పెదయౌబళపు కొండ పెరిగీనిదే
వదలకకొలిచితే వరములిచ్చీని
పదివేలశిరసుల పలునరసింహము
గుదిగొన్న చేతుల గురుతైనది
ఎదుటపాదాలు కన్నులెన్నైన కలిగినది
యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది
ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది
మొనసి రాకాసి మొకములగొట్టేది
కనకపుదైత్యుని కడుపుచించినది
తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది
శ్రీవనిత తొడమీద జేకొని నిలిపినది
దేవతలు గొలువ గద్దెపై నున్నది
శ్రీవేంకటాద్రియందుఁజెలగి భోగించేది
భావించి చూచితేను పరబ్రహ్మమైనది