గురువారం , 21 నవంబర్ 2024
జగన్ పాదయాత్ర
బహిరంగ సభలో మాట్లాడుతున్న జగన్

జగన్ పాదయాత్ర మొదలయింది…

కడప ఉక్కు పరిశ్రమ ఏమైంది?

పల్లెల్లో పచ్చ మాఫియాలు రాజ్యమేలుతున్నాయి

రాజధాని నిర్మాణంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు

50 ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపేందుకు కుట్ర

బహిరంగ సభలో జగన్ ఉద్వేగభరిత ప్రసంగం

తొలిరోజు 8.2 కి.మీల నడక

కడప : అనుకున్నట్లుగానే భారీ సందోహం మధ్య విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర (ప్రజా సంకల్ప యాత్ర) ఈ రోజు ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయింది. యాత్ర ప్రారంభానికి ముందర వైఎస్ సమాధిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని జగన్ నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్రకు సంఘీభావం తెలిపేదానికి రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చిన వైకాపా అభిమానులు, కార్యకర్తలు మరియు ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడినారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన పైన విమర్శలు గుప్పించినారు. రాష్ట్ర విభజన జరిగేప్పుడు  కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు విభజన చట్టంలో హామీ ఇచ్చారు.  ఇప్పుడా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఏమైందని ప్రశ్నించినారు. రాయలసీమలో సాగునీటి పథకాలకు సంబంధించి 85 శాతం పనులను వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి చేయిన్చారన్నారు. మిగిలిన 15 శాతం నాలుగేళ్ళుగా చంద్రబాబు చేయిస్తూనే ఉన్నారు. కానీ ఒక్కటీ పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు.

చదవండి :  25న ప్రచారానికి చంద్రబాబు

జాబు రావాలంటే బాబు రావాలని గత ఎన్నికల్లో ప్రచారంతో ఊదరగొట్టారని, కానీ ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. 50 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఈ మేరకు జరిగిన ప్రొసీడింగ్స్‌ను ‘సాక్షి’ దినపత్రిక బయటపెట్టడంతో అబ్బే అలాంటిదేం లేదని ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారన్నారు. ఈ ప్రొసీండిగ్స్‌ బయటకు వచ్చేసరికి.. వీటిని వెల్లడించారనే సాకుతో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారని, ఇలా ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం న్యాయమేనా? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

 వైకాపా అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. పల్లెటూళ్ళలో పచ్చ చొక్కాల మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఉపాధి హామీ పనులు కూడా వాళ్లకు సంబంధించిన వాళ్లకే ఇస్తూ 30 శాతం లంచాలు బొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని డిజైన్ల పేరుతో కాలహరణం చేస్తున్న ముఖ్యమంత్రి గారు సినిమా సెట్టింగుల మాదిరి రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పటం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. రాజధాని పేర దేశాలు తిరిగి సాధించినది ఏమీ లేదన్నారు.  రాజధాని ప్రాంతంలో బినామీల భూములు వదిలేసి రైతుల భూములను తెదేపా నేతలు లాక్కున్నారన్నారు. మురళీమోహన్‌ మొదలుకొని తెలుగుదేశం పార్టీ నేతలు బ్రహ్మాండంగా రాజదాని ప్రాంతంలో ప్లాట్లు కట్టి వ్యాపారం చేస్తున్నారన్నారు.

చదవండి :  కడప జిల్లాకు అన్యాయం చేస్తున్నారు

ఉద్వేగానికి గురైన జగన్:

పాదయాత్ర ప్రారంభానికి హాజరైన జనసందోహాన్ని చూసి ప్రసంగించిన జగన్ ఒక సందర్భంలో ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ… ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. నేను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే నా కసి. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నదే నా కోరిక. మళ్లీ చదువుల విప్లవం తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. ప్రస్తుతం రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మారింది. అవినీతిపరులను జైల్లో పెట్టి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మార్చాలన్నదే నా కసి. ఇవన్నీ చేసేందుకు దేవుడి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు నాకు కావాలి. సమస్యలపై పోరాడేందుకు నాకు మద్ధతు ఇవ్వాలని’ పిలుపునిచ్చారు.

చదవండి :  ‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

‘చదువుల విప్లవం తీసుకురావాలనేది నాకున్న కసి. ప్రతి పేదవాడికి మంచి చేయాలి. ఇవాళ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రం చేశారు. ఏపీని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌ గా చేయాలనేది నా అభిలాష. ఇలాంటి పరిస్థితుల్లో నేను ముందడుగు వేస్తున్నా. నాకు కాసులంటే కక్కుర్తి లేదు. బాబు మాదిరిగా కేసులంటే భయం లేదు. నాకు కసి ఉంది. ఆ కసి ఏమిటో తెలుసా?. ఎప్పటికీ కూడా చనిపోయిన తర్వాత కూడా పేదవాడి గుండెల్లో బతకాలని ఉంది. నేను మంచి చేస్తా. ప్రత్యేక హోదా తేవాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలనే కసి ఉంది. రైతుకు వ్యవసాయం పండుగలా చేయాలనే కసి ఉంది. ప్రతి ఇంట్లోనూ కుటుంబంలోనూ ఆప్యాయతలను పంచుకోవాలని కసి నాకు ఉంది’ అన్నారు.

తొలిరోజు 8 కి.మీ నడక:

జగన్ పాదయాత్ర
పాదయాత్ర సాగిందిలా…

ఇడుపులపాయలో నుండి తొలి రోజు మొత్తం 8.2 కి.మీ నడచిన విపక్ష నేత మారుతీ నగర్, వీరన్నగట్టు పల్లె మీదుగా మాయిటాల (సాయంత్రం) 6:45 గంటలకు  కుమ్మరాంపల్లెకు చేరుకొని రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన గుడారంలో బస చేశారు.

జగన్ పాదయాత్ర
సంఘీభావం తెలిపేందుకు వచ్చిన జనం

 

 

ఇదీ చదవండి!

pattiseema

కోస్తా వారు చేస్తున్న మరో మోసమే ‘పట్టిసీమ’

కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాల రాజధాని పారిశ్రామిక కారిడార్‌ కోసమే పట్టిసీమ ఓవైపు సీమ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం.. …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: