
పచ్చొడ్లు నే దంచి…పాలెసరు బెట్టీ – జానపదగీతం
వర్గం: ఇసుర్రాయి పాట
పచ్చొడ్లు నే దంచి పాలెసరు బెట్టీ
పాలేటి గడ్డనా మూడు నిమ్మల్లూ
మూగ్గూ నిమ్మల కింద ముగ్గురన్నల్లూ
ముగ్గూరన్నల కొగడు ముద్దు తమ్మూడు
పెద్దవన్న నీ పేరు పెన్నోబలేసూ
నడిపెన్న నీ పేరు నందగిరిస్వామీ
సిన్నన్న నీ పేరు సిరివెంకటేసూ
కడగొట్టు తమ్మూడ కదిరి నరసింహా
ముగ్గురన్నలతోడ నాకి సరిబాలు
సరిబాలు గాదమ్మ వొడిబాలు నీకు
రత్నాలు ముత్యాలు చాటాకు బోసి
వొడి నించ వచ్చెనే తల్లి బూదేవి
రత్నాలు నాకొల్ల ముత్యాలు వొల్ల
యేమీ వొల్లనిదానవు యాలొస్తివమ్మ
యెత్తుకో బాలునీ యెక్కు గుర్రమ్మూ
బారబారెంటికల బాలింత నేనూ
బండికట్టి పంపప్ప తండ్రి అనుమప్ప
కురస కురసా యెంటికలు కుర్జీలు వేసీ
వొంటిగ బోతావు జంటెవరు నీకు
దాపునవీపున తమ్ము డెరిస్వామి
పాడినవారు: మురుకొండ అంజనమ్మ, సాల్లాపురం, రాయదుర్గం తాలూకా, అనంతపురం జిల్లా