గురువారం , 21 నవంబర్ 2024
పుట్టపర్తి తొలిపలుకు
కీ.శే.పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి నారాయణాచార్యుల ఇంటర్వ్యూ

ఆనందనామ సంవత్సరం చైత్ర శుధ్ధ విదియ అంటే మార్చి 28,1914 న పుట్టిన కీ.శే పుట్టపర్తి నారాయణాచార్యుల వారికిది శతజయంతి సంవత్సరం… ఆ మహానుభావుడి  సాహిత్య కృషీ.., శివతాండవ సృష్టీ.. మన సిరిపురి పొద్దుటూరులోనే జరిగింది. భారత ప్రభుత్వం నుండి అత్యున్నత పద్మ పురస్కారాలనూ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లను పుట్టపర్తి వారు అందుకున్నారు.
పుట్టపర్తితో జానమద్ది హనుమచ్ఛాస్త్రి జరిపిన సంభాషణ పూర్తి పాఠమిది… ఈ ఇంటర్వ్యూ చేసిన సంవత్సరం అందుబాటులో లేదు. ఎవరి దగ్గరైనా ఆ సమాచారం ఉంటే తెలియచేయండి.

జానమద్ది : సామాన్యులకు సైతం అర్ధమయ్యేదే ఉత్తమ సాహిత్యం అంటారు కదా! మీరేమంటారు?

పుట్టపర్తి : సామాన్య ప్రజలు అన్న మాటకు అర్ధం పరిమితమైనది. సామాన్యులకు సైతం అర్ధమయ్యేదే ఉత్తమ సాహిత్యం అవడం పొరపాటు. అందరికీ అర్థమయ్యేలా ఎవరూ చెప్పలేరు. సంస్కారాలు భిన్నంగా ఉంటాయి. అందరూ అర్థం చేసుకోలేరు.

జానమద్ది : ఈనాడు తరచూ వినవచ్చే సామాజిక స్పృహ గురించి మీరేమంటారు? ప్రాచీనులకు సామాజిక స్పృహ వుండినదా? ఎలా ఉండేది?

పుట్టపర్తి : ఇది ఈనాడు కనుగొన్న కొత్తమాట. దీని ప్రచారకులు ప్రధానంగా కమ్యూనిస్టులు. సమాజంలో ఉండే బాధలను, ఇతర ఆర్థిక పరిస్థితులను ఎక్కువగా చెప్పి విప్లవానికి తయారుచేయడం వారి ధ్యేయం. దీని వెనుక ప్రబలమైన రాజకీయ కారణాలున్నాయి. సమాజంలో అన్యాయం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. బీదలు బాగుపడాలన్న వాదనలో అన్యాయం ఏమాత్రం లేదు. వాల్మీకి మొదలు విజయనగర కాలం నాటి కవులందరికీ సామాజిక స్పృహ ఉంది. అసలు కార్ల్ మార్క్స్ పుట్టడానికి ముందు దీనికో స్వరూపం లేదు. మార్క్స్ ఒక రుషి. అతని పరిశ్రమ అజేయమైనది. రామానుజులు, శంకరులు, మార్క్స్‌వలె ఆలోచించలేకపోయినందుకు వారికి సామాజిక స్పృహ లేదనడం అన్యాయం. వారు పనిచేసిన శాఖలు వేరు. వారి విశ్వాసాలు వేరు. మార్క్స్‌కు ఆధ్యాత్మిక తత్వంతో ఎటువంటి సంబంధం లేదు కదా. ఆయన ఆలోచన భౌతికంగా వుండినది. మంచిదే.

జానమద్ది : మీరు జనప్రియ రామాయణాన్ని గేయరూపంలో వ్రాయడంలో మీ ఉద్దేశమేమి?

పుట్టపర్తి : ఒకసారి నేను కాశీ నుంచి హరిద్వార్ వెళుతున్నాను. అప్పుడు నాకు టికెట్ లేదు. రెండో వస్త్రం లేదు. రైలు పెట్టె కడ్డీ పట్టుకుని బయట ఉన్నాను. రైలు వేగంగా పోతోంది. లోపలి నుంచి ఎవరో ఒక శ్లోకం చెప్పారు. బయట నుంచి నేనొక చరణం చెప్పారు. లోపలివారు సంతోషంగా నన్నురమ్మని చోటు ఇచ్చారు. లక్నో వరకు టికెట్ తీసి ఇచ్చారు. సారస్వత బ్రాహ్మణులు తరచూ తులసీ రామాయణాన్ని కోట్ చేస్తారు. ఇటువంటిది తెలుగులో వుంటే బాగుంటుంది అనే ఆలోచన కలిగింది. మాత్రా ఛందస్సులో వ్రాశాను. అందరికీ అది అర్ధం కాదని నా నమ్మకం. నేను ఏమి వ్రాసినా సంగీత నాట్య సంప్రదాయాలుంటాయి.

జానమద్ది : మీ రచనలను సమకాలీన సమాజం ఎంతవరకు ఆదరించింది?

పుట్టపర్తి : నేనెలా చెప్పడం? చదివే వాళ్లున్నారు, విమర్శించే వాళ్ళు వున్నారు. ఒక రీతిగా చూస్తే మనదేశంలో కవి సమకాలీనుల గౌరవం పొందడం అరుదేమో అనిపిస్తుంది. కొందరు శిష్య, ప్రశిష్యులతో ప్రచారం చేయించుకుంటారు. అది కూడా రక్తికి రావడం లేదు. వారి శిష్యులతో ఆగిపోతున్నది. అట్టి ప్రచారంపై నాకు నమ్మకం లేదు.

చదవండి :  'శశిశ్రీ'కి పాలగిరి విశ్వప్రసాద్ నివాళి వ్యాసం

జానమద్ది : అభ్యుదయ సాహిత్యం అంటే ఏమిటి? మీ దృష్టిలో ప్రాచీనులు కూడా అభ్యుదయ వాదులే. కద

పుట్టపర్తి : నిజానికి ప్రాచీనులు కూడా అభ్యుదాయవాదులే. సమాజం ఎప్పుడు స్టాటిక్‌గా ఉండదు. అప్పుడప్పుడు మేధావులు పుట్టి దేశ కాలానుగుణంగా మార్పులు తెస్తూంటారు. మొదట ఎదురీదిన తరువాత జనం అనుసరిస్తారు. మార్క్సిస్టులు అభ్యుదయవాదులంటారు. మంచిదే వారిని కాదనటం లేదు. ఇక మీదట రావలసినది అదేనేమో. కానీ ప్రాచీనులలో అభ్యుదాయవాదులు లేరనడం పొరపాటు.

జానమద్ది : సాహిత్యంలో మార్క్సిస్టు దృక్పథం అంటే ఏమి?

పుట్టపర్తి : నాకు రాజకీయాలలో పెద్ద ప్రవేశం, ఆసక్తి లేదు. అందువల్ల మార్క్సిస్టు దృక్పథాన్ని గురించి ఇంతే అని చెప్పే యోగ్యత లేదు. వారు కూడు గుడ్డల వరకు సంబంధించే మాట్లాడుతారు. అది నిజమే కాని మనిషి కూడు గుడ్డలకు మాత్రమే పరిమితుడు కాదు.

జానమద్ది : శ్రీశ్రీని యుగకర్త అనటం ఎంతవరకు సముచితం?

పుట్టపర్తి : శ్రీశ్రీని యుగకర్త అనటం అతని అభిమానుల విషయం. శ్రీశ్రీ అంటే నాకు గౌరవం ఉంది. నేనన్నా అతనికిష్టం. కమ్యూనిజం అంటే అందరూ భయపడుతున్న కాలంలో ధైర్యంగా ఆ సిద్దాంతం గురించి ప్రచారం చేశాడు. కష్టనష్టాలు అనుభవించాడు. అంతవరకు అతనిపై నాకు గౌరవం ఉంది. ప్రాచీన ఛందస్సు నుండి విడిపోయి చాలామందికి అర్థమయ్యేటట్లు వ్రాశాడు. అతని జీవిత చరిత్ర రెండుసార్లు చదివాను. అతని వలే జీవించడం కష్టం. అతని జీవితంపై భారతదేశంలో సానుభూతి వుండటం కష్టం.

జానమద్ది : రచయితలకు కమిట్‌మెంట్ వుండాలా?

పుట్టపర్తి : పూర్వపు కవుల్లో చాలామందికి కమిట్‌మెంట్ వుండేది. ఈనాడు రాసేవాళ్లలో అదే శూన్యం. నోటితో చెబుతారే కాని జీవితంలో వుండదు. కమిట్‌మెంట్ అంటే నా దృష్టిలో చెప్పినట్లు జీవించటం. ఆత్మవంచనే నేడు ప్రధానంగా కనిపిస్తుంది.

జానమద్ది : ఈనాడు వస్తున్న సాహిత్యం గురించి మీ అభిప్రాయం?

పుట్టపర్తి : ఈనాడు వస్తున్న సాహిత్యంలో రాజకీయాలు వస్తున్నాయి. కొద్దికాలం ఇట్లా జరిగితే సాహిత్యం అనేదే లేకుండా పోతుందేమో అని నా భయం. ఈ విషయమే ఇటీవల కలకత్తా సభలో చెప్పాను. సాహిత్య రాజకీయవాదులు పత్రికల్లో మాత్రా ఛందస్సులో పరస్పరం తిట్టుకుంటున్నారు. వాళ్లు తమకు తామే పెద్దపీట వేసుకుంటున్నారు. ఈనాడు సాహిత్యంలో ఒకరి రచనలు మరొకరు చదవరు. పరస్పర గౌరవాభిమానాలు లేవు. చెప్పటంలో వైవిధ్యం అంతగా లేదు. ఏదో కొత్తగా చెప్పాలన్న వుబలాటం. చేతకాక వెల్లకిల పడటం జరుగుతూ వుంది. భావాన్ని ఎలా చెప్పాలన్నది నేటి కవుల దాహం. ఏమేమో పల్టీలు కొడుతున్నారు. నా అభిప్రాయం కోసం రచనలు వస్తుంటాయి. ఏం వ్రాసేది? మొదట పేజీలోనే అయ్యగారి కథ తెలిసిపోతుంది. నేను సాధారణంగా అభిప్రాయాలు రాయనన్న ప్రచారం ఉంది. ఎందుకు రాయను. యోగ్యం వుంటే రాస్తాను. దీంతో ఎన్నో కష్టనష్టాలను అనుభవించాను. నేను కేర్ చెయ్యను.

జానమద్ది : వచన కవిత మినీకవిత వీటి భవితవ్యం?

పుట్టపర్తి : ఇవే నిలుస్తాయి. తక్కినవి పోతాయి అని కొందరు మూర్ఖంగా భావిస్తారు. నేను నిలువవంటాను. వచ్చే కాలంపై జోస్యం ఎవరూ చెప్పలేరు. ఈనాడు రష్యా నుంచి వచ్చే ఇంగ్లీష్ అనువాదాలు కొన్ని చదువుతుంటాను. నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఒకటి రెండు సార్లు చదివి సంతోషించే రచన ఏదీ చిక్కలేదు. అది నా మనస్తత్వలోపం అంటే నా ఆక్షేపణ లేదు. నా దృష్టిలో వచన కవితలు, మినీ కవితలు ఎండి తక్కువైన రొట్టెలు, పరస్పర ప్రచారాలు మొదలగు దురభ్యాసాలకు వారు వూగులాడుతారు. వాటికి సంపూర్ణ ఆయుస్సుందనుకోను.

చదవండి :  కడప జిల్లాలో 20.75 లక్షల ఓటర్లు

జానమద్ది : మీ గద్య రచన, పద్య రచన కంటె గొప్పదంటారు?

పుట్టపర్తి : ఇది పాఠకుల మనస్సులకు సంబంధించినది. నా గద్య రచనకు ముఖ్యంగా రాళ్లపల్లి, కట్టమంచి వారు గురువులు. వాక్యాలు చిన్నవిగా వుండటం, సాధ్యమైనంత వరకు అంత్యప్రాసలు సమకూర్చటం, నడుమ వెలికిలేని హాస్యం, జాతీయాలు చొప్పించటం, ఒక విషయం తీసుకున్నప్పుడు తలస్పర్శిగా శోధించి రాయటం నా గద్యంలో వున్న లక్షణాలనుకుంటాను. నా గద్యరచనకు రాళ్లపల్లివారు, గురువులైనా దానికి మరికొన్ని సొమ్ములు కష్టపడి పెట్టుకున్నాను.

జానమద్ది : ఈనాటి సాహిత్య విమర్శనా ధోరణుల పట్ల మీ అభిప్రాయం?

పుట్టపర్తి : ఈనాటి సాహిత్య విమర్శలలో లోతు తక్కువ. టెక్ట్స్‌ను వదలి లోకమంతా పారాడివస్తారు. ఈ మధ్య జానపద సాహిత్య విమర్శ చదివాను. ఆ రచయిత్రి సైకాలజి స్టూడెంట్, ఆ వాసనంతా జానపదుల పాటల్లో కుమ్మరించింది. నాకు నవ్వు వచ్చింది. అంత సైకాలజి రాసిన వారికీ లేదు. చదివిన వారికీ తట్టలేదు. ఒక పదాన్ని తీసుకుని ఆమె ఆకాశ ఖడ్గచాలనం చేసింది. ఇట్లా వుంటాయి వీరి విమర్శలు.

జానమద్ది : మీ శివతాండవ రచనకు ప్రేరణ ఎలా?

పుట్టపర్తి : అదో పెద్ద కథ. దానికి నాయకుడు ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరుడు. ప్రజల్లో శివతాండవానికి గొప్ప ఆదరణ వచ్చింది. ఎందుకని నేనెట్లా చెప్పేది. ఒక్కొక్క దానికా అదృష్టం పట్తుంది. కాళిదాసు ఎన్ని రాసినా మేఘసందేశానికే కీర్తి గొప్పగా వచ్చింది. భవభూతి మూడు నాటకాలు రాసినా ఉత్తరరామచరిత్రకే ఎక్కువ గౌరవం. విశ్వనాథ సత్యనారాయణ గారి రచనల్లో కిన్నెరసాని పాటలకున్న జనరంజకత్వం మరే దానికి లేదు. వారి నవలలు బాగా ప్రచారంలోకి వచ్చాయి.

జానమద్ది : మీరు బహుభాషాకోవిదులు. మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించిన భారతీయ కవులెవరు?

పుట్టపర్తి : అనేక భాషలు తెలుసుకోవడంతో దృష్టి విశాలమవుతుంది. సహనం ఏర్పడుతుంది. సంస్కృతంలో భవభూతి, మురారి, అశ్వఘోషుడు నాకు ఇష్టం. సంస్కృత కవుల కంటే ప్రాకృత కవులపై నాకు ఇష్టమెక్కువ. ప్రవరసేనుడు, వాక్పతి, పుష్పదంతుడు మొదలగువారు నాకిష్టం. ఇటీవల ఠాగూరు, అరవిందులు నన్ను బాగా ఆకర్షించారు. ఇంగ్లీష్‌లో మిల్టన్ నాకు ఆరాధ్య దైవం. షెల్లీ అంటే ఇష్టం. తమిళంలో శిలప్పధికారం, సూరదాసు, తులసీదాసు రచనలంటే నాకు ఎక్కువ ఇష్టం.

జానమద్ది : మీరు జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలోని వారు. ఆ ఉద్యమాలకు మీరెలా స్పందించారు?

పుట్టపర్తి : నా బాల్యంలో గాంధీజీ పెనుకొండ వచ్చారు. షౌకత్ ఆలీ, మహ్మద్ ఆలీలు వచ్చారు. కొందరు పిల్లలతో నేను ఆ సభకు వెళ్లాను. పోలీసులు కొందరిపై లాఠీచార్జీ చేశారు. భయపడ్డాను. నా బంధువులొకరు సత్యాగ్రహం చేసి, ఆసుపత్రిలో చేరారు. తర్వాత కొంత పొలం ఇచ్చారు. గాంధీజీ ప్రసంగాలు హిందూ పత్రికలో చదివి ఆవేశపడేవాళ్లం. ప్రొద్దుటూరు చేరిన తరువాత నేను కాంగ్రెస్ చరిత్ర జానపద శైలిలో 20 నోట్ బుక్కుల నిండా రాశాను. కొన్ని చోట్ల రీడింగ్ ఇచ్చాను. చాలా బాగుందన్నారు. ముఖ్యంగా డయ్యర్ దురాగతాలు. ఈ బుక్కులు అనంతపురం కాంగ్రెస్ ఆఫీసులో వుండేవి. వ్యక్తిగత ద్వేషాలు ఎక్కువగా వుండినందున అది బయటకు రాలేదు. నేను పట్టాభి గారిని అనుసరించి రాశాను. కల్లూరు సుబ్బారావుగారు దాన్ని ప్రింట్ చేయిస్తానన్నారు. 1942 తరువాత కాంగ్రెస్ కలుషితమైంది. నా మనసు చెడి ఆ రాతప్రతులను చించి వేశాను. నా చేతులారా చించివేసినది కాంగ్రెస్ చరిత్ర. అస్తసామ్రాజ్యం – 2వేల పద్యాలు. హిందూ ముస్లిమ్ గలభా ఇష్టం లేకనే చించివేశాను. జాతీయోద్యమ ప్రేరణతో చాలా రచనలు వ్రాశాను.

చదవండి :  గాంధీజీ కడప జిల్లా పర్యటన (1929)

జానమద్ది : సంగీత నృత్యాల పట్ల సామాన్యులకు ఆసక్తి కల్గించేదెట్లా?

పుట్టపర్తి : సంగీతం, నృత్యం, కాలపరంగా మారుతూ వచ్చింది. అందరిలో ఒక చాపల్యం వుంది. చూచేవాళ్ల స్థాయికి దిగవలె. వాళ్ల చప్పట్లతో వాళ్లకు తృప్తి. నా చిన్నప్పుడు సంగీతమంటే 3,4 ప్రథమ కాలకీర్తనలు పాడవలె. పల్లవి లేనిది కచేరి పూర్తికాదు. చింతలపల్లి వెంకటరావు, హరినాగభూషణం, బిడారం కృష్ణప్ప, గోటువాద్యం నారాయణయ్యంగార్, ద్వారం వెంకటస్వామిగారు, చౌడయ్యగార్లు గొప్పగా కచేరీలు చేసేవారు. ఈనాడు ప్రతిదానిలో స్పీడ్ సౌండ్ ఎక్కువైంది. నృత్యం కూడా అంతే. పాటకు పట్టే ముద్ర సంబంధం లేదు. పాడే పాటకు హస్తంతో అర్థం ప్రకటించాలి. అదే ముద్ర. ఈ పద్ధతిపోయింది. తిల్లానాలు ఎక్కువైనాయి. వీటిలో సాహిత్యం తక్కువ. ఈ స్వరానికి ముద్ర పట్టాలన్న నియమం పోయింది. నా చిన్ననాడు ఒక క్షేత్రయ్య పదం పాడేందుకు గంట పట్టేది. ఒకసారి పెనుకొండలో గరుడ నృత్యం చూశాను. 4 గంటలు పట్టింది. ప్రేక్షకుల చప్పట్ల కోసం ప్రాకులాడకూడదు. వారిని మనస్థాయికి ఎదిగేటట్లు చూడాలి. వారి స్థాయికి మనం పోరాదు.

జానమద్ది : ఈనాటి సాహిత్య సంఘాలు గురించి మీ అభిప్రాయం?

పుట్టపర్తి : ఈనాటి జనులకు ఏ కళా కాబట్టదు. చాలామందికి ఆర్థిక కారణాలు, కొందరి దృష్టిలో కళకు జీవితానికి సంబంధం లేదు. నా చిన్నప్పుడు డొక్కశుద్దిలేని వాణ్ణి ఎవరూ గౌరవించేవారు కారు. ఈనాడు డబ్బే అన్ని యోగ్యతలకు కారణమైంది. కాళిదాసు, భవభూతి, నన్నయలు ఏ సంస్థలు పెట్టుకోలేదు. కాఫీ ఇచ్చి రచనలు చదివి వినిపించే దుర్గతి వచ్చింది. శ్రోతలు జారుకుంటారు. నేనందుకే అనేక సభల్లో కవితలు చదవమంటే తప్పుకుంటాను. అన్యదాలోచ వామృతమ్ అన్నప్పుడు కవిత్వాన్ని వీధిలో పంచడమెందుకు? ఇష్టమున్నవాడు చదువుకుని ఆనందిస్తాడు. ఈ ఆర్భాటాలన్నీ ఆర్థిక సమాజం తెచ్చిన బెడదలు. కొన్ని సంఘాలు మంచి పని చేస్తున్నాయి. ఏం చెప్పేదప్పా నామటుకు ఇంకా ఎంతో చదవాలని వుంది. డెబ్బయి నాలుగులో ప్రవేశిస్తున్నాను. రోజూ కొన్ని గంటలు చదువుతాను. ఇదే నేను యువ రచయితలకు చెప్పే హితవాక్యం.

పుట్టపర్తి నారాయణాచార్యుల ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదీ చదవండి!

శివతాండవం

ఊహాతీతం – ఈ ఆనందం

సరస్వతిపుత్ర శ్రీ పుట్టపర్తి వారి శివతాండవం పై వ్యాఖ్య శివరాత్రి వచ్చిందంటే చాలు ఆ చిదానందరూపుడి వైభవాన్ని తలుచుకుంటూ ఉంటాం. …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: