
పొద్దన్నె లేసినాడు కాదరయ్యా – జానపదగీతం
వర్గం: హాస్యగీతాలు (పసలకాపర్లు పాడుకొనే పాట)
పాడటానికి అనువైన రాగం : తిలకామోద్ స్వరాలు (ఆదితాళం)
పొద్దన్నె లేసినాడు కాదరయ్యా
వాడు కాళ్ళు మగం కడిగినాడు కాదరయ్యా(2)
కాళ్ళు మగం నాడు కాదరయ్యా
వాడు పంగనామం పీకినాడు కాదరయ్యా
పంగనామం పీకినాడు కాదరయ్యా
వాడు సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా
సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా
వాడు బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా
బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా
వాడు పల్లె దావ పట్టినాడు కాదరయ్యా
పల్లె దావ పడ్తేను కాదరయ్యా
ఆ..పల్లె కుక్క బౌ అన్యా కాదరయ్యా
పల్లె కుక్క బౌ అంటే కాదరయ్యా
వాడు అడ్డదావ బట్టినాడు కాదరయ్యా
అడ్డదావ బట్టినాడు కాదరయ్యా
వాడు జొన్నసేలో పన్యాడు కాదరయ్యా
జొన్నసేలో పడ్తే కాదరయ్యా
వాడు కంకులిరిసి బుట్లో పెట్యా కాదరయ్యా
కంకులిరిసి బుట్లో పెడ్తే కాదరయ్యా
వాడు సేన్రెడ్డి క్యాకలేశ కాదరయ్యా
సేన్రెడ్డి క్యాకలేచ్చే కాదరయ్యా
వాడు గువ్వల్ తోల్తాడనుకుంటి కాదరయ్యా
గువ్వల్ కాదు గివ్వల్ కాదు కాదరయ్యా
వాడు గట్టి దంటు పెరుక్కుండే కాదరయ్యా
గట్టి దంటు పీక్కుంటే కాదరయ్యా
వాడు సెరుకిచ్చాడనుకుంటి కాదరయ్యా
సెరుగ్గాదు గిరుక్కాదు కాదరయ్యా
వాడు జుట్టు పట్కొని వంగదీశ కాదరయ్యా
జుట్టు పట్కొని వంగదీచ్చె కాదరయ్యా
వాడు పేండ్లు సూచ్చానడనుకొంటి కాదరయ్యా
పేండ్లు కాదు గీండ్లు కాదు కాదరయ్యా
వాడు మంచె గుంజక్యాలదీశ కాదరయ్యా
మంచె గుంజక్యాలదీచ్చె కాదరయ్యా
వాడు ఉయ్యాలూప్తాడనుకొంటి కాదరయ్యా
ఉయ్యాల్‌గాదు గియ్యాల్‌గాదు కాదరయ్యా
వాడు ఊపూపి అంటుకుండ్య కాదరయ్యా
ఊపూపి అంటుకుంటే కాదరయ్యా
దావల్ దావల్ ఉరికినాడు కాదరయ్యా
పాడినవారు: కీ.శే.కలిమిశెట్టి మునెయ్య, దొమ్మరనంద్యాల, జమ్మలమడుగు తాలూకా, కడప జిల్లా
టప్పాలు రంగన్న, వజ్రకరూరు, గుత్తి తాలూకా, అనంతపురం జిల్లా