మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ ప్రచురించినా ఇలాంటి కథలకు పాత పత్రికలకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఐతే ఈ కథ అలా మరుగున పడలేదు. 87 సంవత్సరాల తెలుగు కథాచరిత్రలో 87 మంది రచయితల అత్యుత్తమ కథలుగా ఎంపికచేసిన కథాసాగర్ సంకలనంలో చోటు సంపాదించుకుంది. కథ అక్కడితో ఆగలేదు – ఆ కథాసంకలనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారి గ్రూప్ – 1 మెయిన్స్ సిలబస్ లో చేర్చారు. ఆ కారణంగా ఆ కథాసంకలనాన్ని, ఒకానొక కాలంలో నేను చదవాల్సొచ్చింది. దాంట్లో చాలా వరకు మంచి కథలే ఉన్నాయనుకోండి, కానీ ప్రస్తుత చర్చ ఈ ఒక్క కథ గురించే – కథ పేరు “బస్సు ప్రయాణం”, రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు.
ఉత్తమ పురుషలో సాగిన ఈ కథలో ‘బాలిరెడ్డి’ పరిచయమైన పేరాలో కథకుడు చెప్పిన మాట – ‘పొలం చూసుకొనేవాడు లేడు’ అని. ఇంట్లో ఉండేదేమో ముగ్గురు కూతుర్లు, ఇద్దరు భార్యలు కలిపి ఐదుగురాడవాళ్ళు + మనుమలు, మనుమరాళ్ళూ. ‘మరి అల్లుళ్ళ సంగతేమిటి?’ అని అనుకునేలోపే ‘అల్లుళ్ళు ఇల్లరికం వచ్చారు. పొలం పనులు చూసిపెడుతున్నారు’ అంటాడు. ‘పొలం చూసుకొనేవాడు లేడు’ అని మొదట చెప్పినమాట అంతలోనే అబద్ధమైపోయింది. తర్వాతి పేరాలో మళ్ళా ‘అల్లుళ్ళు వస్తూ పోతూ ఉంటారు’ అంటాడు. ఎక్కడికి??
పరిచయాలయ్యాక బాలిరెడ్డి అన్న మొదటి మాట “మీ జిల్లోళ్ళతో సావొచ్చి పడిందబ్బీ… మీ జిల్లోళ్ళు గూడక బాంబులు ఏత్తన్నారు సుడీ, అదీ మంట”! అంటే బాలిరెడ్డి ఉద్దేశం ఎవరో దుష్టులు బాంబులేసుకుంటారు, మీకెందుకు ఆ జోలి అని కాదు. “బాంబులెయ్యాలంటే మేమే ఎయ్యాల. మీ వోళ్ళెల్తన్నారే పోటీకి. మించుతారా? మొగోళ్ళా?” అని రెట్టిస్తాడు.
సాటి రాయలసీమవాసి ముందు సైతం కరడుగట్టిన మూర్ఖత్వానికి ప్రతినిధిగా కడపజిల్లా వ్యక్తిని చిత్రించడం ఈ కథ ప్రత్యేకత.
“మా జిల్లాలోకి మీ జిల్లా వోడికేం పని, పెద్ద మంచి?” ఇది రెండో అభ్యంతరం. ఒక సమూహంలో సాధారణంగా వ్యక్తమయ్యే ప్రవర్తనకు ప్రతినిధులుగా లేదా వాహికలుగా రచనల్లో ఆ సమూహాలకు చెందిన పాత్రల చిత్రణ ఉంటుంది. ఈ కథలో బాలిరెడ్డి పాత్ర కడప జిల్లావాసుల ప్రవర్తనకు ప్రతినిధిగా చిత్రించబడింది. అది నిజానికి ప్రాతినిధ్య ప్రవర్తన కాదు, విపరీత ప్రవర్తన. ఇలాంటి విపరీత మనస్కులు అన్ని ప్రాంతాల్లోనూ వర్గాల్లోనూ ఉంటారు. దాన్ని స్థల,కాల,వర్గాలకు అతీతంగా చిత్రిస్తే గొడవుండదు. అది సాధ్యం కానప్పుడు ఈ కథలో చేసినట్లు అదవచిక్కినవాళ్ళ పేరుతో చిత్తం వచ్చినట్లు రాస్తారు. ఉదాహరణకు పైన బాలిరెడ్డి అన్న మాటల్లో మీ జిల్లా, మా జిల్లా అనడానికి బదులు మీ కులం, మా కులం అని ఉంటే ఎలా ఉండేదో ఒకసారి ఊహించండి.
ఇక కథ సగంలోనుంచి రెండు సీట్ల మధ్యనుండే హాండ్ రెస్ట్ గురించి గొడవ. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అసలు హాండ్ రెస్టే ఉండదు. లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో రెండు సీట్లకు కలిపి ఒకటే ఉంటాది. దానికోసం ఇద్దరి మధ్య అధిపత్య పోరాటం. ఆ ఇద్దరిలో ఒకడు కడపోడైతే దాన్ని మొరటుగా, దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాడన్నమాట. మరి ఇద్దరూ కడపోళ్ళే ఐతే? ముఖ్యంగా కడప జిల్లాలో/మీదుగా తిరిగే బస్సుల్లో దాదాపు అందరూ కడపోళ్ళేనే? పంతానికైనా ప్రతి బస్సులోనూ ప్రతి సీట్లోనూ ఆ హాండ్ రెస్ట్ కోసం రక్తపాతాలే అవుతూ ఉండాలి కడపలో – కథకుడి అనుభవసారాన్ని బట్టి!
కథ చివరి పేజీలో భరించరాని ‘చుట్ట కంపు’! – బస్సులో పక్కనున్నవాళ్ళ ఇబ్బంది గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ‘అద్దాలన్నీ మూసి చుట్టకాల్చేవాళ్ళు కడపోళ్ళు – దానివల్ల బాధపడేవాళ్ళు ఇతర జిల్లాలవాళ్ళు!’ అన్నట్లుంది చిత్రణ. ‘ఏ పల్లెవెలుగు బస్సో ఐతే ఇలాంటి అనాగరిక ప్రవర్తన అర్థం చేసుకోవచ్చుగానీ డీలక్స్ బస్సులో చుట్ట వెలిగిస్తే అది ఈయనొక్కడి బాధే కాదుగదా? ఒక్కరూ పట్టించుకోలేదంటే అది కడప బస్సు కాబట్టి అందరూ అనాగరికులే, చుట్టపొగను ఆస్వాదించేవాళ్ళే, అభ్యంతరం తెలపాలనే స్పృహలేనివాళ్ళే’ అన్నది కథకుడి అభిప్రాయం అనుకోవాలా?
పైగా బాలిరెడ్డికి మైదుకూరికి జేరినాక సలిబెడతా ఉందంట! కడపగడ్డ మీద తెల్లవారుజామైనా సరే ఒకడికి సలిబెట్టిందీ అంటే వాడికి హైదరాబాదులో సందెకాడనే ఆ మాత్రం సలిబెట్టి ఉండాల – అంటే వాళ్ళు బయలుదేరినప్పట్నుంచి దారిపొడవునా చలిగానే ఉండి ఉండాలి. కానీ బాలిరెడ్డికి మాత్రం కడప గడ్డమీదికొచ్చినాకే చలి గుర్తుకొచ్చింది! ఆ ప్రయాణమేదో కడప నుంచి హైదరాబాదుకని రాసి ఉన్నట్లైతే కనీసం ఈ ఒక్క పాయింటైనా సరిగా ఉండేది.
“మీ జిల్లావోడు మీ జిల్లా రాజకీయాల్లో పీకల దాంకా మునిగితే తప్పులే. మా జిల్లాలోకి ఎల్లుకోరాదు. ఏం మాట్టాడవేం?”
“నిజమే” చెప్పక తప్పలేదు.
“వొత్తే”
“తగాదే!”
“బాంబులే!” అన్నాడు.
నేను మాట్లాడలేదు.
“నీ ఇంటోకి నేనొత్తే నువ్వూరుకుంటా? ఊరుకోవు. ఏవఁటా! ఆఁ! మాట్టాడ్డేం?”
“ఊరుకోను”
“ఎవుడి జిల్లాలో ఆడు ఆడేడుపాడేడవాలి”
“నిజమే”
“నువ్వొకడుగేత్తే నేను రెండేచ్చా”
“నిజమే”. నిజమే అనకపోతే బాలిరెడ్డి ఊరుకొనేటట్లు లేడు.
బస్సు జడ్చర్లలో ఆగింది.
“తియ్, నన్ దిగనీయ్” అన్నాడు బాలిరెడ్డి.
“తట్కో, నేనూ దిగాల్ల”
“లెయ్ మడి!” తొందరపెట్టాడు. దిగాను.
ఇది రెండో పేజీలో జరిగిన సంభాషణ.
ఆ తర్వాత జరిగినవన్నీ – హాండ్ రెస్ట్ కోసమైనా, విండో సీటు కోసమైనా – మౌనపోరాటాలే. ఈయన మనసులో ఏమనుకుంటున్నాడో అది బాలిరెడ్డికెలా తెలుస్తుంది? రాత్రంతా తన మాటలకు బలకొట్టినవాడు పొద్దునకల్లా మాటా పలుకూ మానేస్తే ‘ఉన్మాదమా?’ అని బాలిరెడ్డి అనుకోవడంలో, కేకలెయ్యడంలో తప్పేముంది? చేసింది చాలనట్లు ‘బాలిరెడ్డి తిట్టీ తిట్టీ తిట్టడానికి మనిషి లేక ఏడుస్తాడేమోనని భయంగా ఉంది’ అని వెటకారపు ముక్తాయింపొకటి. బాలిరెడ్డి ఫీలింగ్స్ గురించి నిజంగా అంత చింతే ఉంటే నోరువిప్పి పలకడానికేం రోగం?
రచన గురించి మాట్లాడేటప్పుడు మామూలుగా ఐతే రచయిత కుల/మత ప్రస్తావన రా(కూడ)దు. కానీ స్వయంగా తరతరాలుగా వివక్షకు గురైన సామాజిక వర్గానికి చెందిన రచయిత అలాంటి వివక్షాపూరిత ధోరణిని అనాలోచితంగా తన రచనలో ఒక ప్రాంతంమీద ప్రదర్శించడమే ఇక్కడ విషాదం.
ఇక రచయిత ఆ బాలిరెడ్డి చేత పలికించిన మాటలలో ఒక్క కడప మాండలికమే కాదు – రాష్ట్రంలోని నానా ప్రాంతాల మాండలికాలూ కలగలిపి వాడేశారు. వాడుక భాష గురించి గానీ, మాండలికాల ప్రాధాన్యత గురించి గానీ అవగాహన లేని రచయితైతే తెలియదు కాబోలు అనుకోవచ్చు. కానీ రచయిత స్వయంగా ఒక తెలుగు ప్రొఫెసర్!, సాహితీ వేత్త కూడానూ. తర్వాతి రోజుల్లో ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) కొలువు చేశారు కూడా!! బహుశా ‘వేరే ఏ జిల్లావాడి గురించో రాసినాక, ఎందుకొచ్చిన గొడవ’ అని సేఫ్ చాయిస్ కింద (దెబ్బల అబ్బాయి!) కడప అని మార్చినట్లు అనిపిస్తే ‘ఆ తప్పు కథను చదివిన మన లాంటి పాఠకులదే’ అవుతుంది. తరచి చూస్తే ఈ కథ ‘ఈనాడు’లో ప్రచురితం కావడం, రచయిత బాబుగారి హయాంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పని చేయటం కూడా గమనార్హం.
ఈ కథే ఇంత సుందరంగా ఉంటే ఈ కథ గురించి రాసిన పరిచయవాక్యాల్లో బుద్ధీ జ్ఞానం, సంస్కారం గురించి సంకలనాన్ని వెలువరించిన సంపాదకుల ఉవాచ పుండు మీద కారం చల్లినట్లుంది! ఆ అన్నవాళ్ళకు అవే ఉంటే సంకలనానికి ఈ కథను ఎంపిక చేసేవారా?
ఈ కథ రాసిన రచయితకు కడపోళ్ళు ఏం చేశారు?
గుంటూరులో పుట్టి అనంతపురంలో స్థిరపడిన కొకలూరి ఇనాక్ గారికి ‘ఆంధ్రా ఆణిముత్యం’ అని బిరుదిచ్చి మరీ మహా ఆత్మీయ సన్మాన మహోత్సవం చేశారు (2016 డిసెంబర్ 19న ఈనాడు కడపలో వచ్చిన వార్త బాక్సులో) – అదీ కడపోళ్ళ సంస్కారం. ఒకరి దగ్గర్నుంచి సంస్కారం నేర్చుకోవలసిన హీనస్థితిలో ఉన్నవాళ్ళు వేరే ఉన్నారు. ఆ బుద్ధీ జ్ఞానాలేవో వాళ్ళకు అలవడితే సంతోషం.
ఉదాహరణకు ఊర్లమీద తొడగొట్టిన, మీసం తిప్పిన చరిత్ర ఏ ఒక్క కడప నాయకుడికీ లేదు. ఐతే ప్రత్యేకించి సినిమా రంగం నుంచి రాజకీయరంగంలోకి వచ్చిన ప్రబుద్ధులు కొందరు కడపకొచ్చి వీధులెక్కి కడపోళ్ళ మీద తొడలుగొట్టీ, మీసాలు మెలేసీ ఘనకార్యం సాధించినట్లు మురిసిపోయారు (వాళ్ళ తొడగొట్టుడు కార్యక్రమాన్ని వీర పరాక్రమం క్రింద ప్రాజెక్ట్ చేసింది ఒక వర్గం మీడియా) – అదీ వాళ్ళ సంస్కారం.
వాళ్ళలో కడప జిల్లా ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం పొందిన స్టారుడొకరు, ఇదే కడప జిల్లా ప్రొద్దుటూరులో వెయ్యిరోజులాడిన సినిమాలో హీరో ఇంకొకరు. వాళ్ళకు ఏ ప్రతిఘటనా, కనీసం నిరసన కూడా ఎదురుకాలేదంటే – అది కేవలం కడపోళ్ళ సంస్కారం వల్లే.
ఒక తెలుగువాడు అత్యంత సులభంగా, సహజంగా, బాధ్యతారహితంగా చేసేపని కడప మీద నిందలెయ్యడం. కడప తల్లి ఏ చవితిరోజు చంద్రుణ్ణి చూసిందో! ఇప్పుడు కడప జిల్లా తన ఆత్మగౌరవం మాటే మరిచిపోయి అన్నిరకాల అవమానాలనూ వివక్షనూ సహించి ఊరుకునే అంటరానిదైపోయింది.
నిందలేసిన అందరూ కలిసి మాలాంటి కడపోళ్ళను సాటి తెలుగువాళ్ళెవరైనా “మీదే ఊరు?” అనడిగితే సమాధానం చెప్పడానికి నోరు కూడా పెగలని దుస్థితికి తీసుకొచ్చారు. This is because of a multi pronged attack which could successfully create a strongly negative image of Kadapa. ఒక్కొక్క ప్రాంగునూ పీకి పాకం పట్టాలి. కడప మీద జరిగిన, జరుగుతున్న అత్యాచారాలకు లెక్కగట్టి ఒక్కొక్కటీ తిరిగి చెల్లించాలి.
జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : సామాజిక దృక్పథంతో ఎన్నో కథలు, కథానికలు, వ్యాసాలు రాశా. ఇందులో నా కన్నీళ్లెప్పుడూ నా కోసం రాలేదు. నా చుట్టుపక్కల ఉండే జనాలు, సామాజిక బాధ్యతలు విస్మరించినప్పుడు, ప్రజల కష్టాలను చూసినప్పుడు మాత్రమే కన్నీళ్లు వచ్చాయి.. ఆ కన్నీళ్లే నా రచనలని ప్రముఖ రచయిత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని సభాభవనంలో ఆదివారం పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌కు మహా ఆత్మీయ సన్మాన మహోత్సవం జరిగింది. ఆంధ్రా ఆణిముత్యం బిరుదును సుదీక్ష సంస్థ వ్యవస్థాపకుడు, బీకోడూరు ఎంపీడీవో మొగలిచెండు సురేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కేవీ సత్యనారాయణ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ మానవజీవితం సంక్లిష్టమైన అన్ని పార్శా్వలు కల్గి ఉంటుంది.. పీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమలోనే ఎక్కువ కాలం గడిపి వారి జీవితాలతోనే ఎన్నో రచనలు చేశా. అమ్మలోని ఆవేశం, నాన్నలోని ఓర్పు కలిసినన నేను మీకు రచయితగా కనపడుతున్నా. కథ, కథనం, నవల, నాటకం, పరిశోధన, నాటకాలు కలిపితేనే తెలుగుభాష. అందులో సృజన, విమర్శ రెండూ నా వద్దనే ఉంచుకున్నా. ఎన్టీఆర్‌కు నేనంటే ఎంతో ఇష్టం. ఆయన నన్ను వీసీగా చేయాలనే తపన ఉన్నా కొన్ని కారణాలతో అది ఫలించలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు ఎస్వీయూ వీసీగా నియమించారు. గుంటూరు జిల్లాలో జన్మించినా అనంతపురం అంటే ఎంతో ఇష్టం. రాయలసీమలోని స్థితిగతులే నాకు సాహిత్యం అలవాటు చేశాయి. తొమ్మిదిసార్లు పీహెచ్‌డీ కోసం ప్రయత్నిస్తే గైడ్‌గా వచ్చేందుకు అందరూ నిరాకరించారు. దళితుడను కావడమే కారణం. తర్వాత పట్టుదలతో అన్నీ సాధించా. ఈ రోజు మీ ముందున్నా అంటూ ఇనాక్ మనసు విప్పి మాట్లాడారు. మనసునిండా ప్రేమున్న వ్యక్తి కలెక్టర్ సత్యనారాయణ అని అన్నారు. తాను రచించిన 400 పుస్తకాల్లో సగం మొగలిచెండు సురేష్ వద్ద ఉన్నాయి. ఇక్కడ సత్కారం పొందడం అదృష్టమేనన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ రచయిత ఇనాక్ అని.. ఆయన మన కలెక్టరేట్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. బద్వేలు ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ కేవలం ఇనాక్ చొరవతోనే పీహెచ్‌డీ పూర్తి చేశానన్నారు. రచయిత రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, మూలే మల్లికార్జునరెడ్డిలు ఇనాక్ గ్రంథాలు, రచనలు, నాటకాల గురించి వివరించారు. డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి, సంజీవమ్మ, పిచ్చయ్య చౌదరి తదితర రచయితలు ఇనాక్ సాన్నిహిత్యాన్ని ప్రస్తావించారు. కలెక్టర్ సత్యనారాయణ, మొగలిచెండు సురేష్, ఎమ్మెల్యే జయరాములు, పిచ్చయ్యచౌదరి, మల్లెమాల, ఖాదర్‌బాషా తదితరులు ఇనాక్‌ను పూలమాలలు, జ్ఞాపికలు, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో సాహితీప్రియులు పోతురాజు వెంకటసుబ్బన్న, ఇలియాస్‌రెడ్డి, డాక్టర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
– త్రివిక్రమ్
(trivikram@kadapa.info)
తర్వాతి కాలంలో ఇనాక్ గారు తెదేపా ప్రభుత్వంలోనే తెలుగు అకాడమీ అధ్యక్షుడు కూడా అయినారు.