల్టి కడప జిల్లా టాబ్లాయిడ్ లో ఈనాడు దినపత్రిక ఇలా రాసింది…
‘జిల్లాలోనే ఎందుకు ఏర్పాటు చేయాలి: ఉక్కు పరిశ్రమ కోసం జమ్మలమడుగు- ముద్దనూరు మధ్యలో సుమారు 11వేల ఎకరాల భూమిని కేటాయించారు. విమానాశ్రయం కోసం మరో 4 వేల ఎకరాలు భూమి కేటాయించారు. జపాన్ నుంచి విలువైన యంత్రాలు ఇక్కడికి తెప్పించారు. టౌన్‌షిప్, అతిథి గృహాలు, విద్యుత్తు ఉపకేంద్రం ఏర్పాటు చేశారు. మైలవరం జలాశయం నుంచి పైపులైను పనులు పూర్తయ్యాయి. ఉక్కు పరిశ్రమ సమీపంలోనే ముద్దనూరు రైల్వేస్టేషన్ ఉంది. బ్రహ్మణి స్థానంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు ఇవన్నీ అనుకూల అంశాలు.‘
ఒకప్పుడు వైఎస్ మీదున్న వ్యతిరేఖత కొద్దీ బ్రాహ్మణి మొత్తం పెద్ద కుట్ర అంటూ మెయిన్లో పలు కథనాలు ప్రచురించిన ఈనాడు దినపత్రిక ఇప్పటికి బ్రాహ్మణి విషయంలో గాలి జనార్ధన్ రెడ్డి కమిట్మెంట్ (నిబద్ధత) గుర్తించినట్లుంది. బ్రాహ్మణి విషయంలో జరిగిన పురోగతి ఇప్పటికి ఈనాడు వారికి కనిపించటం విశేషమే!
‘బ్రాహ్మణి’ కేవలం ప్రభుత్వం నుండి ఇనుప ఖనిజం కొట్టేసి అమ్మటం కోసమే అనేట్లు గతంలో ఈనాడుతో పాటు కొన్ని దినపత్రికలు, టీవీ చానల్లు ఊదరగొట్టాయి. అది పట్టుకుని విపక్షాలు అభ్యంతరం లేవనెత్తటంతో నాటి కిరణ్ సర్కారు ఉక్కు పరిశ్రమను వేరే వారికి అప్పగించటమో లేక ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవటమో చేయకుండా ఏకంగా రద్దు చేసింది.