నీటిమూటలేనా?

పోయిన వారం విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి కడపకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రులూ, అధికారుల సమక్షాన మాట్లాడుతూ “కడప జిల్లాకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం” అని ఘనంగా ప్రకటించేశారు.

ఆయన వివిధ సందర్భాల్లో జిల్లాకిచ్చిన హామీలన్నీ కలిపి జాబితా తయారుచేస్తే ఒక ఉద్గ్రంథమౌతుంది. రాజకీయ నాయకులన్నాక చాలా సందర్భాల్లో చాలా చాలా హామీలు అటు ఆంతరంగిక సమావేశాల్లోనూ, ఇటు బహిరంగ సభల్లోనూ కూడా ఎన్నెన్నో ఇచ్చేస్తూ ఉంటారు. వాటిని పట్టుకుని నిలదీయాలనుకోవడం ఆచరణసాధ్యం కూడా కాదు.

చదవండి :  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కడప?

మచ్చుకొక్కటి చెప్పుకోవాలంటే అవిభాజ్య రాష్ట్రంలోనే కడపను ప్రముఖ ఐటీ కేంద్రంగా అభివృద్ధిచేస్తామని బాబుగారు మాట ఇచ్చి ఉన్నారు. అవన్నీ పక్కనబెడదాం.

ఎన్టీయార్ అన్నంత ఇదిగా సమాజం మొత్తం దేవాలయం కాకపోయినా…ప్రజాస్వామ్య దేశంలో మిగతా వేటికీ లేని ప్రత్యేకత, ప్రాధాన్యత, పవిత్రత చట్టసభలకు ఉన్నాయి. చట్టసభలైన పార్లమెంటు, అసెంబ్లీ సభలకు, వాటి సభ్యులకు కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా ఉన్నాయి. మంత్రులైనా, లేదా ప్రభుత్వాధినేతలైనా సరే సభలో తప్పుడు సమాచారం ఇవ్వడం, సభ్యులను తప్పుదోవ పట్టించే ప్రయత్నించడం చేసినట్లైతే నిజం బయటపడ్డాక వాళ్ళ పదవులను పీకేసే అధికారం చట్టసభల (స్పీకర్ల)కు ఉంది. దైవభక్తి ఉన్నవాళ్ళు దేవాలయంలోని గర్భగుడిలో ప్రమాణంచేసి అబద్ధాలు చెప్పడం ఎంత పెద్ద తప్పో ప్రజాస్వామ్యంలో చట్టసభల్లో తప్పుడు హమీలివ్వడం అంత తప్పు.

చదవండి :  వైకాపా చతికిలపడిందా?
శాసనసభ రికార్డులలో నమోదైన బాబు గారి హమీలివే!
శాసనసభ రికార్డులలో నమోదైన బాబు గారి హమీలివే!

అలాంటి శాసనసభలో విజయవాడను రాజధానిగా ప్రకటించినరోజు బాబుగారు జిల్లాలవారీగా ఇచ్చిన వాగ్దానాల్లో కడప జిల్లాలో ఉర్దూ విశ్వవిద్యాలయం నెలకొల్పుతామని స్పష్టంగా ఉంది. అది కూడా కేవలం నోటిమాటగా కాదు. డాక్యుమెంటు సహితంగా ఆ వాగ్దానం రికార్డై ఉంది (జోడించిన బొమ్మ చూడండి).

ఇక కడప విమానాశ్రయాన్ని ప్రారంభించిన బాబుగారు వేడి తగ్గాక కడప నుంచి అక్కడికి దగ్గర్లోని ఖాజీపేటకు వెళ్ళగానే “ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ఇప్పటికే కర్నూలు జిల్లాకు హామీ ఇచ్చినందున” కడపలో కుదరదని తేల్చిపారేశారు.

చదవండి :  కడప జిల్లాలో వీరశిలలు

ఇంతోటిదానికి మీ ఏలుబడిలో శాసనసభలో ఇచ్చిన హామీలు నెరవేరేలా చూడడానికి ప్రత్యేకంగా మళ్ళీ శాసనసభ్యుల కమిటీ ఒకటి!

అయ్యా, మీరిచ్చే హామీలలో నిజమైనవేవో, ఉత్తుత్తివేవో కనీసం మీకైనా స్పష్టత ఉందా?

కడప జిల్లాలో బాబు గారి పర్యటనకు సంబంధించి జిల్లా ఎడిషన్లో ‘ఈనాడు’ వారి కవరేజీ ఇదీ…

ఈనాడు కథనం

 

– త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

ఇదీ చదవండి!

కడప జిల్లాలో నేరాలు

కడప జిల్లాలో నేరాలు – ఒక పరిశీలన

రోజూ కాకపోయినా వీలుకుదిరినప్పుడల్లా ఈనాడు.నెట్లో కడప జిల్లా వార్తలు చూసే నేను క్రైమ్ వార్తల జోలికి పోయేవాడ్ని కాదు. తునిలో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: