యోగివేమన విశ్వవిద్యాలయంలోని పరీక్షల నియంత్రణా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. లక్ష్మీప్రసాద్‌ను ఫోన్‌లో దూషించిన తెదేపా నేత గోవర్ధన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని యోవేవి అధ్యాపకులు పట్టుపట్టారు. బుధవారం ఉపకులపతి ఛాంబర్‌కు అధ్యాపక సిబ్బంది యావత్తు కదలి వచ్చి తమతోటి సహాయ ఆచార్యునికి బాసటగా నిలిచారు. దుర్భాషలాడిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నరుకుతా.. అంటూ ఫోన్‌లో దుర్భాషలాడినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనబాట తప్పదని హెచ్చరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. దీనికి స్పందించిన వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలను సభ్యసమాజం ఆమోదించదన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ఎస్పీని, కలెక్టర్‌ను కోరుతామని తెలిపారు. దీంతో అధ్యాపకులు తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి. వాసంతి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య జి. సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
“ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి గోవర్ధన్‌రెడ్డినో లేక అతని పేరుచెప్పి ఎవరైనా మాట్లాడారో ముందు విచారణ చేయిస్తాం. ఉపకులపతితో సహా అందరి సంగతి చూస్తామన్న నాయకులకు మమల్ని తొలగించే అధికారం లేదన్న విషయం గమనించుకోవాలి. నరుకుతాం అంటూ పరుషమైన పదజాలం వాడినట్లు నిర్ధారణ జరిగితే క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటాం.
– శ్యాంసుందర్, ఉపకులపతి