కడప: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కడప లోక్సభ సభ్యత్వానికి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వారు ఇద్దరూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసినట్లు ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన రెడ్డి రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్కు ఫాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు. తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ విధానాలకు నిరసనగా వారు రాజీనామా చేసినట్లు తెలిపారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్, విజయమ్మ ఆరు పేజీల లేఖ రాసినట్లు తెలిపారు.
దీంతో పులివెందుల శాసనసభ, కడప లోక్ సభ స్థానాలు ఖాళీ అయ్యాయి.