గురువారం , 21 నవంబర్ 2024

చంద్రబాబు కోసం వైఎస్ రెకమండేషన్

కాంగ్రెసు సంస్కృతి పూర్తిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న రోజులలో కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రులను పేకముక్కలవలె మార్చేసింది. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను, ఆయనను పక్కన పెట్టి భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. అదంతా ఇందిరాగాంధీ అధిష్ఠాన వర్గం చదరంగంలో భాగమే.

1978లో భవనం వెంకట్రామ్ విద్యామంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి ఆయనను తరువాత కౌన్సిల్ సభ్యుడుగా చేశారు. ఆ దశలో డా. తంగిరాల సుభాష్ నాకు భవనం వెంకట్రామ్ ను పరిచయం చేశాడు. భవనం వెంకట్రామ్ సోషలిస్టు భావాలతో ఉన్న కాంగ్రెసు వాది. కళలు, సంస్కృతి, భాష, సినిమాల పట్ల బాగా ఆసక్తి ఉన్న రాజకీయవాది. రెడ్డి కులస్తుడైనా కమ్మ కులానికి చెందిన జయప్రదను పెళ్ళి చేసుకున్నాడు. ఇరువురూ గుంటూర జిల్లాకు చెందినవారే. మెట్ట, మాగాణి అలవాట్ల కలయిక కూడా వారి జీవితంలో ఉన్నది. భవనం వెంకట్రామ్ చక్కడా మాట్లాడేవారు. ఎదుటివారిని ఒప్పించి అంగీకరింపచేయడంలో చాకచక్యులు. కానీ కాంగ్రెసు ముఠా రాజకీయాలలో ఇమడలేకపోయారు.

భవనం వెంకట్రామ్ విద్యామంత్రిగా ఉండగా కేంద్రంలో నెహ్రూ కుటుంబానికి సన్నిహితురాలైన శ్రీమతి షీలాకౌర్ ఢిల్లీలో విద్యామంత్రిగా ఉండేవారు. ఆమె రాష్ట్రానికి వచ్చినప్పుడు భవనం వెంకట్రామ్ పని తీరును ఆయన అభిరుచులను, సంస్కృతిని గమనించి అభినందించారు. ఉత్తరోత్తర అది చాలా పనిచేసింది. ఇందిరాగాంధీకి దగ్గరయిన షీలాకౌర్ రాష్ట్రంలో సంక్షోభం తొలగించటానికి అంజయ్య స్థానే ఎవరిని ముఖ్యమంత్రిని చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో భవనం వెంకట్రామ్ పేరు సరైన సమయంలో సరైన వ్యక్తులకు షీలాకౌరం చేరవేసింది. మిగిలినవారెందరో తాము ఒక సమిధను సమర్పించామన్నప్పటికీ అసలు కీలకం అది.

భవనం వెంకట్రాంకు విద్యామంత్రిగా చక్కని అనుభవం వచ్చింది. ఆయన కొన్ని సదస్సులలో పాల్గొని ప్రసంగించటానికి నేను తోడ్పడ్డాను. ఉదాహరణకు సైంటిస్టులను ఉద్దేశించి హైదరాబాదు జూబిలీ హాలులో విద్యామంత్రిగా ప్రారంభోపన్యాసం చేయవలసివస్తే నేను ఆయన ప్రసంగాన్ని రాసి ఇచ్చాను. సైంటిఫిక్ మెథడ్ ఎలా అమలు జరపాలి. సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్ళటానికి రాజ్యాంగం రీత్యా దాని ఆవశ్యకతను అందులో రాశాను. ఎ.బి.షా. రాసిన సైంటిఫిక్ మెథడ్ ను ఆధారంగా తయారు చేసిన ఆ ఉపన్యాసాన్ని భవనం వెంకట్రాం బాగా చదువుకొని సభలో మాట్లాడాడు. సైంటిస్టులు చాలామంది ఆయనను అభినందిచారు. అనుకోని అభినందనకు భవనం పొంగిపోయాడు. తరువాత వచ్చి నాకు చాలా ధన్యవాదాలు చెప్పారు. అప్పటి నుండి మేము అతుక్కుపోయాము.

భవనం వెంకట్రామ్ తటపటాయింపు ఎక్కువగా చేసిన వ్యక్తి. ఒక పట్టాన నిర్ణయాలు తీసుకోగలిగేవాడు కాదు. దానికి కారణం ఆయనకు మద్దత్తుగా రాజకీయ వాదులు లేకపోవడమే. కానీ అన్ని పార్టీల నుండి ఆయనను మెచ్చుకునేవారు ఉండటం గమనార్హం.

చదవండి :  ఎందుకింత చిన్నచూపు?

ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంలో ఢిల్లీ యాత్రలు జరుగుతుండగా భవనం వెంకట్రామ్ నన్ను తోడుగా తీసుకెళ్ళేవారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన అధికారంలో ఉన్న కొద్ది కాలం ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్లినా అన్ని పర్యాయాలు నేను వెళ్ళాను. అది మంచి అనుభవం. ఇందిరాగాంధీతో సన్నిహితంగా కలవడానికి ఆమెకు ఆనాడు పి.ఏ.గా ఉన్న పోద్దార్ బాగా తోడ్పడ్డాడు. ఢిల్లీదంతా అర్ధరాత్రి రాజకీయం. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీని చాలా పొద్దుపోయిన తరవాతనే కలిసేవాడు. అప్పుడే మంతనాలు చేసేవాడు. అది కాంగ్రెసులో సంస్కృతిలో భాగమైపోయింది.

నేను ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ కు సన్నిహితంగా ఉండటం వలన నా సిఫారసుల కోసం అనేకమంది తిరుగుతూండేవారు. నేను ఏవీ పట్టించుకోకపోవడం వల్ల నా పనులు జరగవని నిర్ధారించుకుని దూరంగా పోతుండేవారు. అదొక గమ్మత్తయిన రాజకీయ వాతావరణం.

స్నేహితుడుగానే భవనం వెంకట్రామ్ కు నేను మిగిలాను. అయితే రాజకీయాలపై వ్యాఖ్యానాలు చేసేటప్పుడు మాత్రం సన్నిహితత్వాన్ని పక్కకి పెట్టి విమర్శను వ్రాశాను. అది భవనంకు కష్టమనిపించేది. తరువాత మర్చిపోయేవాడు. మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి ఎన్నో కబుర్లు చెప్పేవాడు. హైదరాబాదు ఆదర్శనగర్ లో నేను వుంటున్న ఒక అద్దె ఇంటికి భవనం వెంకట్రామ్ తరచు వచ్చేవాడు. అప్పుడు ఆయన కోసం వచ్చిన ప్రముఖులలో వై.యస్.రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, పాలడుగు వెంకట్రావు మొదలైనవారుండేవారు. అది నిత్యకృత్యంగా ఉండేది. అయినప్పటికీ నేను మాత్రం రాజకీయాల జోలికి పోకుండా ఉండగలిగాను. భవనం పదవి నుండి దిగిపోయిన తరువాత కూడా మా సన్నిహితత్వం అలాగే కొనసాగింది.

భవనం ముఖ్యమంత్రిగా ఉండగా ఏమీ చేయలేకపోయాడనే చెప్పాలి. ఎన్. జనార్ధన రెడ్డి వంటివారు ఆయన మంత్రివర్గంలో ఆయనను ఖాతరు చేసేవారు కాదు. నాదెండ్ల భాస్కరరావు ఆయన ద్వారా ఏదో ఒక పదవిలో ప్రవేశించాలని విఫల ప్రయత్నం చేశారు. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారానికి ఎన్.టి.రామారావు రావటం చాలామందికి ఆశ్చర్యం వేసింది. వారిరువురూ గుంటూరు కాలేజీలో చదువుతున్నప్పటి నుండి విద్యార్థిదశలో స్నేహితులు. అదీగాక సినీరంగంలో భవనానికి కూడా ఆసక్తి ఉండేది. పి.వి. నరసింహారావు అంటే భవనానికి ఇష్టం ఉండేది. ఏడు మాసాల ముఖ్యమంత్రిగా చరిత్రలో ఆయన నిలిచిపోయారు.

