
తనవారలు పెరవారలుఁ దానని యెడివాఁ డెవ్వఁడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తనవారలు పెరవారలుఁ దానని యెడివాఁ డెవ్వఁడు తనుగుణముల దిగవిడిచినధన్యుం డాతఁడెపో ॥చ1॥ తెగఁబడి మదనసముద్రము దేహముతోడనె దాఁటిన విగతభయుం డతఁ డెవ్వఁడు వీరుం డెవ్వఁడొకో పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి జగదేకప్రీతుండగుచతురుం డాతఁడెపో ॥చ2॥ యేచినపరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన ధీచతురుం డతఁడెవ్వఁడు ధీరుం డెవ్వఁడొకో చూచిన మోహపుఁజూపులఁ జురుచూండ్ల కెడమియ్యని రాచఱికపు నెరజాణఁడు రసికుం డాతఁడెపో ॥చ3॥ చావుకు సరియగు ద్రవ్యవిచారపు తుగులులఁ బాసిన పావనుఁ డెవ్వఁడు బహుజనబాంధవుఁ డెవ్వఁడొకో శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన – దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో |
రాగము: ఆహిరి రేకు: 0037-03 సంపుటము: 1-229 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి