సన్నపురెడ్డి నవల ‘కొండపొలం’కు తానా బహుమతి
కడప : జిల్లాకు చెందిన ప్రసిధ్ద రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ‘తానా నవలల పోటీ – 2019’ బహుమతికి ఎంపికైంది.
అమెరికా నుంచి, భారత్ నుంచి పోటీకి మొత్తం 58 నవలలు వచ్చాయి. వాటన్నిటిలో సన్నపురెడ్డి నవల ఉత్తమంగా నిలిచి రెండు లక్షల రూపాయిల ‘తానా’ బహుమతి గెలుచుకుంది.
తానా నవలల పోటీలో రెండు లక్షల రూపాయల బహుమతిని అందుకుంటున్న తొలి రచనగానూ ఇది నిలిచిపోనుంది. అవార్డుకు అర్హమైన నవలల ఎంపికలో, ప్రముఖ రచయితలు అంపశయ్య నవీన్, కాత్యాయనీ విద్మహే, తాడికొండ శివకుమార శర్మ, అనిల్ ఎస్. రాయల్, తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
కడప జిల్లా బాలరాజు పల్లెలో పుట్టిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తి రీత్యా రచయిత. 8 నవలలు, 3 కథా సంపుటాలు, ఒక కవితా సంపుటిలు ఆయన వెలువరించారు. ఈయన రచించిన నవల ‘ఒంటరి’ 2017లో తానా బహుమతిని అందుకోవడం విశేషం. సన్నపురెడ్డి ‘కాడి’, ‘తోలుబొమ్మలాట’ నవలలకు ఆటా పురస్కారాలు లభించాయి. ‘చినుకుల సవ్వడి’కి చతుర నవలల పోటీలో ప్రథమ బహమతి దక్కింది. ‘పాలెగత్తె’, ‘పాండవ బీడు’ నవలలు స్వాతి పత్రిక బహుమతులు, ‘ఒక్క వాన చాలు’ నవ్య వారపత్రిక బహుమతి గెలుచుకున్నాయి. 75కు పైగా కథలు రాసిన ఈయన ‘కొత్త దుప్పటి’, ‘బతుకు సేద్యం’, ‘సన్నపురెడ్డి కథలు’ పేరిట మూడు కథా సంపుటాలు ప్రచురించారు. ఈ కథల్లో అనేకం ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి. ‘పంపకాలు’ కథ నాటికగా రూపొంది బహుమతులందుకుంది.