నంద్యాలంపేట (English: Nandyalampeta) – వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరు మైదుకూరు – బద్వేలు రహదారిపైనున్న ‘గుడ్డివీరయ్య సత్రం’ సమీపంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామం 2856 ఇళ్లతో, 11457 మంది జనాభాతో 5090 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5900, ఆడవారి సంఖ్య 5557. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3230 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 463.
నంద్యాలంపేట గ్రామంలో ప్రధాన వీధి వెడల్పుగా బస్తీ లక్షణాలతో ప్రాచీన చారిత్రక నేపథ్యానికి తార్కాణంగా నిలిచివుంది.
పేరు వెనుక కథ :
నంద్యాలంపేట ఊరు ఏర్పడకముందే పరిసర గ్రామప్రజలు ఆ స్థలంమీదుగా వెదుర్లు, కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్తూ స్త్రీ ప్రతిమ అయిన బేతాళపు శిలా విగ్రహాన్ని ఇక్కడ నిలిపారు. నంద్యాల నుంచి ఎల్లమ్మ దేవత వచ్చి ఈ స్థలంలో వెలసిందని అప్పట్లో ప్రజలు భావిస్తూ ఉండేవారు. అదేచోట ‘పేట’ ఏర్పాట్లు కావడంతో అని ఆ పేటకు ‘నందేలమ్మపేట” అని పేరు వచ్చింది.
చరిత్ర :
నంద్యాలంపేట గ్రామాన్ని క్రీ.శ. 1642వ సంవత్సరం లో పేరనిపాడు కులకర్ణీ పనిచేసిన జంగమయ్య కుమారుడు గురప్పయ్య పౌరాహిత్యంలో ఉరుంపోసి నిర్మించారు. గొల్కొండ నవాబుల ఆధ్వర్యంలో దువ్వూరు ఖిల్లేదారుడుగా ఉండిన “మహమ్మదు అజేం” చొరవతో బొమ్మిడ శానం శెట్టి, పాశంశెట్టిల ముఖాంత్రంగా పేట కోమట్లను, సాలెలను, కంచెర్లవారిని, మిరాశీదార్లను గ్రామానికి చేర్చించడంతో నంద్యాలంపేట బస్తీగా రూపొందింది. అయితే అప్పటిదాకా పేరనిపాడు సముతిలో ఉన్న గ్రామాలన్నీనందేలమ్మపేట సముతిలోకి వచ్చేశాయి.
క్రీ.శ. 1716వ సంవత్సరం వరకు నందేలమ్మపేట గోల్కొండ నవాబుల ఏలుబడిలో ఉండేది. తర్వాత క్రీ.శ. 1756 వరకు మోచామియ్యా ఏలుబడిలో నందేలమ్మపేట సమితి ఉండేది. ఆ తర్వాత మరాఠా నాయకుడు బల్వంతరావు నందేలమ్మ పేటపై సైన్యంతో దాడి జరిపి గ్రామాన్నిదోచుకున్నాడు. నవాబు మసీదుమియ్యాను బండి కనుమ వద్ద నిర్భంధించి తల కోశారు. అయితే క్రీ.శ. 1763 వరకూ మోచామియ్యా మళ్ళీ నందేలమ్మ పేటను పరిపాలించాడు.
మోచామియ్యా పాలనా కాలంలో “అవుకు” రాజు అనంతరాజు నందేలమ్మ పేటపై దాడి జరిపి సంపదనంతా పూర్తిగా దోచుకుపోయాడు. ఆ తర్వాత నంద్యాలంపేటను క్రీ.శ. 1779వ సంవత్సరం వరకు కడప నవాబు నబీఖాన్ తన ఆధీనంలో ఉంచుకున్నాడు.
తర్వాత దువ్వూరు పరగణా ఏలుతూ ఉండిన నవాబు గనీబేగ్ నందేలమ్మపేటను ఏలుతూఉండగా, “నొస్సం” సంస్థానీకుడు జయరామిరెడ్డి దాడి జరిపి ఈ పేటను దోచుకున్నాడు. తర్వాత మైసూరు పాలకుడు టిప్పుసుల్తాన్ పాలనలో 1783 నుండి దువ్వూరు పాలకుడు గనీబేగ్ మళ్లీ ‘నందేలమ్మపేటకు పాలకుడయ్యాడు. రెండేళ్ళు మోదీన్‌ఖాన్ పరిపాలించాడు.
క్రీ.శ 1790 వ సంవత్సరం నుండి రెండు సంవత్సరాల పాటు సైదులావద్దీన్ పరిపాలించాడు. ఆతర్వాత వరుసగా దిలారుద్దౌలా, అమీన్‌సాహెబ్, బనగానపల్లె అసదల్లీఖాన్, రాజాచందూలాల్‌ల పాలనలోకి నంద్యాలంపేట వెళ్ళింది.
చూడాల్సినవి :
నంద్యాలంపేట గ్రామంలోని వీరభద్రుని దేవాలయం, నందేలమ్మ ఆలయం లేదా నంద్యాలమ్మ ఆలయం, ఆంజనేయ దేవాలయాలు అతి పురాతనమైనవి. గ్రామంలో మసీదు నిర్మాణం కూడా జరిగింది.
పంటలు :
ప్రాచీనకాలం నుండి నంద్యాలంపేట సముతిలోని రైతులు సజ్జలు, రాగులు,పచ్చజొన్నలు, ఆరికెలు, చామలు, వద్దు, కొర్రలు, అలసందలు, కందులు, పెసలు, నువ్వులు, అనుములు, గోగులు, నీరుళ్ళి, తెల్లఉల్లి, ఆకుతోటలు, చెరుకుతోటలు, పసుపు, జీలకర్ర,నీలితోటలు, కొత్తిమీర పండించేవారు.
సాలెలు :
నందేలమ్మపేటలోని సాలెలు తమ మగ్గాలపై 40మూర్ల పొడవు, ౩ జానల వెడల్పుగలభారీ శల్లాలు, మూడు రూపాయల నుండీ పదేసి రూపాయలవిలువైనవి నేసేవారని నంద్యాలంపేట కైఫీయత్ తెలుపుతోంది. అలాగే 18 మూరల పొడుగు, గజంవెడల్పు గలిగిన సన్నపరకాళాలు నేసేవారు. వీటిధర 3 రూపాయల నుండి 8 రూపాయల దాకా ఉండేది. భారీ తెల్లపాగాలు, తెల్లచీరెలు, ధోవతులు, వనితక పచ్చడపు రేకులు, ముతక ఎర్రగొల్కులు చీరలు, నీలిచీరెలు మగ్గాలను నేసేవారని మెకంజీ కైఫీయత్తులో పేర్కొనబడింది.
ఆంగ్లేయుల పాలనలో ..
క్రీ.శ 1800వ సంవత్సరం నుండి బ్రిటీషు పాలనలోకి నందేలమ్మ పేట వచ్చింది. బ్రిటీషు కలెక్టర్ కల్నల్ థామస్ మన్రో నంద్యాలంపేట, ఎల్లంపల్లె, శెట్టివారిపల్లె చెరువులను మరమ్మత్తు చేయించాడు. నంద్యాలంపేట బ్రిటీషు కాలంలో కూడా ప్రముఖ పరిపాలన కేంద్రంగా వెలుగొందింది. ఇక్కడే కోర్టుకచేరీ నడిచేది. రెవెన్యూ వ్యవహారాలు కూడా నందేలమ్మపేట తాలూకాకేంద్రంగా జరుగుతూ ఉండేవి. గ్రామంలో ఇప్పటికీ కోర్టు కచేరి, కోట బురుజు తదితర శిథిల ఆనవాళ్ళను మనం చూడవచ్చు.
నంద్యాలంపేటకు ఎలా వెళ్ళాలి ?
దగ్గరి విమానాశ్రయం : కడప (46 కి.మీ), తిరుపతి (185కి.మీ), బెంగుళూరు (319 కి.మీ), చెన్నయ్ (285 కి.మీ)
దగ్గరి రైల్వేస్టేషన్ : కడప (41 KM), యర్రగుంట్ల (46 KM)
దగ్గరి బస్ స్టేషన్ : మైదుకూరు (9 KM)