“15-ఆగస్టు”… అంటే “భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు” అని అంటాననుకొన్నారా ???? అక్కడే మీరు “పట్టిసీమలో” కాలేశారు.. !
– కాదు కాదు.. కానేకాదు.. 15-ఆగష్టు-2015 అంటే, “చంద్రబాబు నాయుడు” గారు “పట్టిసీమ నీటిని రాయలసీమకు తరలించి” సీమ కరువును తరిమికొట్టడానికి పెట్టుకొన్న గడువు..
– ఈ సుదినం రానే వచ్చింది. ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో ప్రజలందరూ లేచి, స్నానాదులు పూర్తిచేసి, ఉపవాసంతో, లక్షలాదిగా తరలివచ్చారు..
– ఇకపై మన కరువు తీరబోతుందన్న ఉద్వేగంలో ఉన్న ప్రజలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని, చేతుల్లో హారతి పళ్ళాలు పట్టుకొని, తండోపతండాలుగా తరలివస్తున్నారు.
– లక్షలాదిగా తరలివచ్చిన జనసముద్రాన్ని చూసి, వరుణదేవుడు కరుణించాడు.. అలా ఓసారి చిరు జల్లులను అందరిమీదా కురిపించి, ఆశీర్వదించాడు.
– మరోవైపు కళా బృందాల కోలాహలం అంతా ఇంతా కాదు.
****
“ఉత్సాహాన్ని నింపుతూ జానపదులు” – “యువత కోలాటాలు” – “తన్మయంలో భజన బృందాలు” – “భీతిగొలిపే నృత్యాలతో గొరవయ్యలు” – “రెట్టించిన ఉత్సాహంతో నందికోళ్ళు” – “అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తున్న టిటిడి ఆస్థాన గాయకులు” – “బుర్ర కథలు” – “కుంచెల నృత్యాలు” – “చెక్క భజనలు” – “పండరి భజనలు” – “తప్పెట గంతులు” – “బైలాటలు” – “యక్ష గానాలు” – “ఆసాది కుంటోళ్ళు” – “పిచ్చికుంట్ల కథలు” – “బీరప్ప డోళ్ళు” – “జడ కోలాటాలు” – “గొబ్బి నృత్యాలు” – “తిరగడ జక్కిళ్ళు” – “నామాలసింగళ్ళు” – “జ్యోతి నృత్యాలు” – “కోతుల్ని ఆడించేవాళ్లు” – “పులి వేషాలు” – “గంగిరెద్దులు” – “కళ్డి ఆటలు” – “కర్ర సాములు” – “పగటి వేషాలు” – “ఉరుములాటలు” …… !!!
****
ఓహ్.!! ఇలా ఒకటేమిటి, సీమ జిల్లాల్లోని కళారూపాలన్నీ సందడి చేస్తూ ఆ గోవిందుడి బ్రహ్మోత్సవాలని మరిపిస్తున్నాయి.
ఇంతలోనే, టిటిడి అర్చక బృందం వారు “పూర్ణకుంభం” తో తరలివచ్చారు.. వారి వెనకాల “సీమ జల ప్రధాత” గారి నిలువెత్తు విగ్రహాన్నుంచిన ఓ అతిపెద్ద తేరుని ఊరేగిస్తూ ముందుకు కదులుతున్నారు..
ఆ విగ్రహం మొత్తం “పసుపు రంగు పులిమారు” ఆ తేరు మొత్తం కూడా పసుపు పచ్చని రంగులోనే ఉంది.. ఎందుకంటే, ఆ “జల ప్రధాత – అపర భగీరతుడు” – “పట్టిసీమ నుండి రాయలసీమకు” నీటీని తేవడానికి ఉపకరించిన తన అధికారం రావడం ఆ “పసుపు” చలవే..!!
ఇలా, చిన్నా పెద్దా, ముసలీ మూతకా, బీద, బిక్కీ, అందరి నోటా ఒకటే మాట “సీమ జల ప్రధాతకు మేం ఋణపడి ఉంటాం” అంటూ, నినాదాలు చేస్తూ.. పెద్ద పెద్ద బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు..
పుర ప్రముఖుల ప్రసంగాలు, ప్రవచన కర్తల బోధనలూ, ఆత్మీయుల పలకరింపులూ ఇలా రోజంతా అలుపన్నది లేకుండా సాగిపోయింది.
ఇక ప్రత్యేక ఆకర్షణగా “చంద్ర” మాల ధారణ” చేసిన బృందాలన్నీ ఆపాదమస్తకమూ “పసుపు రంగు” లో మెరిసిపోతున్నారు.. వారికి ప్రత్యేకంగా గుడారాలు కేటాయించారు.
కళా రూపాల సందడి పతాక స్థాయికి చేరింది.. ఉదయం నాలుగ్గంటలనుండీ సాయంత్రం అయిదుగంటల వరకూ ఈ జనాల కోలాహలం సందడి సందడిగా నడిచింది..
జనాలంతా దీక్ష పట్టి ఉపవాసంతో రావడం వలన అందరూ సొమ్మసిల్లి పడిపోయారు.
ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారో ఆ “పట్టిసీమ నీళ్లు” మాత్రం “పత్తా లేకుండా పోయాయి”.
జనాల్లో మెల్లగా ఓ శంక మొదలయ్యింది.. “మళ్ళీ వెఱ్రోళ్లమయ్యామా”??!! అన్న అనుమానం బలపడింది.. ఒక్కసారిగా అందరూ నీరసించారు.
****
ఇక మెల్లగా గందరగోళం చెలరేగుతుందనుకొనేంతలో, ఒక్కసారిగా పిడుగు పడ్డట్లుగా ఆకాశంలో చెవులు చిల్లులు పడేలా ఒక “పసుపు పచ్చని హెలికాప్టర్” దిగడం కనిపించింది..
ఓ.! “పట్టిసీమ నీళ్లను రాయలసీమకు” ఇలా “హెలికాప్ట్ర్లర్లలో తెస్తారేమో” నని, ఆవిధమైన “టెక్నాలజీని” పచ్చ పాలకుడేమైనా కనుగొన్నాడేమోనని జనాలు పులకరించిపోయారు.
ఒక్కసారిగా జనాలంతా ఉత్కంఠగా ఆ “పచ్చ కాప్టర్” కోసం తలకాయలన్నీ పైకెత్తి చూస్తున్నారు.
ఆ “పచ్చ విహంగం” కిందికి దిగనే దిగింది.. దిగగానే, అందులోనుండి “రాయలసీమ జల ప్రధాత” దిగుతాడేమోనను ఆతృతగా ఎదురుచూసిన జనాలు, ఆయన రాకపోయేసరికి నీరసించిపోయారు.
తలుపు తెరవగానే, ఓ అరడజనుమంది “పసుపు పచ్చ యూనిఫారం” లో ఉన్న శాల్తీలు ఓ పెద్ద పెట్టెను క్రిందకు దించారు.
ఆ పెట్టెలో నీళ్ళు తెచ్చే టెక్నాలజీ ఏమాయినా ఉందేమోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జనాలకు, 200×100 అడుగులున్న ఒక భారీ తెరను పైకి లేపడం కనిపించింది.. !!
అలా మరో పదినిముషాల్లో ఒక భారీ తెర జనాలముందు ప్రత్యక్షమయ్యింది.
కిలోమీటర్ల దూరంలో ఉండే జనాలకి కూడా స్పస్టంగా కనిపించే టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఆ తెరపై, “నీళ్ళు త్వరలో రాబోతున్నాయి – మీ కల నెరవేరబోతుంది” అన్న పసుపు పచ్చ అక్షరాలను చూడగానే జనాలు కేరింతలు కొట్టారు.
సొమ్మసిల్లి పడిపోయినవారంతా, లేని శక్తిని కూడదీసుకొని, మళ్ళీ లేశారు.
డీలాపడి రెస్ట్ తీసుకొంటున్న రకరకాల కళా బృందాలన్నీ మళ్ళీ కోలాహలంగా ప్రదర్శనలు ప్రారంభించాయి.
****
అలా మరో పదిహేను నిముషాల్లో అంటే, ఆల్మోస్ట్ చీకట్లు అలుముకొంటున్న సమయంలో “రాయలసీమ జల ప్రధాత” గారి భారీ ప్రతిరూపం ఆ తెరపై ప్రత్యక్షమయ్యింది !!
ఆయన వెనకాల “పట్టిసీమ జలాలను తోడడానికి” సిద్ధంగా ఉన్న భారీ మోటార్లు అలంకరించి ఉన్నాయి.
అంటే, ఈ “తెరలోనుండి పట్టిసీమ నీళ్ళు మన రాయలసీమకు రాబోతున్నాయన్నమాట” అని ఒకటే ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు.
మరుక్షణంలోనే అక్కడున్న భారీ మీడియా కెమెరాల సాక్షిగా ఒక పెద్ద “మీటను” ఆ “జల ప్రధాత” నొక్కాడు.. అంతే, ఎవరు ఏమి మాట్లాడుతున్నారో కూడా వినపడనంత భారీ శబ్దంతో, చెవులు చిల్లులు పడేలా ఆ భారీ మోటార్లన్నీ ఒక్కసారిగా నీటిని తోడడం మొదలుపెట్టాయి.
అలా ఆ మోటార్లు నడుస్తుండగానే, ప్రక్కన ఓ పది భారీ పైపుల్లో నీళ్ళు వచ్చాయి. ఇక్కడ జనాలంతా ఆ తెరలోనుండి నీళ్లొచ్చి మమ్మలి ఎక్కడ ముంచుతాయోనాన్న భయంతో అలాగే ఉగ్గబట్టుకొని “భయంతో కూడిన ఆనందంతో” అలాగే నించొన్నారు.
****
అలా ఓ ఐదు నిముషాల తరువాత, ఆ “జల ప్రదాత” తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు. “చూశారా తమ్ముళ్లూ” నేను చెప్పిన సమయానికి, ఇంకా చెప్పాలంటే ఏడాది గడువు పెట్టుకొన్నా, కేవలం ఆరు నెలల్లోనే మీకు నీటిని ఇచ్చాను”.. మీరు అదృష్టవంతులు.. మరో వందేళ్లవరకూ మీరంతా మా వారసులనే గెలిపించాలి.. మేమే మిమ్మల్ని ఎలాలి.. మా ఏలికలో మీరు తరించాలి.. ! అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు.
ఇక్కడ జనాలకేమో నరాలు తెగే ఉత్కంఠ.. ఇంతకీ ఈ నీళ్ళెక్కడున్నాయో తెలియడం లేదు.. ఆయన నీళ్ళిచ్చాననీ, మరో వందేళ్ళు ఆయననే గెలిపించాలనీ చెబుతున్నాడు.. ఇక్కడేమో ఒక చుక్క నీరు కూడా రాలేదు.. ఒకటే టెన్షన్..
ఇంతలోనే చీకట్లలుముకొన్నాయి.. కరెంటు కూడా లేదు.. అందరూ అడవుల్లోనుండి ఊళ్ళకు ఎలా వెళ్లాలో కూడా తెలియదు.. అక్కడ ఆయన ప్రసంగం ఆగడం లేదు….!!
****
……. ఇంతలో అకస్మాత్తుగా “మైక్రోసాఫ్ట్ ఫోన్” అలారం బిగ్గరగా వినిపించింది…. ఇదేమిటి, ఇంత గోలలో కూడా ఈ ఫోన్ ఆలారమేమిటి అంటూ ఆశ్చర్యపోతుండగా, గట్టిగా వినిపించింది…!! “అక్కడ మోడి గారు ఎర్రకోటమీదికి చేరుకొన్నారు, మీరేమిటి ఇంకా పడుకొన్నారు, లేవండీ.. !!”
ఓహ్.! ఈగొంతెక్కడో విన్నట్లుందే అనుకొంటూ, దిగ్గున కళ్ళు తెరిస్తే, పక్కనే నా “ఫోన్ అలారం” ఆగకుండా మోగుతోనే ఉంది.. !! ఇందాక వినిపించిన గొంతు మా భార్యది..!!!!
అంటే.. !! నేనింతవరకూ చెప్పింది “నా కల” అన్నమాట..!!
నిజం చెప్పాలంటే, నేటిరాత్రి నాకు రాబోయే కలకు నేనిచ్చిన అక్షర రూపమన్నమాట..!!
…… కాబట్టి కాట్రవెల్లీ.. అడ్డమైన కలలు కనడం మాని………….
పట్టిసీమ ల్యా… నీ తలకాయ ల్యా..!! నీ పనిజూస్కో.. పో.. (జేసి దివాకర్ రెడ్డి స్టయిల్ లో అన్నమాట)