
ఊరూ వాడా (కథ) – సొదుం జయరాం
ఊరూ వాడా
మా ఆవిడకు బ్రెయిన్ వాష్ చెయ్యడమన్నది నా వల్ల అయ్యే పనికాదు. ఆవిడ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిందంటే దాన్నుంచి ఒక్క ఇంచ్ కదలించడం కూడా కష్టమే. కానీ ఓటమిని అంగీకరించడం నాకూ ఇష్టంలేదు. మా అమ్మాయి పెళ్లి విషయంలో మా ఇద్దరి మధ్యా పేచీ ప్రారంభమైంది.
“మీరు నూరు చెప్పండి, పల్లెటూరికి అమ్మాయిని ఇవ్వడానికి ససేమిరా నేనొప్పుకోను” అంది ఖచ్చితంగా అరుణ.
“పల్లెలంటే పూర్వంలాగానే వున్నాయనుకుంటున్నావేమో. అదేం కాదు. పల్లెలు చాలా మారిపోయినాయి. అయినా మన అమ్మాయిని పల్లెటూరికివ్వడం లేదు. పల్లెటూళ్లో బి.టెక్ అబ్బాయికివ్వబోతున్నాం” అన్నాను.
“సడేలే” అంది ఈసడింపుగా అరుణ.
“నేను చెప్పేది కూడా రవ్వంత వినిపించుకోవేం అరుణా. పల్లెటూళ్లో కూడా నాగరికత పెరిగింది. రైతులంతా కిసాన్ అగ్గిపెట్టెమీద బొమ్మల్లా ఉంటారనుకుంటున్నావా? అది పొరపాటు. వ్యవసాయం కమర్షియలైజ్ అయిన తర్వాత రైతులు బాగానే డబ్బు కువ్వబోసుకుంటున్నారు. తమ పిల్లల్ని మనలాగే హుందాగా కాన్వెంట్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివించుకుంటున్నారు. ఇంటింటా కలర్ టీ.వీలు, ఫ్రిజ్లు ఉన్నాయి. ఒకటేమిటి, అన్ని స్టేటస్ సింబల్సూ వాళ్లకి అందుబాటులోకి వచ్చినాయి. రాకపోకలకు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. పల్లెటూళ్లను తక్కువ చూపు చూడకు” అన్నాను ఉపన్యాస ధోరణిలో.
నేను ఎంత చెప్పినా అరుణ చెవికెక్కలేదు. బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంది. నాకు నిబ్బరం సడలిపోతున్నది. ఈడ్చి కొడదామన్నంత కోపం వచ్చినా దిగమింగుకున్నాను. మా అమ్మాయి చిత్రకు ఈ సంబంధం చూసేసరికి తాతలు దిగివచ్చినంత పని అయింది. అబ్బాయి సలక్షణంగా ఉన్నాడు. అబ్బాయికి అమ్మాయి కూడా నచ్చింది. నా మట్టుకు నాకు కట్నానిది ఒక సమస్య కాదు. ఒక లక్ష అటో ఇటో కుదురుతుంది. కానీ ఇప్పుడొచ్చిన చిక్కల్లా మా ఆవిడతోనే. అటు పూర్తీ తెలిసిందీ కాదు. ఇటు ఏమీ తెలీనిదీ కాదు.
“అబ్బాయికి ఉద్యోగం లేదు. అది ఎప్పుడు దొరుకుతుందో ఏమో. అందాకా మన అమ్మాయి పల్లెటూళ్లో కాపరం చెయ్యగలుగుతుందా?” అంటూ అబ్జక్షన్ లేవనెత్తింది.
అరుణ టౌన్లో పుట్టి టౌన్లో పెరిగింది. వాళ్ల నాన్నగారు రిటైర్డ్ తహసీల్దారు. అందుకనే పల్లెటూళ్లంటే తక్కువ చూపు. నా వాదనాపటిమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతోంది తప్ప ఆవిడ తలకెక్కడంలేదు. ఈ తలతిక్క మనిషితో ఎంత వాదించి లాభంలేదనుకుని ఒక రాజీసూత్రం ప్రతిపాదించినాను.
“రేపు పొద్దున్నే ఆ పల్లెకు పోదాం. ఇళ్లూ వాకిలీ చూద్దాం. నీకు నచ్చితే సంబంధం ఖాయం చేద్దాం. లేదా కాన్సిల్ చేద్దాం. సరేనా?” అన్నాను.
ఆ సమయంలో పురుగులన్నీ ఒకచోట వున్నవేమో, నా ప్రతిపాదనని అంగీకరించింది.
“మీరు ఒకటే నసపెడుతున్నారు. మీ పోరు పడలేకుండా వున్నాను. అలాగే కానీలెండి. మీకు తెలిసిన వాళ్లనెవరినన్నా అడిగి జీపు అరేంజి చెయ్యండి. రేపు తెల్లవారే ప్రయాణం” అంది అరుణ.
నాకు పెద్ద రిలీఫ్ దొరికినట్లయింది. అరుణకు బస్సులో ప్రయాణం చెయ్యడం నామోషీ. అట్లాఅని జీపుకోసం ఖర్చుపెట్టడం ఇష్టంలేదు. పుట్టింది డిప్యూటీ తహసీల్దారుగారింట్లో. కట్టుకుంది డిప్యూటీ ఇంజనీరుని. ఆ మాత్రం అభిజాత్యం ఉండడం సహజమేననిపించింది. నిజానికి అడుక్కుని ఆడంబరాలు నాకు గిట్టవు. కానీ తప్పదు. ఒక కాంట్రాక్టరుని అడుక్కొని జీపు సంపాదించి పొద్దున్నే ఇంటిముందు నిలిపా.
“ఈ డొక్కు జీపు మీకెక్కడ దొరికిందండీ?” అంటూ విసుక్కున్నది మా అరుణ, జీపును పరకాయించి చూసి.
ఏదో సామెత చెప్పినట్టుంది — “పాపమని పాతచీరెయిస్తే ఇంటి వెనుకకు పోయి మూర వేసిందట” — మా అరుణ కూడా ఆ బాపతే. ఏదో సర్దిచెప్పి జీపులో ఎక్కించడమైంది. అనుకోని ప్రయాణం. ఆ పల్లెకు ఎటు పోవాలో పూర్తిగా రూటుగూడా తెలియదు నాకు.
“ఊరిపేరన్నా జ్ఞాపకముందా మీకు?” మా ఆవిడ అంది వున్నట్టుండి.
“లేకేం? పాయసంపల్లె.”
“పేరు అసహ్యంగా వుంది” మా ఆవిడ అంది ఆముదం తాగిన ముఖం పెట్టి.
“పేరులో ఏముందిలెద్దూ” అని సర్ది చెప్పాను.
మా ఆవిడ గమ్మున ఉండిపోయింది. దారిలో ఒకటిరెండు చోట్ల జీపు ఆపి రూటు అడిగి తెలుసుకున్నాం. కమలాపురం నుంచి పది కిలోమీటర్లు. పల్లెలకు వెళ్లే రోడ్డే కానీ శుభ్రంగా తారురోడ్డు.
“పల్లె అంటే దారిదొంకా వుండవనుకున్నాను. ఫరవాలేదు. పల్లెలకు కూడా తారురోడ్లు ఉన్నాయన్నమాట. అంతా కాలమార్పు” అంది మా ఆవిడ.
పల్లె నచ్చుతుందో లేదోకాని పల్లెకు వెళ్లే రోడ్డు మా ఆవిడకు నచ్చింది. నేను సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను.
దారికి ఇరువైపులా పచ్చటి పొలాలు. పొలాల మీదనుంచి వచ్చే చల్లటి పైరగాలి. ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది. ఆహ్లాదంగా ఉంది. మా ఆవిడకు ఏ అనుభూతీ ఉన్నట్లు లేదు. కునికిపాట్లు పడుతున్నది.
నా వేళ్లు పల్లెటూళ్లో వున్నవి. పుట్టిపెరిగింది అక్కడే. పొట్టకోసం ఉద్యోగరీత్యా టౌన్లల్లో ఉండవలసి వచ్చినా నాకు పల్లెపట్టులంటే ఇప్పటికీ ఇష్టమే. అందుకే పల్లెవాసన తగలగానే తలలో పాత జ్ఞాపకాలు ముసురుకున్నాయి. నా బాల్యస్మృతులన్నీ కళ్లముందు తెరమీద బొమ్మల్లా కదలసాగినాయి.
బడికి కోతకాలపు సెలవలిస్తే ఎంత సంబరం! జైలు నుంచి విడుదలైనా అంత సంతోషం ఉండదేమో! మా పిల్లజీతగాడి వెంట బీళ్లల్లోకి బర్రెలను మేపడానికి వెళ్లేవాణ్ని. అక్కడ గంటలు క్షణాల్లా గడిచిపోయేవి. ఏట్లో పడి కేరింతలు కొడుతూ గంటలుగంటలు పొద్దెరక్కుండా ఈదేవాళ్లం. చేపలూ, ఎండ్రకాయలూ పట్టి కాల్చుకుని తినేవాళ్లం. ఇంటిదారి పట్టగానే బర్రెల మీదనో, దున్నపోతుల మీదనో స్వారి! ఈ అనుభూతులన్నీ కూడా నామట్టుకు నాకు నిన్నమొన్నటివిలా కనిపిస్తాయి. చింతాకంత దిగులులేకుండా గడిచిపోయిన చిన్ననాటి రోజులు! పల్లెటూళ్లంటే అందుకే నాకు ప్రాణం!
పల్లెటూళ్లలో నా చిన్ననాటి దినాల్లో జీవనవిధానమే వేరు. ఒక రకమైన సోషలిజం ఉండేదనిపిస్తుంది. జనాల్లో ఇప్పుడున్నంత డబ్బుపిచ్చి అప్పుడు లేదనిపిస్తుంది. పొలంపుట్రా వున్న రైతుకూ, కూలీనాలీ చేసుకొని కడుపునింపుకునే మాలామాదిగలకూ మధ్య బతుకుల్లో పెద్ద అంతరం ఉండేదికాదు. మా పిల్లజీతగాడి కుటుంబానికీ, మా కుటుంబానికీ మధ్య తిండి తీర్థాల్లో తేడా కనిపించేదికాదు. పొద్దున్నే సంకటి, మధ్యాహ్నం కొర్రకూడు, రాత్రికి జొన్నరొట్టె — అందరి తిండి ఇదే.
వరికూడు ఒక అపురూపమైన భోజనం. అది దొరకాలంటే చచ్చేంత రోగమన్నా రావాలి. లేదా పండగలో పబ్బాలో రావాలి. ముతక పంచెలూ, ముతక చొక్కాలూ అందరికీ అందుబాటులోవున్న దుస్తులు. దారిద్య్రం మూలంగా వచ్చిన సోషలిజమేమో అది!
ఇవన్నీ నా చిన్ననాటి దినాలు. స్వాతంత్ర్యానికి పూర్వం వున్న రోజులు.
“ఏమిటాలోచిస్తున్నారు?” కునికిపాట్ల నుంచి తేరుకొని మా ఆవిడ ప్రశ్నించింది.
“చిన్నప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్నాను.”
“ఛీ! నెమరువేసుకోవడమేమిటి పశువుల్లాగా?”
“మనిషిలో ఏమూలో పశుప్రవృత్తి ఉంటుంది.”
“అది సరేగానీ, పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకోవడం వల్ల లాభం ఏమిటి?”
నోరు జారి పుసక్కిన పాతజ్ఞాపకాల ప్రసక్తి వచ్చింది. మా ఆవిడ లాభనష్టాల బేరీజు వేస్తున్నది. నిజానికి మా ఆవిడను అనబాపం. పాపం-పుణ్యం, మంచీ-చెడూ ఇవి కాదు కదా నేడు రాజ్యమేలుతూ మనల్ని శాసిస్తున్నది! లాభం-నష్టం ఇవీ మనల్ని శాసిస్తున్నాయి.
నేను గమ్మున వుండిపోయాను. ఆలివాక్యం! అడ్డుతగలడమన్నది శ్రేయోదాయకం కాదు. ముప్పైఐదేండ్ల నా వైవాహిక జీవితంలో నేను నేర్చుకున్నది అదే. ఆవిడ నోటంట పనికొచ్చే ముక్క ఒక్కటి రాకుండా జాగ్రత్తపడుతుంది. ఆవిడతో తగవుపెట్టుకొని ప్రయోజనం లేదు. ఆవిడ మారదు. నేనైనా మారాలి కదా?
మా ఆవిడ ఊరుకోలేదు. మునుకున వుండి రాయి విసిరినట్లు నా మీద మరో ప్రశ్న సంధించింది.
“ఈ పల్లెటూళ్లల్లో మనుషులు పశువుల్లాగా ఎందుకు ఖూనీలు చేసుకుంటారు?” అని.
“కక్షలకూ కార్పణ్యాలకు ఏవో కారణాలుండి తీరతాయి. నాకు తెలియదు. అదొక పరిశోధనాంశం” అన్నాను.
“పరిశోధనాంశమా పాడా. ఒకరి బాగు చూస్తే ఒకరికి పడదు. పంటలు ఏడాదికి ఒకసారి పండితే, అసూయలూ ద్వేషాలూ రోజూ పండుతాయి. ఇక ఒకర్నొకరు నరుక్కొని చావక ఏం చేస్తారు” అంది.
నేను పరిశోధనాంశం అనుకున్న విషయాన్ని మా ఆవిడ సులభంగా తేల్చిపారేసింది. రిలీఫ్ కోసం సిగరెట్టు తీసి వెలిగించాను. సిగరెట్టు ఇంకా పూర్తిగా కాలందే ఊరు వచ్చింది. బజారు మొగన జీపు కొంచెం స్లో చేసి,
“క్రిష్ణారెడ్డిగారిల్లు ఎక్కడ?” అంటూ ఒకతణ్ని అడిగాను.
“ఈ బజారు చివర్న దేవళం పక్కన వుంది చూడు” అన్నాడు.
మేము వెళ్తున్నది ఆ ఊరికి మెయిన్ బజారు లాగుంది. చక్కటి సిమెంటు రోడ్డు. పల్లెటూళ్లో సిమెంట్ రోడ్డు మా ఆవిడ ఊహించినట్లు లేదు. రోడ్డువైపు నోరువెళ్లబెట్టి వింతగా చూస్తోంది. జీపు క్రిష్ణారెడ్డిగారింటికి చేరేలోపల చాలా వింతలూ, విడ్డూరాలు చూసింది మా ఆవిడ.
ఈ ఊళ్ళో హైస్కూలు కూడా వున్నట్లుంది. జట్లుజట్లుగా స్కూలుకు వెళ్తూ ఆడపిల్లలు, మగపిల్లలు మా జీపుకు ఎదురుపడ్డారు. అంతా అత్యంతాధునిక దుస్తుల్లో వున్నారు. పల్లెల్లో ఇంతసీను వుంటుందని కూడా మా ఆవిడ ఊహించలేదు. పల్లెల పట్ల మా ఆవిడకున్న ప్రెజుడిస్ తొలగిపోయింది.
“ఫరవాలేదు. పల్లెలు బాగానే అభివృద్ధి చెందినట్లున్నాయి” అంది మా ఆవిడ.
“స్వాతంత్ర్యం వచ్చి యాభై రెండేళ్లయింది. ఈ మాత్రమన్నా అభివృద్ధి చెందకపోతే ఎట్లా?” అన్నాను.
