సంబెట శివరాజు నిర్మించిన తిరుమలనాథ ఆలయం!

సంబెట శివరాజు నిర్మించిన తిరుమలనాథ ఆలయం!

వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లా మైదుకూరు మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ ఆలయం చారిత్రక విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్శిస్తూ ఉన్నది.

కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన పకృతి రమణీయత నడుమ ఎత్తైన ఒక గుట్టపై వెలసిన ఈ ఆలయం మైదుకూరు ప్రాంతానికే కాక జిల్లాలోని ఎన్నో విశిష్టమైన ఆలయాల సరసన నిలిచి, భక్త జనకోటి పారవశ్యంలో మునిగి, ముక్తిని పొందే దివ్యధామంగా వెలుగొందుతుంది.

తిరుమలనాధుడు
తిరుమలనాధుడు

శ్రీదేవి, భూదేవి సమేతంగా అలరారుతోన్న ఈ క్షేత్రానికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ దేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో సంబెట పిన్నయదేవ మహారాజు అనే సామంతరాజు ప్రస్తుత యల్లంపల్లెకు ఉత్తరాన ‘పేరనిపాడు’ అనే పేటను నిర్మించి, కోటను కట్టించి సామంత రాజ్యాన్ని స్థాపించాడు.

పేరయ్య, లోకయ్య అనే గొల్లల సహకారంతో రాజు ఈ రాజ్యాన్ని స్థాపించడంతో తాను నిర్మించిన కోటతో కలిపి పేటకు పేరనిపాడు అని నామకరణం చేశాడు. అలాగే లోకయ్య పేరుతో నంద్యాలంపేట సమీపంలో లోకాయపల్లె గ్రామాన్ని కూడా నిర్మించాడని పేరనిపాడు కైఫీయత్‌ ద్వారా తెలుస్తోంది. కోటకు రక్షణగా శ్రీవీరభద్ర, ఈశ్వర, ఆంజనేయ స్వామిల దేవలయాలు వెలిశాయి. పేరనిపాడు సైన్యాధ్యక్షుడు హెగ్గడన్న ఈ ‘పేట’ నిర్మాణంలో ప్రధాన భూమికను పోషించాడు.

చదవండి :  నిడుజువ్విలో సుందర సూర్య విగ్రహం!

గగ్గితిప్పకు పశ్చిమ భాగంలో ఆటభైరవున్ని నిలిపాడు. ఈ దశాబ్ద కాలంలో ఈ ఆటభైరవ ఆలయం వద్ద పురావస్తు పరిశోధకులకు లభించిన శాసనం ద్వారా ‘పేరనిపాడు’ రాజ్యానికి సంబంధించిన కొంత చరిత్ర వెలుగు చూసింది. పిన్నయదేవ మహారాజు కుమారుడైన సంబెట శివరాజు ఆ తర్వాత ‘పేరనిపాడు’ రాజ్యానికి అధిపతి అయ్యాడు. తన తండ్రి మార్గములోనే శివరాజు పేరనిపాడు కసుబాగ్రామాలతో పాటు దువ్వూరు, చెన్నూరు పరగణాలను పాలిస్తూ కావలి కట్నాలను వసూలు చేసి, పన్నులతో కలిపి విజయనగర చక్రవర్తికి కప్పంగా చెల్లిస్తూ వచ్చాడు.

thiru03సంబెట శివరాజు శాలివాహన శకం (క్రీ.శ.1503) రుధిరోద్గారి సంవత్సరంలో యల్లంపల్లె గ్రామానికి సమీపంలో ఈశాన్య దిశలో గుట్టపై గగ్గితిప్పకు ఉత్తరం దిశలో శ్రీతిరుమలనాథ ఆలయాన్ని నిర్మించాడు. శివరాజు ఈ ఆలయాన్ని తూర్పు దిశకు అభిముఖంగా సుందరమైన గోపురం ప్రాకారాలతో శ్రీదేవి, భూదేవి సమేతంగా నిర్మించాడు. ఆలయానికి ఉత్తర దిశలో మెట్లు నిర్మించి, అక్కడికి పడమర దిశలో సమీపంలోనే ఉన్న కోటకు రాకపోకలను సాగించేందుకు దారి సౌకర్యం కల్పించాడు. ఈ దేవాలయ నిర్వహణకు అవసరమైన సొమ్ము రాబడికి సమీప గ్రామాలను పొలాలను మాన్యంగా ప్రకటించాడు.

చదవండి :  దివిటీల మల్లన్న గురించి రోంత...

సంబెట శివరాజు మండలంలోని ఉప్పుగుంటపల్లెకు తూర్పున (బుగ్గ ఉన్న చోట) ఋషి ప్రతిష్టత ఈశ్వర లింగానికి దేవాలయాన్ని కూడా నిర్మించాడు ! శివరాజు రాజ్యం చేస్తున్న కాలంలోనే రాజ్యంలో నెలకొన్న పరిస్థితులలో భాగంగా శివరాజు, చక్రవర్తిపై తిరుగుబాటు చేశాడు. దీనితో పేరనిపాడు కోటపై విజయనగర చక్రవర్తి సాళువ వీరనరసింహరాయలు దాడి జరిపి ఫిరంగులతో కోటను నేలమట్టం చేశాడు. ఆ తర్వాత వీరనరసింహారాయలు పేరనిపాడు రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో భాగంగా కొనసాగించాడు. గగ్గితిప్పకు తూర్పున ఉన్న చెరువులో రాజుల గుర్రాలు నీళ్ళు తాగుతూ ఉండేవి. దీంతో ఆ చెరువుకు ‘గుర్రాల మడుగు’ అనేపేరు వచ్చింది.

ఆ తర్వాత కాలంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు తిరుమలనాథ ఆలయానికి ఉత్సవ కైంకర్యం కింద సమీపంలోని గడ్డంవారిపల్లె గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు గడ్డంవారిపల్లె హనుమంతరాయుని విగ్రహం అరుగువద్ద లభించిన శాసనం ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజు శ్రీ సదాశివరాయలు కాలంలో కూడా పేరనిపాడు గ్రామం ఒక ప్రత్యేక పాలన ప్రాంతంగా వెలుగొందింది.

చదవండి :  ముక్కొండ కథ

ప్రస్తుత యల్లంపల్లె, చిన్నయ్యగారిపల్లె గ్రామాల మధ్య కోట, పేటగా పిలువబడే భూములు ఉన్నాయి. పేరనిపాడు స్థలంలో పురాతన ఆలయాల శిథిలాలు ఉన్నాయి. పేరయ్య, లోకయ్య వారసులు నానుబాల ఇంటిపేరుతో నానుబాలపల్లె గ్రామంలో ఆ తర్వాత కాలంలో నివశించారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న యర్రబల్లె, గంగాయపల్లె, మస్తానయ్యపేట, సుంకులుగారి పల్లె, ఉప్పుగుంట పల్లె,నంద్యాలంపేట, పెద్దశెట్టిపల్లె, గడ్డంవారి పల్లె, రాయప్పగారి పల్లె, గోపిరెడ్డిపల్లె, నానుబాలపల్లె, చిన్నయగారి పల్లె, సెట్టివారి పల్లె, కేశలింగాయ పల్లె, యల్లంపల్లె లలో సంక్రాంతి సందర్భంగా గ్రామోత్సవంగా స్వామి ఉరేగింపు జరుగుతుంది.

ఇలాంటి చారిత్రక వైభవ దీప్తులు వెదజల్లిన శ్రీ తిరుమలనాథ ఆలయాన్ని ఇటీవల శ్రీ సోమా తిరుమల కొండయ్యగారు జీర్ణోద్దరణ కోసం కృషి చేశారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *