ప్రొద్దుటూరు: జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 25 వరకు జనవిజ్ఞానవేదిక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి తవ్వా తెలియచేశారు.
శుక్రవారం స్థానిక గ్రంధాలయంలో జవివే జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన సభ్యత్వ నమోదు గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ… శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జనవిజ్ఞానవేదికలో సభ్యులుగా చేరాలని పిలునిచ్చారు. సామాజిక అంశాల విశ్లేషణ, అధ్యయనాలను శాస్త్రీయ, హేతువాద దృక్పధంతో ప్రజానీకంలో ఆలోచనలుగా మలచాలనే ఆశయంతో జవివే పనిచేస్తోందన్నారు. ఒక మానవీయమైన, న్యాయమైన, శాస్త్రసమ్మతమైన సమాజాన్ని కోరుకునే జవివే ప్రజలవైపు నిలబడిందన్నారు. వికేంద్రీకృత అభివృద్ది కోసమై ప్రజల తరపున సంస్థ స్పందిస్తుందన్నారు.
కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు విజయమోహన్ రెడ్డి, బసిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కెవిరమణ, గౌరవాధ్యక్షులు డా.కళావతి, గోపినాయుడు, సూర్యకళ, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.