జీపు క్రిష్ణారెడ్డిగారి ఇంటిముందు ఆగింది. కాంపౌండు తెరుచుకొని లోపలికి వెళ్లాం. పాతకాలపు ఇల్లేకాని చాలా అట్టహాసంగా వుంది. కడప కంచురాయితో కట్టబడింది.
అలికిడి విని క్రిష్ణారెడ్డిగారి భార్య అనుకుంటాను — బయటికి వచ్చి మావైపు ఎవరూ అన్నట్టు చూసింది. ఎవరమైందీ, ఎందుకొచ్చిందీ చెప్పినాను. ఆమె నాలుక కరచుకొని, “ఎవరో అనుకున్నాను” అన్నట్టుగా,
“లోపలికి రాండి” సాదరంగా ఆహ్వానించింది.
ఇంట్లోకి వెళ్లి కాళ్లూ ముఖం కడుక్కొని కూర్చున్న తర్వాత ఆమె గడపలో నిలబడి,
“కాఫీ తీసుకుంటారా? కూల్ డ్రింకా?” అంది.
“తొమ్మిదిన్నర అయింది. కూల్ డ్రింక్ ఎందుకమ్మా? కాఫీ వుంటే చాలు” అన్నాను.
“కాఫీ అయితే ప్లాస్కులో రెడీగా వుంది. ఆయన కోసం ఊళ్లోవాళ్లూ, బయటివాళ్లూ సందులేకుండా వస్తూనే వుంటారు. ప్రతిసారీ కాఫీ పెట్టాలంటే బరువు. అందుకని ప్లాస్కులో పోసి వుంచుతాను. తెస్తాను ఉండండి” అంది.
“అడగటం మరచా. క్రిష్ణారెడ్డిగారు ఎక్కడ?” నేనడిగా.
“ముందు కాఫీ తెస్తాను. తర్వాత ఆయన విషయం చెబుతా” అని ఆమె సన్నగా నవ్వుతూ లోనికి వెళ్లింది.
“కొత్తపాతా అన్న బెరుకు లేదు. మంచి కలుపుగోలు మనిషిలా వుంది” అన్నాను మా ఆవిడతో.
మా ఆవిడకు నా మాట వినిపించినట్లు లేదు. ఇల్లూ, ఇంట్లో వస్తువుల్నీ కన్నార్చకుండా చూస్తోంది. కాసేపున్న తర్వాత,
“ఫరవాలేదండీ. నాగరికత వున్న కుటుంబమే” అంది.
ఇంట్లో కలర్ టీ.వి. వుంది. ఖరీదైన ఫర్నిచర్ వుంది. ఫోన్ వుంది. ఫ్రిజ్ వుంది. ఈ స్టేటస్ సింబల్స్ చూచిన తర్వాత మా ఆవిడకు నాగరికత గల కుటుంబంగా కనిపించక మరొకలా కనిపించే అవకాశమెక్కడ?
క్రిష్ణారెడ్డిగారి భార్య ట్రేలో కాఫీ కప్పులతో ప్రత్యక్షమైంది. కాఫీ తీసుకొని తాగుతుండగా ఆమె అంది:
“అన్నా, ముందుగా మీరు ఫోన్ చేసి వచ్చుంటే బాగుండేది. ఆయనేమో డికార్టికేటింగ్ మిషన్ వద్ద వేరుశనక్కాయలు పప్పు ఆడిస్తున్నాడు. ఊళ్లోనే అనుకోండి. కానీ చాలా బిజీగా వుంటాడు. పప్పు కొనుగోలుకు ఎవరో వచ్చినట్లుంది. తూకాలు వేయించి బస్తాలకెత్తించాలి. మధ్యాహ్నం అన్నం అక్కడికే పంపమన్నాడు” అంది.
ముందు చెప్పాపెట్టకుండా రావటం పొరపాటే అనిపించింది. ఆమె మా పొరపాటును ఎత్తి చూపుతున్నట్లనిపించింది. అపరాధమనస్తత్వం ఫీలయ్యాను.
“మీకు ఫోన్ వున్న విషయం తెలియదమ్మా. అనుకోకుండా బయలుదేరి వచ్చాం. పొరపాటే” అన్నాను నొచ్చుకున్నట్లుగా.
“ఫరవాలేదన్నా. రావడం మంచిదే. మాకు ఫోన్ ఉన్నట్లు తెలియకపోవడం వల్ల పొరపాటు పడినారు. ఈ ఊళ్లో పెద్దరైతులందరికీ ఫోన్లు ఉన్నాయి. డికార్టికేటింగ్ మిషన్‌కు ఫోన్ చేస్తాను. మీరు మాట్లాడండి” అంటూ ఫోన్ డయల్ చేసి, రింగ్ కాగా రిసీవర్ నా చేతికిచ్చింది.
క్రిష్ణారెడ్డిగారికి ఫోన్లో నేనొచ్చిన విషయం చెప్పాను. ఆయన ఒక గంట తర్వాత ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. నాకు కొంచెం రిలీఫ్ దొరికింది.
“అడగటం మరచాను. అబ్బాయి కనిపించడే?” అన్నాను.
“హైదరాబాదులో ఏదో ఇంటర్వ్యూ వుందని మూడు రోజుల కిందట పోయినాడు. ఈ రోజు రావచ్చునేమో” అంది.
“ఇంటర్వ్యూనా? ఏ కంపెనీలో?” అంది మా ఆవిడ కుతూహలంగా.
“మహేంద్ర అండ్ మహేంద్ర అనుకుంటాను.”
“ఉద్యోగమేమన్నా వచ్చే అవకాశాలేమైనా కనిపిస్తున్నాయా?”
“మినిస్టర్ రెకమెండేషన్ కూడా వుంది. ఆ తర్వాత మన అదృష్టం.”
మా మధ్య కాసేపు మౌనం తాండవించింది. ఏదో పని వున్నట్లుగా క్రిష్ణారెడ్డి భార్య ఇంట్లోకి పోయింది. ఇదే అదనుగా మా ఆవిడ నాకు దగ్గరగా జరిగి రహస్యం చెబుతున్నట్టు అంది.
“ఏమండీ, ఈ సంబంధం ఖాయం చేసుకుందామండి.”
“ఉద్యోగం దొరుకుతుందని భరోసా ఏమిటి?”
“దొరక్కపోయినా ఫరవాలేదు.”
మొత్తానికి మా ఆవిడ ప్లేటు ఫిరాయించి సంబంధాన్ని ఓ.కే. చేసింది. నాకు కావలసిందీ అదే.
“మీరు పేపరు చూస్తూ వుండండి. నేను లోపలికి పోతున్నాను” అంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది.
బహుశా కాకా పట్టడానికనుకున్నాను. పది నిమిషాల్లో పేపరులోని హెడ్లైన్స్ అన్నీ చూచి పేపరు టేబుల్ మీద పడేశాను. లోపల మా ఆవిడా, క్రిష్ణారెడ్డిగారి భార్యా పిచ్చాపాటి ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కడికీ ఏమీ తోచడంలేదు. లేచి మెల్లగా వచ్చి వరండాలో నిలబడ్డాను.
పక్కనే వున్న దేవళంలో ఏదో గొడవ జరుగుతున్నట్లుంది. చాలామంది జనం పోగయ్యారు. అంతా గలగలా ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఏదీ స్పష్టంగా వినిపించడంలేదు. అక్కడికి పోతే కాసేపు కాలక్షేపమన్నా అవుతుందనిపించింది. ముక్కూ మొగం తెలియనివాళ్ల మధ్యకు వెళ్లడం ఏం బాగుంటుంది అన్న సంశయమూ కలిగింది. నిజానికి నా వృత్తి ఏదైనా, ప్రవృత్తి పల్లెటూరికి సంబంధించినదే! అనుకోకుండానే నా కాళ్లు అక్కడికి లాక్కెళ్లాయి.
దేవళం బయట నిలబడి బీడీ దమ్ములు లాగుతున్న ఒకాయనను అడిగాను.
“ఏమిటి విషయం? ఇంతమంది ఎందుకు పోగయ్యారు ఇక్కడ?”
“దొంగతనం కేసులే” అన్నాడతను నిర్లక్ష్యంగా.
“నగదా? సొత్తులా?”
“నగదూ కాదు, సొత్తులూ కాదు. వేరుశనక్కాయలు.”
“అట్లనా. ఎన్ని మూటెలు?” అన్నాను ఆసక్తిగా.
“మూటలూ కాదు. పాడూ కాదు. రెండుమూడు కే.జీలు.”
“దానికింత రాద్దాంతమా?” అన్నాను ఆశ్చర్యంగా.
“అదిగాదయ్యా. ఈ పొద్దు వంకాయ అవుతుంది. రేపు ఇంకోటి అవుతుంది. గ్రామంలో ఒక కట్టడీ, క్రమశిక్షణా లేకపోతే ఈ అలగాజనంతో ఏగలేమయ్యా” అన్నాడు.
“మంచిది. ఏం చేస్తారు ఆ దొంగని?”
“పోయిన దినాల్లో అయితే నాలుగేట్లు పిర్రెలు వాయగొట్టి ఇడ్సి పెట్టేవాళ్లం. కాలం మారిపోయింది. తంతే పోలీస్ స్టేషన్‌కు పోతారు. ఎవురు సెప్పిరి ఆసావు. ఊరి పెద్దోల్లే జరీమానా ఏస్చారు” అన్నాడు.
ఈ ప్రజాకోర్టు తీర్పు చూడాలనిపించింది. దేవళంలోకెళ్లాను. తీరా చూస్తే దొంగతనం చేసింది మగవాడు కాదు. నడిప్రాయం ఆడమనిషి! తలొంచుకొని నిలబడి వుంది. చుట్టూ వున్నవాళ్లు తలాఒక తిట్టు తిడుతున్నారు. కౌరవసభలో నిలబడ్డ ద్రౌపదిలాగుంది ఆమె పరిస్థితి! కాసేపటికి గ్రామ పెద్దలంతా వచ్చి దేవళంలో కూచున్నారు. గొడవ సద్దుమణిగింది.
“ఒరే నర్సిగా, ఎందిరా విషయం?” అన్నాడు ఒక గ్రామ పెద్ద.
చేతిలో కర్రవున్న నర్సిగాడు ముందుకు వచ్చాడు. పబ్లిక్ ప్రాసిక్యూటరులా కేసు రెప్రజెంటు చేశాడు. చేతిలో కర్ర వుండటాన్ని బట్టి వాడు పొలం కావలివాడని ఊహించాను. నా ఊహ కరెక్టే.

“తూర్పు గయినికాడ కాయిలున్నానబ్బా. పొలం నుంచీ అందరి కూలోల్లతోబాటూ ఈ మరియా వచ్చింది. నా కనుమానం వేసి క్యారియర్ సూపమన్నాను. సూపలేదు. బలవంతంగా గుంజుకొని చూస్తే కాయలుండాయి. ఈడికి తోడుకొచ్చి నిలిపినా” అన్నాడు.
“ఏమ్మే. నిజమేనా?” గద్దించాడు పెద్దమనిషి.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఇక ఏం చెప్తుంది అనుకున్నా. కానీ రుద్ధకంఠంతో ఆమె గోడు వెళ్లబోసుకుంది.
“సత్తెపమానకంగా సెబుతుండానబ్బా. నేను దొంగనూ, ముచ్చునూ కాదు. మా సంటోడు ఉడికేసిన కాయలు అని మూన్నాళ్లనుంచీ ఒకటేగా సతాయిచ్చాండాడు. పాపం నా బిడ్డ కాయలకోసం ఎంత మొగమాసినాడో. రేత్తిరి నిద్దర్లో ‘కాయలు… కాయలు…’ అని కలవరిచ్చినాడు. వాని కోసమని ఈ కాసిని కాయలు కోసుకున్నా. మీ వాములకాడ కుక్కలూ కోళ్లూ తినిపోతాండాయి. ఆపాటి విలువ సెయ్యవీ కాయలు. పొలం మీద పందులు పడీ తినిపోతాండాయి. నేను పసిపిల్లని కోసం రొన్ని కాయలు కోసుకుంటే దానికే నర్సిగాడు నా మీద ఏందో పాత కసి పెట్టుకొని దొంగతనం అంటగట్టినాడు” అని జొటజొట కన్నీరు కారుతుండగా తన గోడు వెళ్లబోసుకుంది.
కానీ పెద్దమనిషి ఏ మాత్రం స్పందించలేదు.
“నీ శ్రీరంగనీతులు చాలుగానీ, నీకు యాభై రూపాయలు జరీమానా వేసినాం. మాపటేలలోగా జుల్మానా కట్టు. ఆ కాయలు అక్కడ్నే పోసిపో” అన్నాడు.
ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ కాయలు అక్కడే కుమ్మరించింది. వెళ్లిపోయేందుకు మూడడుగులు ముందుకు వేసింది.
“వుండు!” నర్సిగాడు అరిశాడు.
ఆమె ఠక్కున ఆగింది.
“ఈ కూలిముండలకందరికీ లంగాలకు జేబులుంటాయి. ఆ జేబుల్లో గుడకా కాయలేసుకుంటారు. అదీ కూడా తనిఖీ చేయాలబ్బా” నర్సిగాడు అన్నాడు.
అక్కడికి వాడు కూలిముండాకొడుకు కానట్టు!
ఈ మాట మరియకు ఈటెపోటులా పొడుచుకుంది. ఆవేశంతో ఊగిపోయింది. సర్రున చీరె పైకెత్తి లంగా చూపి,
“సూసినావురా పోరంబోకు నాకొడకా. నా లంగాకు జేబు యాడుందిరా. ఇయ్యాల చేలోకాయలు తిన్యాను. కే.జీ. కాయలు తిన్నాను. నువు ఒక అమ్మకూ, నాయనకూ పుట్టిన్నాకొడుకువైతే కడుపుకోసి సూడాల. రారా. నా కడుపు కొయ్యరా!” అంటూ రయ్యిన దయ్యం పట్టిన మనిషిలా పోయి నర్సిగాడి చొక్కా పట్టుకొని ఈడ్చింది.
వాడు దాదాపు తూలి కిందపడబోయాడు. నిలదొక్కుకొని ఆమె మీద చెయ్యి చేసుకోబోతే పక్కనున్న మనిషి ఆపాడు. అలా రసాభాసగా ముగిసింది ఆ తీర్పు.
ఇక నాకు అక్కడ ఒక్క నిమిషం వుండబుద్ధి పుట్టలేదు. బరువెక్కిన గుండెతో నేనక్కడి నుంచి వచ్చేసరికి క్రిష్ణారెడ్డి వచ్చాడు. గతికితే అతకదని మేమక్కడ భోజనం చెయ్యదలచుకోలేదు. అదీగాక పాపం ఆయన బిజీగా వున్నాడు. ఒకరోజు ఆయనే మా ఊరికొచ్చే ఏర్పాటు చేసి మేం జీపులో బయలుదేరాం.
“ఊళ్లు బాగా అభివృద్ధి చెందినాయండీ. పరవాలేదు. ఈ సంబంధం ఖాయం చేయండి” అంది మా ఆవిడ.
ఊళ్లు బాగానే వున్నాయి. బాగాలేంది వాడలే. ఆ విషయం నాకు అర్ధగంట ముందు అవగతమైంది. అందుకని మా ఆవిడతో ఏం మాట్లాడకుండా ఆ విచారంలో పడి మౌనంగా వుండిపోయాను.
