ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం
సీమ ప్రజలంతా పోరుబాటకు సిద్ధం కావాల
ప్రొద్దుటూరు: కడప జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం అలవికాని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ, తీవ్ర వివక్ష చూపుతోందని శాసనమండలి సభ్యుడు డాక్టరుఎం.గేయానంద్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఒక ఆసుపత్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… రాయలసీమకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినహామీలు ఇంతవరకు అమలు కాలేదన్నారు. నదీజలాల పంపకంలో రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమ అభివృద్ది విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు.వెనకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం ప్రజలంతా పోరుబాటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాయలసీమలో అన్నిరంగాల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.24 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తే కేంద్రం కేవలం రూ.300 కోట్లు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన హామీలు, పార్లమెంటులో చేసిన వాగ్దానాల అమలు కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. అన్నివర్గాల మద్దతుతో పోరాటం చేస్తామన్నారు.
గాలేరు-నగరి, హంద్రీనీవా సాగునీటి పథకాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండు చేశారు. కార్పొరేట్ ప్రగతి నమూనాను వ్యతిరేకించే వారంతా రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదికలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సీమకు ప్రాణపదమైన హెచ్ఎన్ఎస్, జీఎన్ఎస్ఎస్ రెండు దశలను త్వరగతిన పూర్తి చేస్తే కరవు నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని డిమాండు చేశారు.
సమావేశంలో జనవిజ్ఞానవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, పట్టణ గౌరవాధ్యక్షుడు డాక్టరు డి.నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తవ్వా సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.