నెమిలి కత (కథ) – వేంపల్లి రెడ్డినాగరాజు

    నెమిలి కత (కథ) – వేంపల్లి రెడ్డినాగరాజు

    “ఏమ్మే, పొద్దు బారెడెక్కిండాది, వాన్ని లేపగూడదా, కొంచింసేపు సదువుకోనీ” అంటి నా పెండ్లాంతో.

    “సలికాలం గదా,ఇంగ రోంతసేపు పొణుకోనీలేబ్బా” అనె ఆయమ్మి.

    “నోరు మూసుకోని చెప్పిండే పని చెయ్,నువ్వే వాన్ని సగం చెడగొడతాండావ్” అంటి గదమాయిస్తా.

    “అట్లయితే నువ్వే లేపుకోపో” అంటా ఇంట్లేకెల్లిపాయ నా బాశాలి.

    “రేయ్ , టయిం ఏడు గంటల పొద్దయితాంది,ఇంగా నిగుడుకోనే పొణుకోనేవుండావే, లెయ్ వాయ్” అని మా పిల్ల నాకొడుకు పిర్రల మింద వొగటంటిస్తి.

    “ఏం నాయినా” అంటా వాడు కండ్లు నలుపుకుంటా లేసి కుచ్చుండె.

    “బడికి పొద్దుగాలేదా,బిరీనా రెడీగా” అంటి.

    “కడుపు నొస్తాండాది నాయినా, ఈపొద్దు బడికి పోను” అనె వాడు మంచం మింద నుండీ లెయ్యకుండానే.

    “నీ యాక్సన్ సాల్లేవాయ్, ఇట్లా దొంగ కడుపు నొప్పులు పిల్లబ్బుడు మాకూ సానానే వచ్చుండాయ్” అని ఇంగోతూరి కొట్టేదానికి చెయ్యెత్తితి.

    “నిజ్జింగానే నాయినా” అంటా వాడు చొక్కా పైకెత్తి కడుపు చూపిచ్చె.

    “వుడుకుడుగ్గా రోంత కాపీ తాగి, దొడ్డికి కుచ్చోపో, తగ్గిపోతాది” అని చెప్తి.

    “ఏంటికబ్బా వాన్ని అంతగా బలవంతం చేస్తాండావ్ ,ఈ వొక్కపూట పోకుంటే ఏం పాసిపోతాందీ” అంటా మల్లా వొచ్చె నా పెండ్లాం.

    “నేనుగుడా చిన్నబ్బుడు మా వారాది ఐవారికి బయపడి ఆపద్దాలు చెప్పి చానాతూర్లు బడి మానేసిండామ్మే, అందుకనే సదువు రాక సంక నాకిపోతి”అంటి.

    చదవండి :  కుట్ర (కథ) - కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి

    “వారాది సార్ గురించి చెప్పు నాయినా” అంటా వొచ్చె నా కూతురు. దాంతో నా చిన్నబ్బుడు జరిగిండే కత చెప్పబడ్తి.

    నేను మూడో తరగతి సదివేటబ్బుడు మాకు వారాదయ్య అనె ఎడ్మాస్టర్ వుండె. ఒగతూరి ఆయప్ప ” రేయ్, రేపు మన ఇస్కూలుకు ఇనస్పెక్టర్ వొస్తాండాడు,మీరంతా తలకాయలకు సమురు బెట్టుకోని దువ్వుకోని, మంచి గుడ్డలు ఏసుకోని రావల్ల” అనె.

    “అట్లనే సా” అంటిమి పిల్లోల్లమంతా.

    “ఆ వొచ్చేటోడు మిమ్మల్ను కొసినీలు అడగమంటాడు,అవేంటియో ఈపొద్దే చెప్తాండా, అందురూ నేర్చుకోనిరాండి”అని చెప్పె ఆయప్ప.

    “సరే సా” అంటిమి

    “పలక మింద రాసుకోని నోటికి నేర్చుకోనిరాండి” అంటా కొన్ని పదాలు చెప్పె. సందకాడ ఇంటికి పొయ్యేటబ్బుడు తుంపర రాలి నా పలక మిందుండే పదాలన్నీ పాయ.

    ” మ్మా, సురేసుగానింటికి పొయ్యి పదాలు రాసుకోనొస్తామ్మా” అనడిగితి మాయమ్మను.

    “పురుగూ, పుట్రా తిరుగుతాంటాయ్, ఈ మొబ్బులో యాడికీ పోగాకులే ” అనె మాయమ్మ. దాంతో ఏమీ నేర్చుకోకుండానే పొణుకోని నిద్దరబొయ్యి తెల్లార్తోనే లేసి బడికి పోతి.

    “రేయ్, నిన్న చెప్పిండేటివన్నీ నేర్చుకోనొచ్చిండారుగదా” అనెడిగె వారాది ఐవారు.

    చదవండి :  షాదీ (కథ) - సత్యాగ్ని

    ” ఆ సా, నేర్చుకున్యాం” అనిరి కొందురు పిల్లోల్లు.

    “యాడడిగితే ఆడ టకీమని జెప్పల్ల” అనె ఆయప్ప.


    “చెప్తాం సా” అనిరి పిల్లోల్లు ఇంగోతూరి.

    తొమ్మిది గంటల టయింలో ఇనస్పెక్టర్ వొచ్చె.

    ” నమస్కారం సార్, రాండి” అని ఎడ్మాస్టర్ ఆయప్పను కుర్చీలో కుచ్చనబెట్టె.

    “ఏమయ్యా వారాదీ, పిల్లోల్లకు బాగనే చెప్తాండావుగదా?” అనెడిగె.

    “ఔ సా ” అని నవ్వతా అనె మా ఐవారు.

    “ఏదీ నాలుగు కొసిన్లు అడుగు, ఎట్లజెప్తాండావో తెలుస్తాది” అనె ఇనస్పెక్టరు.

    “నాగరాజూ,లెయ్ నాయనా” అని నన్ను లేపె ఐవారు.

    ఏమడుగుతాడొ,ఏంపాడో అని బయపడతా నిలబడుక్కుంటి చేతులుగట్టుకోని.

    “సీత నాయిన ఎవుర్రా?” అనెడిగె .

    ఏం చెప్పల్లనో తెలీక మెల్లిగా గొణిగితి.

    “గెట్టిగా చెప్పు, సార్ కు ఇనపడేటట్లు ” అనె గుడ్లురుముతా.

    “మంగలోల్ల సుబ్బన్న కూతురు సా” అంటి .

    ఆ మాటింటానే “నేను తెలుగు పాటం చెప్పినబ్బుడు వీడు బడికి వొచ్చినట్లులేడు సార్,అని ఇనస్పెక్టర్ కల్లా చూస్తా నవ్వె ఐవారు.

    “అట్లైతే ఆ పిల్లోన్నే ఇంగ్లీసు పదాలు అడుగబ్బా” అనె ఆయప్ప రికార్డు చూస్తా.

    “సరే నెమిల్ను ఇంగ్లీసులో ఏమంటారో చెప్పు?” అని మల్లా అడిగె ఐవారు.

    “తెలీదు సా” అంటి.

    చదవండి :  రాయలసీమ మహాసభ కడప జిల్లా కమిటీ

    “మొన్న చెప్పినా గదా, మరిచిపొయ్యిండావా” అంటా వొచ్చి ఇనస్పెక్టరుకు కనపడకుండా నా జుట్టు పట్టుకోని గెట్టిగా గుంజె. దాంతో తలకాయిలో మంటబుట్టి కండ్లల్లో నీల్లు తిరిగె.

    “పీకాకు సా” అంటి జుట్టు పీకొద్దని, ఏడుస్తా చెప్తా.

    “ఈ మాట ముందే చెప్పింటే సరిపోతాండె గదా,అని నాతో అంటా ,చూడు సార్, కరెక్ట్ గా చెప్పిండాడు” అనె ఐవారు ఇనస్పెక్టరు కల్లా చూసి.

    నేను ఎట్ల కరెక్ట్ గా చెప్పిండానో నాకేమీ అర్తంగాలా.

    “ఆపిల్లోన్నె మిగతా వాటిల్లో గుడా రొండు కొసెన్లు అడుగు” అని చెప్పె ఆయప్ప.

    దాంతో నాకు వుచ్చలు బాయ.

    ” ఏమప్పా ఆవుకు కాల్లెన్ని?” అనెడిగె మా సారు నాలుగేల్లు నాకల్ల చూపిస్తా, ఇనస్పెక్టర్ కు కనపడకుండా.

    “నాలుగు సా” అంటి గెట్టిగా.

    “మన ప్రదాన మంత్రి చెన్నారెడ్డి కాదు గదా” అనె సారే తలకాయ అడ్డంగా వూపతా.

    “కాదు సా” అని చెప్తి, ఐవారి సైగ అర్తంజేసుకోని.

    “వెరీ గుడ్డయ్యా, బాగ చెప్తాండావ్”అని మెచ్చుకోని బయలుదేరె వొచ్చిండేటోడు.

    “అదీమ్మా మా వారాది ఐవారి కత ” అంటా ముగిస్తి.

    – వేంపల్లి రెడ్డినాగరాజు

    ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా, రాయదుర్గం(పోస్ట్), అనంతపురం(జిల్లా)
    చరవాణి: 9985612167

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *