కడప: రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాంతానికి తరలించాలనుకోవడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర నాయకుడు నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇప్పటికే జిల్లాకు కేటాయించిన ఉర్దూ యూనివర్సిటీ, డీఆర్‌డీవో రక్షణ రంగం ప్రాజెక్టు ఇతర జిల్లాలకు తరలించారన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు.
ఉక్కు పరిశ్రమను కడప జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, పశ్చిమగోదావరి జిల్లాకు తరలిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉక్కు పరిశ్రమ సాధనకు అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.