నల్లబల్లి చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన – 2
నల్లబల్లి, కడప జిల్లాలోని ముద్దనూరు మండలానికి చెందిన ఒక గ్రామము. ఇది మండల కేంద్రమైన ముద్దనూరు పట్టణానికి సమీపంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు పలుమార్లు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. నల్లబల్లి చెన్నకేశవుని సరససల్లాపాలను అన్నమాచార్యుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడు…
వర్గం : శృంగార సంకీర్తన
రాగము: రామక్రియ
రేకు: 0190-4
సంపుటము: 7-534
చేకొనుమీ నల్లఁబల్లి చెన్నకేశవా
యీకడ నీ కిన్నిటికినిదవో మొక్కేను ॥పల్లవి॥
॥చ1॥ పొంచి నీవు విలిచితే బొమ్మల జంకించితిని
మంచముపై నుండితిని మన్ననలను
కంచముపొత్తుకుఁ దియ్యఁగా నీతోఁ బెనఁగితి
యెంచకుమీ యీనేరాలిదివో మొక్కేను ॥చేకొనుమీ॥
॥చ2॥ సరసము నీవాడితే సారెసారెఁ దిట్టితిని
సిరులఁ జెనకితేనే చెలఁగితిని
శిరసు వంచుకొంటిని చెరఁగు నీవు వట్టితే
యెరవుసేయకు నన్నునిదివో మొక్కేను ॥చేకొనుమీ॥
॥చ3॥ సెలవి నీవు నవ్వితే సిగ్గులు పైఁజల్లితిని
సొలసి చెక్కు నొక్కితే చొక్కితి నేను
కలసితివిదె శ్రీవెంకటగిరినుండి వచ్చి
యెలమిఁ దమకించకు యిదివో మొక్కేను ॥చేకొనుమీ॥