1982లో ఎన్నికలు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఢిల్లీ నుండి సూట్ కేసులతో నిధులు తెచ్చిందని చెబితే నేను మొదట్లో నమ్మలేదు. తరువాత భవనం వెంకట్రామ్ ను పిలిచి కొంత డబ్బిచ్చి అనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థులకు పంచమన్నారు. ఆయన ఆవిషయం నాతో చెప్పకుండా అనంతపురం వెళ్ళొద్దాం రమ్మని కారులో తోడు తీసుకెళ్లారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. ట్రావెలర్స్ బంగళాలో బి.టి.ఎల్.ఎన్. చౌదరికి కాంగ్రెస్ నిధిని ఎన్నికల ఖర్చుల నిమిత్తం భవనం వెంకట్రామ్ ఇస్తున్నప్పుడు గమనించాను. ఆయన డబ్బు చాలదని సిఫారసు చేసి మరికొంత ఇప్పించమని అడిగాడు. ఆయన వెళ్ళిపోయిన తరువాత భవనాన్ని అడిగితే ఇందిరాగాంధీ నిధులు తెచ్చి పంచిన మాట నిజమేనని అందులో ఒక భాగమే తనకు అప్పగించారని చెప్పారు.

చదవండి :  అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -1

భవనం ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబునాయుడు స్టేట్ మంత్రిహోదా వుండేది. ఆయనను కేబినేట్ హోదాకు పెంచాలని వై.ఎస్.రాజశేఖర రెడ్డి కోరిక. ఢిల్లీ వెడుతున్నప్పుడు నాకా విషయం చెప్పి నన్ను కూడా వీలైతే ఒకమాట చెప్పమన్నాడు. రాజశేఖరరెడ్డి మిత్రులకు అరమరికలు లేకుండా అలా సహాయం చేసిన ధోరణి కనబరిచాడు. కానీ నేను అందులో పాత్ర వహించలేదు. అసలు విషయం ఏమంటే కేంద్రం ఆమోదం లేకుండా ఏ మార్పూ చేసే అవకాశం భవనానికి లేదు. తన నిస్సహాయతను భవనమే నాకు చెప్పాడు.

ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా ఉన్నందున నాకు కొన్ని మంచి అవకాశాలు లభించేవి. సుప్రసిద్ధ గాయని లతామంగేష్కర్ తన తండ్రి పేరిట ముషీరాబాద్లో సంస్థ పెట్టటానికి స్థలం అడుగుదామని ఒక రోజు పొద్దున్నే భవనం ఇంటికి వచ్చింది. సమయానికి ఎవరూ లేరు. నన్ను ఆమెతో మాట్లాడుతుండమని, ఈలోగా తాను తయారయి వస్తానని భవనం చెప్పారు. ఆవిధంగా చాలా సేపు లతామంగేష్కర్ తో మాట్లాడి ఆమె అనుభవాలు తెలుసుకునే అవకాశం లభించింది. ఆశ్చర్యమేమంటే ముఖ్యమంత్రి ఇంట్లో అలాంటి సుప్రసిద్ధ గాయని వచ్చినప్పుడు అందరు కలిసి ఫోటో తీయించుకుందామంటే కనీసం కెమెరా లేదు. నేటి ముఖ్యమంత్రులకు నాటి ముఖ్యమంత్రులకు ఎంతో తేడా అనిపించింది.

భవనం వెంకట్రామ్ విద్యామంత్రిగా ఉండగా యు.జి.సి. ఛైర్మన్ మాధురీ దీక్షిత్ అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వచ్చింది. భవనం వెంకట్రామ్, నేను కలిసి వెళ్ళాం. అయితే ఆమె సత్యసాయిబాబా భక్తురాలిగా పుట్టపర్తిలో డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నది. అది అవమానకరమని, శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయానికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ వ్యక్తిగత భక్తి ముఖ్యం కాదని నేను వెంకట్రామ్ కు చెప్పాను. భవనం అందుకు అంగీకరించి సాయిబాబా విద్యాసంస్థకి వెళ్ళలేదు.

బాబాలు, మాతలు భవనం వెంకట్రామ్ దగ్గరకు వచ్చినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఒకసారి కడప నుండి శివస్వామి వచ్చి విబూది పండు ఆయన చేతిలో పెట్టాడు. గాలిలో నుంచి అవి సృష్టించినట్లు చెప్పాడు. పక్కనే కూచున్న నేను భవనం వెంకట్రాం చెవిలో – ఒక గుమ్మడికాయ ఇవ్వమనండి అని చెప్పాను. ఆయన అలాగే అడిగాడు. ఆ స్వామి తెల్లబోయి ఇవ్వలేనన్నాడు. చేతిలో పట్టే వస్తువులయితే హస్త లాఘవంతో కనికట్టు విద్యతో అవతలి వాళ్ళని భ్రమలో పడేస్తారు. ఆ స్వామి జూనియర్ కాలేజీ పర్మిషన్ కోసం వచ్చి ఇలాంటివి అడిగాడు. మొత్తం మీద వాళ్ళను భవనం దూరంగానే ఉంచేవాడు.

చదవండి :  పులివెందుల గురించి చంద్రబాబు అవాకులు చెవాకులు

ఆయన హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పోస్టు భర్తీ చేయవలసి వచ్చింది. అనుకోకుండా నన్ను అడిగితే అప్పుడే హైకోర్టులో ఛీఫ్ జస్టిస్ గా రిటైర్ అయిన ఆవుల సాంబశివరావు పేరు చెప్పాను. భవనం వెంటనే అంగీకరించి నన్నే వెళ్ళి ఒప్పించమన్నారు. నేను ఆపని చేయగలిగాను.

భవనం హయాంలో జరిగిన ఒక మంచి కార్యక్రమం ఓపెన్ యూనివర్సిటీకి నాంది పలకటం. చదువుకోవటానికి అవకాశం లేక గ్రామాలలో ఉంటున్న వారికి విద్యాబుద్ధులు గరపటానికి పథకం ఉండాలని భవనం తలపెట్టాడు. ఆ ప్రయత్నంలోనే జి.రామిరెడ్డిని పిలిచి విషయాన్ని పరిశీలించమన్నాడు. ఆయన ఇంగ్లండు వెళ్ళి ఓపెన్ యూనివర్సిటీ పద్ధతిని చూసి వచ్చి రిపోర్టు ఇచ్చాడు.

యూనివర్సిటీ నాగార్జున సాగర్ వద్ద పెట్టాలని భవనం తలపోశాడు. చివరి దశలో వైస్ ఛాన్సలర్ గా జి.రామిరెడ్డికి పోటీగా జెన్ టిక్స్ శాఖాధిపతి ఓ.యస్.రెడ్డి ముందుకు వచ్చాడు. కానీ మేమంతా రామిరెడ్డినే బలపరిచాము. ఓ.యస్.రెడ్డి నాకు మిత్రుడే. ఆయనకు కష్టం వేసింది కూడా. కానీ భవనాన్ని ఒప్పించి చివరకు రామిరెడ్డి పేరుకే మొగ్గు కనబరిచాము.

భవనం వెంకట్రామ్ దిగిపోయిన తరువాత రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహించలేదు. కానీ చివరి వరకూ నాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన వద్దకు ఆట్టే ఎవరూ వచ్చేవారు కాదు. పదవి లేనప్పుడు కాంగ్రెసు సంస్కృతి అంతే.

నరిసెట్టి ఇన్నయ్య

రచయిత గురించి

హేతువాది అయిన నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబరు 31న గుంటూరు జిల్లా చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించారు. తెలుగు లో రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు మరియు కొన్ని అనువాదాలు చేశారు. మానవేంద్ర నాథ్ రాయ్‌ (ఎం.ఎన్. రాయ్‌గా ప్రసిద్ధికెక్కారు. ప్రముఖ హ్యూమనిస్ట్) రచనలు అనువదించారు. తెలుగు అకాడమీ,  తెలుగు యూనివర్సిటీ వీటిని ప్రచురించింది.తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించారు.

ఇదీ చదవండి!

వైఎస్ హయాంలో

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత..

2004 లో అనుకుంటాను. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత.. గాంధీ భవన్లోనో, మరెక్కడో, వైఎస్సార్ చేసిన సుదీర్ఘ …

ఒక వ్యాఖ్య

  1. rayalaseema congress lo tana naayakatyam bala padenduku , anuchrulanu penchukonenduku ..chittoor jillaa lo naidu communitylo tana anuchaarunni penchi konenduku YSR baabu nu cabinet loki recomend chesi vunda vacchu..rajakeeyala lo shaswatam ga freinds,enemies vundaru..rajakeeya nayakudiki bhahu mukhaalu vuntaayi
    pi article heading lo YSR peru nu highlight chesedi ga vundi..actual ga adi innaiah tana freind bhavanam venkatram gurinchi maatrame…abhimaanam durabhimaanam ga marakunada vundaali

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: