దగా చరిత్రకు ఇది కొనసాగింపు
ప్రజాప్రతినిధులంతా గొంతెత్తాల
కడప: కేంద్ర ఉక్కుశాఖ నియమించిన టాస్క్ ఫోర్సు నివేదిక ఇచ్చిందన్న సాకుతో సెయిల్ ఆధ్వర్యలో ఏర్పాటు చేస్తామన్న కడప స్టీల్ ఫ్యాక్టరీని పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించే ప్రయత్నం పచ్చిమోసమని రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక కడప జిల్లా ప్రతినిధి ఎ.రఘునాథరెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తప్పుబట్టారు. తరాల తరబడి ‘సీమ’కు జరుగుతున్న దగా చరిత్రకు ఇది కొనసాగింపేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులంతా ఈ విషయమై గొంతెత్తాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం’ ద్వారా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇపుడు ఇప్పటికే చాలా బాగా అభివృద్ధి చెందిన కోస్తా జిల్లాకు స్టీల్‌ప్లాంటును తరలిస్తూ కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల్లో తమకు సీట్లు ఇచ్చిన జిల్లాకే ప్రభుత్వాలు పని చేస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. ముడిఖనిజం తరలింపు ఖర్చు తగ్గుతుందన్న తప్పుడు సాకు చూపి తరలింపు ఆలోచన చేయడం మోసమని అన్నారు.
ప్రభుత్వరంగంలో ఉక్కు ఫ్యాక్టరీ కడప జిల్లా హక్కు అని స్పష్టం చేశారు. జిల్లాలో స్టీల్‌ప్లాంటు ప్రారంభమైన తర్వాత, కావాలంటే ఇంకో స్టీల్ ప్యాక్టరీ చంద్రబాబుకు ఇష్టమొచ్చిన చోట పెట్టుకోవచ్చన్నారు. ఎపికి ప్రత్యేకహోదా, రాయలసీమకు, ఉత్తరాంధ్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు, కడప జిల్లాకు స్టీల్‌ప్లాంటు ఉల్లంఘించకూడని షరతులని అన్నారు. ప్రత్యేక హోదాను కేంద్రం నిరాకరించిందని, రాష్ట్రం నీళ్లునములు తోందన్నారు.
ప్రత్యేక ప్యాకేజీపై నోరెత్తకుండా రాయలసీమకు మోసం చేస్తున్నారని, తాజాగా స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వకుండా కడప జిల్లా ప్రజల నోట్లో దుమ్ము కొడుతున్నారని ఆయన తప్పుపట్టారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల పైన విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు.