శ్వేతపత్రాల తయారీలో తలమునకలుగా ఉన్న తెదేపా ప్రభుత్వం రాయలసీమ కోసం ఏమి చేయాలనుకుంటున్నదో ఒక శ్వేతపత్రం ప్రకటించాలని శాసనమండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేశారు. సీమలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం కనీసం వచ్చే అయిదేళ్లలో రూ.30వేల కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్ గేయానంద్ ఉద్ఘాటించారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ కంటే మెరుగైన ప్యాకేజీ ఈ ప్రాంతానికి అవసరమన్నారు.
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలో సీమలోని పెండింగ్ ప్రాజెక్టులకు రూ.15వేల నుంచి రూ.20వేలకోట్లు అవసరమన్నారు.
రాయలసీమలోని వెనుకబాటుతనం, ప్రస్తుతమున్న స్థితిగతులు, ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏమి చేయాలనుకుంటున్నదో ఒక శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్‌కు ఇచ్చిన ఒక వినతిపత్రంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విషయమై ఒత్తిడి తేవాలని కోరారు. అన్ని విషయాలపై సమగ్రంగా ఒక శ్వేతపత్రం ప్రకటించాలన్నారు.
మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నింటినీ సర్కారు జిల్లాలకు కేటాయించిన తరువాత మన నాయకులు స్పందిస్తున్నారు. గేయానంద్ గారి బాటలో మరింత మంది నాయకులు సీమ గురించి పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి మన ఉనికిని గుర్తు చేయాలని ఆశిద్దాం.