Image courtesy : The Hindu
ఓ రాయలసీమ రైతన్నా ! – జానపద గీతం
సాగునీటి సౌకర్యాల విషయంలో దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ రైతుకు వ్యవసాయం గుదిబండగా మారి, ప్రాణ సంకటమై కూర్చుండింది. కాయకష్టం చేసి గుట్టలు చదును చేసి తను సాగు చేసిన మెట్ట, పొట్ట కూడా నింపలేదని బాధపడుతున్న రైతు వ్యధను ‘ఓ రాయలసీమ రైతన్నా …’ అంటూ జానపదులు ఇలా ఆలపిస్తున్నారు.
మెట్టలూ, గుట్టలుదీసి – పట్టుబట్టీ దున్నితేను చిట్టెడైన పండవేమిరా
ఓ రాయలసీమ రైతన్నా..! పొట్టలైనా నిండవేమిరా
ఎండలోస్తే పంటలేదు, కుండనొక్కా గింజ లేదు .. తిండి లేక తిప్పలాయే
ఓ రాయలసీమ రైతన్నా..! ఎండిపోయే రోజులోచ్చెరా ||మెట్టలూ||
గులకరాళ్ళ బీడునంతా చలక చేసీ, చేను చేస్తే .. మొలకలన్నీ ఎండీపోయెరా
ఓ రాయలసీమ రైతన్నా..! తలకుమించి అప్పులాయరా ||మెట్టలూ||
బంజరు భూములిచ్చినారు, గింజ మొలువ నీరు లేదు
ఓ రాయలసీమ రైతన్నా..! నంజుకోను గింజ లేదురా ||మెట్టలూ||
పాతబడ్డ మెట్టబీడు తాతకాలమందు వచ్చె, నీళ్ళు లేక పంట ఎండేరా
ఓ రాయలసీమ రైతన్నా..! సేతగాని సేద్యమాయరా ||మెట్టలూ||
బోరులోన నీరు లేక, పొలములోన పైరు లేక, రైతులకూ కష్టమొచ్చెరా
ఓ రాయలసీమ రైతన్నా..! పసలకూ మేత లేదురా ||మెట్టలూ||