
జానీ వచ్చాడోచ్…
ఎవరి పేరు చెప్పి జమ్మలమడుగు పట్టణంలో తెదేపా వాళ్ళు పోలీసులతో తలపడ్డారో… ఎవరి పేరు చెబితే పోలీసులు, అధికారులు ఉలిక్కిపడతారో…. ఎవరి గురించి జమ్మలమడుగు మునిసిపల్ ఎన్నిక వాయిదా పడిందో… అతడే ఈ జానీ! – రెండు వేల మంది తెదేపా కార్యకర్తలు, పదుల సంఖ్యలో నాయకులను, వందలాదిమంది పోలీసులను రెండు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా జమ్మలమడుగు వీధులలో తన కోసం ఎదురుచేసేలా చేసిన ఘనాపాటి.
జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక రోజున గోవా వెళ్ళిన జానీ తాపీగా శనివారం గోవా పోలేసుల భద్రత నడుమ శనివారం నగరానికి చేరుకున్నాడు. జమ్మలమడుగు 1వ వార్డు కౌన్సిలర్ ముల్లాజానీని గోవా నుంచి కడప జిల్లా కోర్టుకు శనివారం ఉదయం పోలీసులు తీసుకొచ్చారు.అప్పటి నుంచి సాయంత్రం వరకు కోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీల నాయకులు వచ్చి అతన్ని కలిసేందుకు ప్రయత్నించినా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతించలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి జిల్లా కోర్టుకు తన వాహనంలో వచ్చి తిరిగి వెళ్లారు.
భారీ భద్రత మధ్య మీడియా కంట పడకుండా జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు కడప పోలీసులు బందోబస్తు మధ్య కోర్టు నుంచి రిమ్స్ పోలీస్‌స్టేషన్‌కు సాయంత్రం తీసుకెళ్లారు. అక్కడ జానీ తల్లి నూర్జహన్, భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో రిమ్స్ పోలీస్‌స్టేషన్ ఆవరణంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. తాను ఈనెల 2వ తేదీన గోవాకు వెళ్లానన్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పకపోవడంతో కంగారుపడిన తన తల్లి తనను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు.
మీడియాలో విభిన్న కథనాలు వెలువడుతుండటంతో అన్ని మీడియా సంస్థలకు ఫోన్ చేసి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని సమాచారం ఇచ్చానన్నారు. అలాగే గోవా కోర్టులో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చానన్నారు. పోలీసుల సహాయంతో కడపకు వచ్చానన్నారు. కడప కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చానన్నారు. జమ్మలమడుగులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తన కుటుంబసభ్యులకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారనన్నారు. ఏ పార్టీ వారు తనకు ఫోన్ చేసి బెదిరించలేదన్నారు.
ఇంతకీ జానీ చెబుతున్నది నిజమేనా?