
తేల్సుకుందాం రార్రని తెగేసి సెప్పక!
ఒరే అబ్బీ..ఒరే సిన్నోడా
పొగబండీ..ల్యాకపాయ
ఒరే సంటోడా..ఒరే సన్నొడా
ఎర్ర బస్సూ కరువైపాయ
అబ్బ పాలెమాలినా..
జేజికి బాగ లేకపొయినా
గుంతల దోవలే దిక్కైపాయ
తాతల కాలం నుంచీ
పొగబండ్లని ఇనడమేకానీ
ఎక్కిన పాపాన పోల్యా
ఉత్తర దిక్కు రైలు యెల్తాంటే
సిత్తరంగా ముక్కున ఎగసూడ్డమే కానీ
కాలు మింద కాలేసుకోని కూచ్చోని
రోంత దూరమన్నా పోయింది ల్యాకపాయ
మా సిన్నాయన ఒకసారి
కనకదుర్గమ్మ తిన్నాలకు పోయుండ్య
పొగబండ్లతోనే
పైన మోడాలు ఆడ్తాండయంట
ఊరూరికీ పొగబండ్లలోనే
జనాలంతా ఉరికురికి పోతాండ్రంట
రాదారుల పక్కన చల్లగాలులంట
పొగబండ్లెక్కితే చలువ గాలులంట
మన బతుకులేందిరా
మరీ ఈనమైపాయ
మన కతలేందిరా
మట్టికొట్టుకుపాయ!
ఇంగా యేందిరా ఎగ సూచ్చాండేది
యెల్లుకోర్రి అని పొలికేక యేయక
తేల్సుకుందాం రార్రని తెగేసి సెప్పక!
– తవ్వా ఓబుల్ రెడ్డి
( 8-7-2014 రైల్వే బడ్జెట్ లో మనసీమ నోట్లో మళ్ళీ మట్టికొట్టారని వార్తలు విని..)